కేన్సర్.. ఖతర్నాక్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కేన్సర్ మహమ్మారి విజృంభిస్తోంది. 2015-16లో ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు చేసిన చికిత్సల్లో కేన్సర్‌కు సంబంధిం చినవే పావు శాతం ఉండటం ఆందోళన కలిగి స్తోంది. కేన్సర్ తర్వాత కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. 2015-16లో పేదలకు చేసిన చికిత్స, నిధుల ఖర్చు వివరాలతో ఆరోగ్యశ్రీ ట్రస్టు తాజా గా సమగ్ర నివేదిక విడుదల చేసింది. అందులో నిర్ఘాంతపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. 2015-16లో ఆరోగ్యశ్రీ కింద మొత్తం అన్ని రకాల వ్యాధులకు కలిపి 2,60,110 చికిత్సలు జరిగితే అందులో కేన్సర్ సంబంధిత చికిత్సలు 62,553(24.04%) ఉండటం గమనార్హం.
ఆ తరువాత కిడ్నీ చికిత్సలు 46,307(17.80%), గుండె సంబంధిత చికిత్సలు 28,426(10.92%) జరిగాయి. రాష్ట్రంలో కేన్సర్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధుల చికిత్సలు 52.77 శాతం జరి గాయి. ప్రమాద బాధిత కేసులకు చేసిన చికిత్సలు 38,409 ఉన్నా యి. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పంటల్లో రసాయనాల వాడకం పెరగడం తదితర కారణాలతో కేన్సర్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పెరగడానికి కారణం. 2015-16లో అన్ని వ్యాధుల చికిత్సకు కలిపి ప్రభుత్వం రూ. 682.99 కోట్లు కేటాయిస్తే.. రూ. 326.91 కోట్లు ఈ మూడింటికే ఖర్చు చేశారు.
బీసీలే అత్యధికం: చికిత్సల్లో అత్యధికంగా బీసీ వర్గాలకు చెందిన పేదలే ఎక్కువగా ఉన్నారు. మొత్తం 2,60,110 చికిత్సల్లో 1,40,098 మంది బీసీ వర్గాల వారే. ఆ తర్వాత మైనారిటీలకు 38,554 చికిత్సలు, ఎస్సీలకు 37,320 చికిత్సలు చేశారు. ఓసీల్లోని పేదలకు 25,782 చికిత్సలు, ఎస్టీలకు 17,584, ఇతర కేటగిరీలకు 772 చికిత్సలు జరిగాయి. వయసు ప్రకారం చూస్తే 36 నుంచి 65 ఏళ్ల వారికే అత్యధికంగా వైద్య చికిత్సలు నిర్వహించారు. 36 నుంచి 45 ఏళ్ల మధ్య వారికి 53,844 చికిత్సలు, 46-55 ఏళ్ల మధ్య 53,797 చికిత్సలు, 56-65 ఏళ్ల మధ్య వారికి 41,127 చికిత్సలు జరిగాయి.
అత్యంత తక్కువగా 15-25 ఏళ్ల మధ్య వయసు వారికి 22,929 చికిత్సలు జరిగాయి. చికిత్స చేయించుకున్న వారిలో పురుషులే అత్యధికంగా ఉండటం గమనార్హం. వివిధ వ్యాధులకు సంబంధించి పురుషులకు జరిగిన చికిత్సలు 1,32,967 ఉన్నాయి. బాలురకు 15,465 చికిత్సలు చేశారు. మహిళల్లో 1,01,840 మందికి చికిత్సలు నిర్వహించగా.. బాలికల్లో 9,838 మందికి చికిత్స చేశారు. 2015-16లో నిర్వహించిన చికిత్సల్లో ప్రభుత్వాస్పత్రుల్లో 76,166, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో 1,83,944 చికిత్సలు జరిగాయి. ఆ ప్రకారం సర్కారు నుంచి ప్రభుత్వాస్పత్రులకు రూ.188.97 కోట్లు ఆరోగ్యశ్రీ నిధులు కేటాయించగా.. ప్రైవేటు ఆస్పత్రులకు రూ.494 కోట్లు కేటాయించింది. అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు నిర్వహించారు.