- దాసకుప్పం ఎస్పీజీబీలో రూ.2.5 కోట్లను మింగేసిన మేనేజర్
- వరదయ్యపాళెం ఎస్‌బీఐలోరూ.1.88 కోట్లను కొల్లగొట్టిన డెప్యూటీ మేనేజర్
- ఇంటర్నల్ ఆడిట్‌లో లొసుగులే కారణమా ?
సాక్షి ప్రతినిధి, తిరుపతి : మొన్న సత్యవేడు మండలం దాసకుప్పంలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు (ఎస్పీజీబీ)లో స్వయం సహాయక సంఘాల మహిళలు, రైతులకు రుణాలు ఇచ్చినట్లు చూపి రూ.2.5 కోట్లను బ్రాంచ్ మేనేజర్ మనోహరుడు కాజేశారు. నిన్న వరదయ్యపాళెం మండలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో డెప్యూటీ మేనేజర్ మహేంద్ర రూ.1.88 కోట్లను మింగేశారు.
ఈ రెండు ఉదంతాలు బ్యాంకింగ్ వ్యవస్థలో డొల్లతనాన్ని బహిర్గతం చేస్తున్నాయి. బ్యాంకులపై విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. రోజువారీ ఆడిట్.. ఆర్నెల్లకు ఓ సారి ఇంటర్నల్ ఆడిట్‌లు పక్కాగా చేసి ఉంటే ఈ అక్రమాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేసే అవకాశం ఉండేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అక్రమాలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోకపోవడం.. మింగిన సొమ్మును కక్కించకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఏ రోజుకారోజు ఏ మేరకు రుణం ఇచ్చాం.. ఏ మేరకు డిపాజిట్లు వచ్చాయి.. ఎంత సొమ్మును వసూలు చేశారు అన్న లెక్కలు ప్రతి బ్యాంకులోనూ సాయంత్రం ఐదు గంటల్లోపు పూర్తి చేస్తారు. ప్రతి బ్యాంకు బ్రాంచ్‌లోనూ ఆర్నెల్లకు ఓ సారి ఇంటర్నల్ ఆడిట్ బృందం లెక్కలను తనిఖీ చేస్తుంది. నిరర్ధక ఆస్తులు, డిపాజిట్లు, రుణాలు, వసూళ్లు లాభాలు వంటి అంశాలను ఆడిట్ నివేదికలో పొందుపరుస్తారు.
ఆ నివేదిక ఆధారంగా బ్యాంకుల యాజమాన్యం చర్యలు తీసుకుంటాయి. రోజు వారీ ఆడిట్.. ఇంటర్నల్ ఆడిట్ వ్యవస్థతో బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతంగా ఉంది. దాసకుప్పం ఎస్పీజీబీ, వరదయ్యపాళెం ఎస్‌బీఐలో చోటుచేసుకున్న ఉదంతాలు బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా డొల్లతనం ఉందని ఎత్తి చూపాయి.
ఆడిట్‌లో లోపాల వల్లే..
దాసకుప్పం ఎస్పీజీబీలో మేనేజర్ మనోహరుడు 2012 నుంచి 2014, జూలై వరకూ 85 మంది రైతులు, 75 ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, 37 ఆర్‌వైఎస్ రుణాలు, 131 స్వయం సహాయక సంఘాల అధ్యక్షుల సంతకాలను ఫోర్జరీ చేసి రూ.2.5 కోట్ల రుణాలు ఇచ్చినట్టు చూపి ఆ మొత్తాన్ని కాజేశారు. ఈ ఉదంతం జూలై 25న బయటపడింది. బ్యాంకు యాజమాన్యం మనోహరుడిని సస్పెండ్ చేసి.. సత్యవేడు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసి చేతులు దులుపుకుంది.
మనోహరుడి నుంచి డబ్బును రికవరీ చేయడంపై ఎందుకు దృష్టి సారించడం లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. వరదయ్యపాళెం ఎస్‌బీఐలో డెప్యూటీ జనరల్ మేనేజర్‌గా మహేంద్ర ఫిబ్రవరి, 2010 నుంచి 2014 ఆగస్టు వరకూ పనిచేశారు. అప్పట్లో డెయిరీ, మహిళా పొదుపు సంఘాల పేరిట 41 సంఘాలను సృష్టించి రూ.1,88,95,382 రుణంగా ఇచ్చినట్లు చూపి ఆ మొత్తాన్ని మింగేశారు. ఆ బ్యాంక్ మేనేజర్ ఈ నెల 16న గుర్తించి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం విదితమే.
ఏ రోజుకారోజు ఆడిట్, ఆర్నెల్లకు ఓ సారి నిర్వహించే ఇంటర్నల్ ఆడిట్‌లు సక్రమంగా జరిగి ఉంటే ఈ అక్రమాలకు ఆదిలోనే చెక్ పడి ఉండేది. ఈ ఆడిట్‌లను సక్రమంగా చేయకపోవడంతోనే ఆ రెండు బ్యాంకుల్లోనూ ఆ ఇద్దరూ కోట్లను కొల్లగొట్టినట్లు స్పష్టమవుతోంది.
చర్యలు శూన్యం ..
బ్యాంకుల్లో అక్రమాలు చోటుచేసుకుంటే పోలీసు కేసు నమోదు చేయడంతోపాటూ సీబీఐతో కూడా విచారణ చేయిస్తారు. దాసకుప్పం ఎస్పీజీబీలో రూ.2.5 కోట్లు మింగేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మనోహరుడిపై ఇప్పటిదాకా బ్యాంకు యాజమాన్యం సీబీఐకి ఫిర్యాదు చేయలేదు. పైగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సత్యవేడు పోలీసులకూ విచారణలో ఉన్నతాధికారులు సహకరించడం లేదనే ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి.
ఈ వ్యవహారంలో దాగిన మర్మమేమిటన్నది అంతుచిక్కడం లేదు. వరదయ్యపాళెం ఎస్‌బీఐలో అక్రమాలకు పాల్పడిన మహేంద్రపై మాత్రం యాజమాన్యం కఠినమైన చర్యలు తీసుకుంది. కేసు నమోదు చేయడంతోపాటూ సస్పెండ్ చేసి, రికవరీపై దృష్టి సారించింది. సీబీఐకి కూడా ఫిర్యాదు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎస్‌బీఐ యాజమాన్యం తరహాలోనే ఎస్పీజీబీ ఉన్నతాధికారులు ఎందుకు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్న అంశంపై బ్యాంకు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.