చిన్నారి తల్లి సుధారాణి నుంచి ఈకేవైసీ తీసుకుంటున్న వలంటీర్, ఆస్పత్రిలో చిన్నారి
కొత్తూరు: గెల్లంకి రవికుమార్, సుధారాణిలది శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని ఓండ్రుజోల గ్రామం. అయితే కొద్ది రోజుల కిందట ఉపాధి కోసం బెంగళూరు వెళ్లారు. అంతలో తమ రెండున్నరేళ్ల చిన్నారికి క్యాన్సర్ అని తెలిసింది. అక్కడే బిడ్డకు వైద్యం చేయిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే రూ.3.5 లక్షల అప్పులు చేశారు. అవి సరిపోలేదు. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇక తమ బిడ్డను ఆదుకునేది ‘ఆరోగ్యశ్రీ’ మాత్రమేనని నమ్మి ఓండ్రుజోలలోని తమ వలంటీర్ బరాటం నరసింగరావుకు ఫోన్ ద్వారా విషయం చెప్పారు. తల్లిదండ్రులు ఈకేవైసీ చేయిస్తేనే ఆరోగ్యశ్రీ కార్డు వస్తుందని వలంటీర్‌వారికి చెప్పడంతో.. తమ బిడ్డ ప్రమాదకర స్థితిలో ఉన్నాడని, ఈ పరిస్థితుల్లో ఊరికి రావడం తమకు అసాధ్యమని వారు కన్నీటి పర్యంతమయ్యారు. వారి దుస్థితికి చలించిపోయిన వలంటీర్ బెంగళూరుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
ఈ నెల 13వ తేదీన ఒండ్రుజోల నుంచి బయల్దేరి వెళ్లాడు. బెంగళూరులోని సెయింట్ జాన్సన్ ఆస్పత్రిలో వైద్యం పొందుతున్న చిన్నారి వద్దకు 14వ తేదీన చేరుకుని, తల్లిదండ్రులతో పాటు చిన్నారి వేలి ముద్రలు కూడా తీసుకుని ఈకేవైసీ చేయించాడు. ఇక ఆరోగ్య శ్రీ కార్డు మంజూరవుతుందని, సంక్రాంతి సెలవుల తర్వాత కార్డు ముద్రించి ఇస్తామని భరోసా ఇచ్చాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ చిన్నారి కోసం బెంగళూరు వచ్చిన వలంటీర్‌కు ఆ తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెప్పారు. వలంటీర్ మానవత్వాన్ని స్థానికులు మెచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment