‘మర్రి’ వారసుడొచ్చాడు!
సాక్షి, రంగారెడ్డి జిల్లాప్రతినిధి: జిల్లా రాజకీయ ముఖచిత్రంలో మరో కొత్త వారసుడు దర్శనమివ్వబోతున్నారు. తెలంగాణ తొలి ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి మనవడు ఆదిత్యారెడ్డి జిల్లాలో చురుకైన పాత్ర పోషించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. పిన్న వయస్సులోనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ పార్లమెంటులో అడుగు పెట్టేందుకు జిల్లాను వేదికగా మలుచుకుంటున్నారు. జాతీయ ప్రకృతి విపత్తు నివారణ సంస్థ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న తన తండ్రి శశిధర్‌రెడ్డికి అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడిని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నారు. సొంత జిల్లా రంగారెడ్డిలో పూర్వవైభవం సాధించేందుకు ఇదే తగిన సమయమని భావిస్తున్న ఆదిత్య వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.
ఇప్పటికే జిల్లాలో కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులతో టచ్‌లో ఉన్న ఆయన.. ఎన్నికలు సమీపిస్తుండడంతో క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నియమించిన టాస్క్‌ఫోర్స్ కమిటీలో కీలక బాధ్యతలు వహిస్తున్న ఆదిత్యారెడ్డి వచ్చే వారంలో జిల్లాలో ‘పోల్ కమిటీ’ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా రంగప్రవేశం చేయాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం పీసీసీ కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్న ఆయన.. ముందుచూపుతోనే ఈ సమావేశానికి జిల్లాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. వికారాబాద్ నియోజకవర్గానికి చెందిన మర్రి కుటుంబానికి జిల్లాలో మంచి పలుకుబడి, ఆదరణ ఉంది. ఇప్పటికీ జిల్లా నేతలు మర్రి శశిధర్‌రెడ్డిని తరుచూ కలుస్తుంటారు. అధికార పార్టీలో నెలకొన్న గ్రూపు రాజకీయాల కారణంగా కొన్నేళ్లుగా జిల్లా రాజకీయాల్లో వీరి కుటుంబం త టస్థ వైఖరిని అవలంబిస్తోంది. తాజాగా సమీకరణలు మారడం, హైకమాండ్ ఆశీస్సులు మెండుగా ఉండడంతో ఇదే అదనుగా జిల్లాలో పాగా వేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యువనేత ఆదిత్యారెడ్డిని తమ వారసుడిగా జిల్లా రాజకీయాలకు పరిచయం చేయాలని మర్రి కుటుంబం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తండ్రి అసెంబ్లీకి.. తనయుడు పార్లమెంటుకు..
ముఖ్యమంత్రి రేసులో ఉన్న మర్రి శశిధర్‌రెడ్డి రానున్న సాధారణ ఎన్నికల్లో సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తే.. ఆదిత్యను చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి తిరిగి చేవెళ్ల నుంచి పోటీ చేయకపోవచ్చనే వార్తల నేపథ్యంలో ఈ సీటుపై గురిపెట్టినట్లు కనిపిస్తోంది. అయితే, ఆదిత్యారెడ్డి ఆరంగేట్రం ఇప్పటివరకు జిల్లాలో ఆధిపత్యం సాగిస్తున్న వర్గాలకు మింగుడు పడని వ్యవహారమని భావించవచ్చు. శశిధర్‌రెడ్డి మరో కుమారుడు పురూరవరెడ్డి చేవెళ్ల పార్లమెంటరీ సెగ్మెంట్ యువజన కాంగ్రెస్ ఇన్‌చార్జిగా జిల్లా రాజకీయాల్లో ఇప్పటికే చురుగ్గా వ్యవహరిస్తుండగా.. తాజాగా ఆయన అన్న కూడా రంగంలోకి దిగడం కొత్త సమీకరణకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సీటుపై సిట్టింగ్ మినహా మరో ముగ్గురు కన్నేయగా.. తాజాగా ఆదిత్య కూడా ఈ జాబితాలో చేరడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.