మార్షల్ ఆర్ట్స్‌లో మెరికలు
Published Wed, Sep 4 2013 5:16 AM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM
మెదక్, న్యూస్‌లైన్: అవనిలో సగం.. ఆకాశంలో సగం.. అంటూ మహిళాలోకం ఘోషిస్తుంటే.. చదువుల్లో, ఆట పాటల్లో సైతం మేమే అంటున్నారు మెదక్‌లోని బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు. పుస్తకం పడితే చదువుల తల్లులం. కత్తి పడితే వీరనారులం. గొంతు విప్పితే..గానకోకిలలం, నృత్యం చేస్తే..నాట్య మయూరలం.. ఆటలాడితే.. ఘనాపాటిలం.. అందుకే అన్నింటా మేమే మేటి అంటూ తమ సత్తా చాటుతున్నారు ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఈ చిట్టితల్లులు.
మెదక్ పట్టణ శివారులో బోధన్-రామాయంపేట చౌరస్తాలో 5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో వెలిసింది బాలికల గురుకుల పాఠశాల. ఇందులో 5నుంచి 10వ తరగతి వరకు 470 మంది విద్యార్థినులు ఆవాసం పొందుతూ చదువుతున్నారు. గతంలో తెలుగు మాధ్యమంలో ఉన్న ఈ పాఠశాల రెండేళ్ల క్రితం ఆంగ్ల మాధ్యమంలోకి మారింది. నిపుణులైన ఉపాధ్యాయుల సుశిక్షణలో వందలాది మంది విద్యార్థినులు పరిపూర్ణ విద్యావంతులుగా తయారవుతున్నారు.
2007నుంచి పదో తరగతి వార్షిక పరీక్షల్లో వరుసగా వందశాతం ఉత్తీర్ణత సాధించి తమ సత్తా చాటుతున్నారు. 2011-12లో 9.7 గ్రేడింగ్, 2012-13లో 9.5 గ్రేడింగ్ సాధించి మెదక్ డివిజన్‌లో మేటిగా నిలిచారు. క్రమశిక్షణకు మారుపేరుగా... ఆట పాటలకు వేదికగా.. విద్యార్థి సంపూర్ణ వికాసానికి లోగిలిగా నిలుస్తున్న ఈ సరస్వతీ నిలయంలో ప్రవేశం దొరకడమంటే విద్యార్థులు తమ అదృష్టంగా భావిస్తారు.
దేశంలో అక్కడక్కడ మహిళలపై దాడులు...అఘాయిత్యాల్లాంటి దుర్ఘటనలు జరుగుతున్న నేపధ్యంలో ఈ చిన్నారులను వీరనారులుగా తీర్చిదిద్దేందుకు ప్రిన్సిపాల్ రమణమ్మ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక కరాటే మాస్టర్ నగేష్ కేవలం నామమాత్రపు ఫీజుతో విద్యార్థినులకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య వందమందికి పైగా విద్యార్థినులు కఠోర శిక్షణలో పాల్గొంటున్నారు. ఈ మెరికలు ప్రదర్శించే విన్యాసాలు చూస్తుంటే ఒళ్లు జలదరిస్తుంది. బలమైన వ్యక్తులను సైతం సెకండ్ల వ్యవధిలో మట్టి కరిపించే సత్తా వీరి సొంతం.
ఆటల్లో మెరుపులు
ఎక్కడ పోటీలు జరిగినా ఈ పాఠశాల విద్యార్థులు మెజార్టీ బహుమతులు గెలుపొందుతుంటారు. తెలుగు మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామీణ క్రీడాల్లో ఈ పాఠశాల విద్యార్థులకు 51 బహుమతులు వచ్చాయి. 2010-11లో ఈ పాఠశాల విద్యార్థిని స్వరూప హ్యాండ్‌బాల్ విభాగంలో జాతీయస్థాయికి ఎంపికై కాశ్మీర్‌లో జరిగిన పోటీలో పాల్గొన్నారు. పైకా, స్కూల్‌గేమ్స్‌లో వీరే టాపర్స్‌గా నిలుస్తున్నారు.
Advertisement