నందిపేట, న్యూస్‌లైన్: ఆ మాతృమూర్తిని కష్టాలు వెంటాడుతున్నాయి.. ఐదు నెలల క్రితం భర్త గుండెపోటుతో మృతి చెం దాడు. అప్పటికే మాయదారి క్యాన్సర్ రోగం బారినపడ్డ ఆ ఇల్లాలు భర్త మృతిని తట్టుకోలేకపోయింది. తాను బతికే రోజులను వేళ్లపై లెక్కేసుకుంటున్న సమయంలో భర్త మృతి చెందడం ఆ కటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఏడాదిగా ఆరోగ్యం క్షీణించి పని చేయడానికి శరీరం సహకరించకపోవడంతో సంసాదన కరువైంది. దీంతో మందులకు డబ్బుల్లేక నానాటికీ ఆరోగ్యం విషమిస్తోంది. ఒకపక్క వృద్ధ తల్లిదండ్రులు, మరోపక్క ఒక్కగానొక్క కూతురు. ఆమె భవిష్యత్ ఏమవుతుందోనని ఆలోచించి ఆ ఇల్లాలికి కంటనీరే కరువయ్యింది. వివరాలు.. నందిపేట మండలం సిర్‌పూర్ గ్రామానికి చెందిన పెంటల సత్యగంగుకు మాక్లూర్ మండలం అమ్రాద్ గ్రామానికి చెందిన బాజన్నతో వివాహం జరిగింది.
బాజన్న 20 ఏళ్ల క్రితం ఇల్లరికం వచ్చాడు. భర్త చేపలు పట్టగా వచ్చే డబ్బుతోపాటు తాను బీడీలు చుట్టగా వచ్చే సంపాదనతో జీవిం చేవారు. వీరికి సుపర్ణ అనే కూతురుతోపాటు వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు. ప్రస్తుతం సువర్ణ డొంకేశ్వర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఆరో తరగతి చదువుతోంది. ఈక్రమంలో ఏడాది క్రితం విధి ఆ పేద కుటుంబంపై కన్నెర్రజేసిం ది. గొంతులో నలతగా ఉండదని ఆస్పత్రికి వెళ్లిన సత్యగంగుకు గొంతు క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించారు. పొట్టగడవడమే కష్టంగా ఉన్న కుటుంబానికి విలువైన మందులు కొనే స్థోమత లేదు. చికిత్స కోసం లక్ష రూపాయల వరకు అప్పు చేశారు. అప్పటికే రోగం ముదిరిపోయింది. ఫలితంగా 40 ఏళ్లకే వృద్ధురాలిగా మారిపోయింది.
ఆరోగ్యశ్రీలో ఇచ్చే మందులు వాడితే గొంతులో పగుళ్లు వస్తున్నాయని, అందుకే వాటిని వాడడంలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో విధి ఆమెపై మరోసారి కక్ష తీర్చుకుంది. ఐదు నెలల క్రితం గుండెపోటుతో ఆమెభర్త బాజన్న మృతి చెందాడు. దీంతో పనిచేసేవారు లేక ఆరు నెలలుగా పొట్టగడవడమే కష్టంగా మారింది. ‘ప్రైవేటు ఆస్పత్రిలో ఇస్తున్న మందులు వాడితే ఆ పూటకు ఉపశమనం లభిస్తోంది. కానీ డబ్బుల్లేక నెల రోజులుగా వాటిని వాడడం లేదు. దీంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. అన్నం తినడం మానేసి చాలా రోజులైంది.’ అని సత్యగంగు చెబుతూ కన్నీటి పర్యంతమవుతోంది. తమ తాహతుకు మించి చికిత్స కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. అప్పులు ఇచ్చిన వారు ఇంటిచుట్టూ తిరుగుతున్నారని, తాను బతికుండగానే తన వృద్ధ తల్లిదండ్రులు, కన్నకూతురు పస్తులుంటున్నారని కంటతడి పెట్టుకుంది. బతికి ఉన్నన్ని రోజులు దయార్థ హృదయులు ఎవరైనా సహాయం చేయాలని, కనీసం ఒక్కపూట భోజనం చేసేందుకైనా తమ కుటుంబాన్ని మంచి మనసుతో ఆదుకోవాలని సత్యగంగు దాతలను వేడుకుంటుంది.
క్యాన్సర్ సోకింది.. కాపాడండి
Published Sat, Oct 26 2013 3:16 AM | Last Updated on Mon, Aug 20 2018 4:22 PM
Advertisement