కిడ్నీ మార్పిడి, క్యాన్సర్ చికిత్సలకు కవరేజీ రెట్టింపు
- రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు...
- సర్కారుకు ఆరోగ్యశ్రీ ట్రస్టు ప్రతిపాదన
- పేదలు, ప్రభుత్వోద్యోగులకు ప్రయోజనం
సాక్షి, హైదరాబాద్: కిడ్నీ మార్పిడి, క్యాన్సర్‌లోని రెండు వ్యాధులకు చేసే శస్త్రచికిత్సలకు ఆరోగ్యశ్రీలో ప్రస్తుతమున్న కవరేజీ మొత్తాన్ని పెంచాలని ఆరోగ్యశ్రీ ప్రభుత్వానికి విన్నవించింది. ఈ మేరకు ఇటీవల వైద్య ఆరోగ్యశాఖకు ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ రోగులకు ఎలాంటి వైద్య శస్త్రచికిత్స చేసినా రూ. 2 లక్షలకు మించి కవరేజీ రాదు. అంతకుమించి ఖర్చయితే రోగులే భరించాల్సి ఉంటుంది. కొందరు సీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రయత్నిస్తారు. అక్కడ అదనపు సొమ్ము విడుదలైతే సరేసరి లేకుంటే రోగి చావును వెతుక్కోవాల్సిన పరిస్థితి. అంతేగాక అధికంగా ఖర్చయ్యే శస్త్రచికిత్సలు చేయడానికి అనేక ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు ముందుకు రావడంలేదు. చాలా మంది పేదలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ రెండు చికిత్సలకు ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చే రూ. 2 లక్షలు సరిపోకపోవడంతో కవరేజీ సొమ్ము పెంచాలని ఆరోగ్యశ్రీ భావిస్తోంది. సర్కారు సంసిద్ధత తెలిపితే ఆరోగ్యశ్రీ బోర్డులో నిర్ణయం తీసుకొని అమలుచేస్తారు.
కిడ్నీ మార్పిడికి రూ. 3.24 లక్షలు
తెలంగాణలో మొత్తం 944 వ్యాధులకు ఆరోగ్యశ్రీ కింద పేదలు, ప్రభుత్వ ఉద్యోగులకు కవరేజీ ఇస్తున్నారు. అయితే వాటిల్లో అత్యంత కీలకమైన కిడ్నీ మార్పిడి, క్యాన్సర్‌లోని అక్యూట్ లింపోబ్లాస్టిక్ లుకేమియా, అక్యూట్ మైలాయిడ్ లుకేమియా శస్త్రచికిత్సలకు ఆరోగ్యశ్రీ కవరేజీ పరిధికి మించి ఖర్చవుతోంది. ఆరోగ్యశ్రీ ట్రస్టు లెక్కల ప్రకారం... కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు అంతా కలిపి రూ. 3,23,980 అవుతుందని తేల్చింది. ప్రస్తుతం ఇస్తున్న రూ.2లక్షలు పోనూ మిగతా మొత్తం పెంచాలని నిర్ణయించింది.
అక్యూట్ మైలాయిడ్ లుకేమియాకు రూ. 4.15 లక్షలు
ఆరోగ్యశ్రీలో మొత్తం 194 క్యాన్సర్లకు సంబంధించిన చికిత్సలకు కవరేజీ ఉంది. అందులో మెడికల్ అంకాలజీలోని అక్యూట్ లింపోబ్లాస్టిక్ లుకేమియాకు రూ. 2.88 లక్షలు ఖర్చవుతుందని ఆరోగ్యశ్రీ తేల్చింది. ఇక అక్యూట్ మైలాయిడ్ లుకేమియాకు రూ. 4.15 లక్షలు ఖర్చు కానుంది. కాబట్టి ఆరోగ్యశ్రీలో పై మూడు శస్త్రచికిత్సలకు తాము వేసిన లెక్కల ప్రకారం కవరేజీ పెంచాలని యోచిస్తున్నారు. దీనివల్ల అటు పేదలు, ఇటు ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందుతారు. ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపామని... సర్కారు సానుకూలంగా ఉందని... అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చాక అమలు చేస్తామని ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ చంద్రశేఖర్ ‘సాక్షి’కి తెలిపారు.