గమ్యం దిశగా ‘మరో ప్రజాప్రస్థానం’
Published Sun, Aug 4 2013 5:10 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గమ్యస్థానానికి చేరబోతోంది. విజయ ప్రస్థానం స్థూపం వైపు దూసుకెళ్తోంది. కనుచూపు మేరలో లక్ష్యం నిలబడింది. దాన్ని నేడు అధిగమించబోతోంది. అలుపెరగని బాటసారి వడివడిగా అడుగులేసి ముందుకు సాగుతున్నారు. మరికొన్ని గంటల్లో విజయ వాకిట్లోకి చేరుకుంటారు. చారిత్రాత్మక పాదయాత్రకు ముగింపు పలికి.. చరిత్రలో తనదైన ముద్ర వేసుకోనున్నారు మహానేత వైఎస్ తనయ షర్మిల.
సాక్షి, శ్రీకాకుళం: ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, అధికార పార్టీతో అంటు కాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వాకాన్ని ఎండగడుతూ ప్రియతమ నేత ముద్దుబిడ్డ షర్మిల చేపడుతున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర రాష్ట్ర సరిహద్దు పట్టణం ఇచ్ఛాపురం శివారుకు చేరింది. శనివారం ఉదయం 9 గంటలకు 229వ రోజు పాదయాత్ర జలంత్ర కోటలో ప్రారంభమైంది. అప్పటికే ఆ ప్రాంతానికి చేరుకున్న మహిళలు, యువకులు జగనన్న సోదరిని చూడగానే జై జగన్ అంటూ హోరెత్తించారు.‘ వస్తున్నాయ్ వస్తున్నాయ్ అదిగో జగన్నాథ రథచక్రాలు’ అనే పాటకు యువత చిందులేస్తూ పాదయాత్రలో కొనసాగారు. అశేష జనవాహిని మధ్య జాతీయ రహదారిపై ముందుకు కదిలారు. మరోవైపు అభిమానులు వైఎస్సార్ పతాకాలను పట్టుకుని ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించి జయహో జగన్ అంటూ నినదించారు. ఇక్కడ పశ్చిమ గోదావరికి చెందిన వృద్ధుడు పిల్లి సత్యనారాయణను రాజన్న తనయ ఆప్యాయంగా పలకరించగా.. ఇడుపులపాయ నుంచి షర్మిలతో కలిసి వస్తున్న ఆయన ఆనందం చెందాడు.
ఇక్కడి నుంచి కంచిలి జాతీయ రహదారిపైకొచ్చేసరికి మహిళలు పెద్ద ఎత్తున బారులు తీరారు. హారతులిచ్చి, పూల వర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు. మహానేత గారాలపట్టితో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. జీడి కార్మికులు తమ సమస్యల గోడును వివరించారు. కంచిలి జంక్షన్‌లో జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు బారులు తీరి డ్రిల్ మార్క్ చప్పట్లతో అపూర్వ స్వాగతం పలకగా.. షర్మిల కూడా పిల్లందరితో కరచాలనం చేసి అభినందనలు అందించారు. ఇక్కడ కాంట్రాక్ట్ అధ్యాపకులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రం అందజేశారు.
అక్కడి నుంచి బైరి మీదుగా పాదయాత్ర కొనసాగింది. షర్మిలమ్మ వస్తుందని తెలిసి అటు ఒడిశా, ఇటు ఆంధ్రా ప్రయాణఇకులు బస్సులు ఆపి మరి జగనన్న సోదరిని ఆప్యాయంగా పలకరించారు. దారిపొడవునా యువతీయువకులు పాదయాత్రను చిత్రీకరించేందుకు, సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసేందుకు పరుగులు తీశారు. సంత గ్రామ సమీపంలో 104 శ్రీకాకుళం జిల్లా ప్రతినిధులు రఘు, చంద్రశేఖర్,కృష్ణ తదితరులు షర్మిలను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. సానుకూలంగా స్పందించిన రాజన్న బిడ్డ జగనన్న సీఎం కాగానే సంచార సంజీవినికి ఊపిరిపోస్తారన్నారు. మధ్యాహ్న భోజనం విరామం తర్వాత పాదయాత్ర ప్రారంభమవుతుంని తెలిసి చుట్టు పక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.
జాడుపూడి, గొర్లెపాడు మీదుగా అభిమానుల కోలహాలంతో ముందుకు సాగింది. మార్గమధ్యలో ఖజూడు వద్ద జాతీయ రహదారి పక్కనే ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి షర్మిల నివాళులర్పించారు. ఆర్.కరపాడు మీదుగా కవిటి కూడలికి పాదయాత్ర చేరేసరికి స్థానికులు పెద్ద ఎత్తున హైవే మధ్య డివైడర్‌పై బారులు తీరి అఖండ స్వాగతం పలికారు. అక్కడి నుంచి గుడ్డిబద్ర మీదుగా రాత్రి బస ప్రాంతానికి షర్మిల చేరుకున్నారు. దారి పొడవునా అభిమానులు నీరాజనాలు పట్టారు.
పాదయాత్రలో వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి, ఎం.వి.కృష్ణారావు, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ, తాజా మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, చిత్తూరు నియోజకవర్గ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఐటీ విభాగం రాష్ట్ర కన్వీనర్ చల్లా మదుసూధన్‌రెడ్డి, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ నేత చలమశెట్టి సునీల్, సమన్వయకర్తలు బొడ్డేపల్లి మాధురి, జిల్లా యువజన విభాగం కన్వీనర్ హనుమంతు కిరణ్‌కుమార్, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ బొడ్డేపల్లి పద్మజ, జిల్లా అధికార ప్రతినిధి దుప్పల రవీంద్ర, పార్టీ నేతలు కొయ్య ప్రసాదరెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, పీవీఎస్‌ఎన్ రాజు, శివాజీరాజు, అంధవరపు సూరిబాబు, కోత మురళి, ధర్మాన ఉదయ భాస్కర్, పిరియా విజయ, వజ్జా గంగాభవానీ, పలికిల భాస్కరరావు, కారంగి మోహనరావు, బెందాళం హరిబాబు, ఎస్.జయప్రకాష్, డాక్టర్ జీవితేశ్వరరావు, ప్రధాన రాజేంద్రప్రసాద్, రావాడ లక్ష్మీనారాయణనాయుడు, కొత్తకోట శేఖర్, గులివిల్లి ప్రకాష్, బగాది రామకృష్ణ, బగాది నర్సింగరావు, ఎం.రాజారావు, కె.వెంకటేశ్వరరావు, పి.కామేష్, పిన్నింటి ఈశ్వరరావు, గొలివి నర్సునాయుడు పాల్గొన్నారు.
Advertisement
Advertisement