
చౌదరి భవంతిలో భారీ చోరీ
♦ చినబాబు గదిలోకి దుండగుల చొరబాటు
♦ రూ. 57.55 లక్షల సొత్తు అపహరణ
♦ తెల్ల వారుజామున 2.30 గంటలకే
♦ రంగంలోకి దిగిన పోలీసులు
♦ సీసీ కెమెరాల పుటేజీల సేకరణ
తూర్పుగోదావరి: మండపేట పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది మాజీ ఎమ్మెల్యే వీవీఎస్‌ఎస్ చౌదరి. చౌదరిగారి వీధిలోని పెద్ద భవంతిలోనే ఆయన నివసించేది. ఆయనపై గౌరవ భావంతో ఆ ఇంటివైపు చూడాలంటేనే స్థానికులు ఆలోచిస్తారు. సమీప బంధువులు, ఇంటిలో పనిచేసే పనివాళ్లు తప్పించి ఇతరులెవరూ లోనికి పోరు. అటువంటి ఇంటిలోకి దుండగలు చొరబడి రూ. 57.55 లక్షల సొత్తును దోచుకుపోయారు. ఈ ఘటన మంగళవారం మండపేటలో తీవ్ర సంచలనం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి.
చౌదరి దత్తపుత్రుడైన వల్లూరి నారాయణమూర్తి (చినబాబు) వల్లూరి వారి వీధిలో గల తన ఇంటిని ఆధునికీకరిస్తుండటంతో ఆయన కుటుంబం కొద్దిరోజులుగా చౌదరి భవంతిలో నివాసముంటున్నది. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు చినబాబు స్వయానా వియ్యంకుడు. తన భార్య సుజాతతో కలిసి చినబాబు కింది భాగంలో నివసిస్తుండగా, ఆయన కుమారుడు, ఎమ్మెల్యే వేగుళ్ల అల్లుడైన సాయికుమార్ కుటుంబంతో కలిసి పై అంతస్తులో ఉంటున్నారు. కాగా సోమవారం అర్ధరాత్రి 2.15 గంటల సమయంలో చినబాబు భార్య సుజాతకు మెలకువ వచ్చి బాత్‌రూంకు వెళ్లారు. ఇంతలోనే బీరువా తెరుస్తున్న శబ్ధం రావడంతో భర్త అనుకుని లోపలి నుంచే ఎవరూ అని పిలిచారు.
సమాధానం లేకపోవడం, బీరువాలు తెరుస్తున్న శబ్దాలు రావడంతో దుండగులు చొరబడ్డారని గ్రహించి భయంతో ఆమె బయటకు రాకుండా బాత్‌రూంలోనే ఉండిపోయారు. కొద్దిసేపటి తర్వాత వెలుపలికి వచ్చి చూసే సరికి బీరువా తెరిచి ఉంది. అందులోని విలువైన ఆభరణాలు చోరీకి గురికావడాన్ని గుర్తించారు. అస్వస్థతతో పక్క గదిలో నిద్రపోతున్న చినబాబుకు, పై అంతస్తులోని కుమారునికి వెంటనే సమాచారం అందించారు. వెంటనే విషయాన్ని రామచంద్రపురం డీఎస్పీ మురళీకృష్ణ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే ఆయన సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. పాత నేరస్తులెవరైనా కావచ్చునని భావించి మండపట అర్బన్, రూరల్ సీఐలు గీతారామకృష్ణ, వి.పుల్లారావుల నేతృత్వం లో ప్రత్యేక బృందాలు తెల్లవారు జాము మూడు గంటల సమయం నుంచే నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ద్వారపూడి, అనపర్తి, రాజమహేంద్రవరం ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ముమ్మరంగా గాలించారు.
బాగా తెలిసున్న వారి పనేనా ?
ఇతరులు ఎవరూ లోపలికి వెళ్లేందుకు సాహసించలేని ఇంటిలో చోరీ జరిగిన తీరు చూస్తుంటే తెలిసిన వారు చేసిన పనేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు ఎనిమిది అడుగులకు పైగా ఎత్తు ఉండే పెద్ద ప్రహారీని దాటుకుని లోపలికి వెళ్లడంతో పాటు సుజాతమ్మ బాత్‌రూంకు వెళ్లిన సమయంలోనే ఇంటిలోకి చొరబడటాన్ని బట్టి దుండగుడు అప్పటి వరకు బయటే నక్కి ఉండవచ్చునంటున్నారు. తొలుత గోడ బీరువాకు ఉన్న తాళం చెవిని తెరిచి అందులోని బంగారు గాజులు తీసుకోవడంతో పాటు పక్కనే ఉన్న పర్సులోని తాళం చెవిని తీసుకుని బీరువా తాళం తెరిచి బంగారు ఆభరణాలు, నగదులను చోరీ చేశారు.
30 బంగారు గాజులు, 12 డైమండ్ గాజులు, 108 బంగారు పువ్వులు, మూడు జతల చెవి దుద్దులు, మూడు లాకెట్లతో కూడిన మూడు డైమండ్ గొలుసులు, బంగారపు చైన్, రూ. 55 వేలు నగదు, ఒక ఐఫోన్ చోరీ అయినట్టు గుర్తించారు. ఆభరణాల విలువ మొత్తం సుమారు రూ. 57 లక్షలు కాగా అందులో దాదాపు 600 గ్రాముల వరకు బంగారం, మిగిలినవి వజ్రాల విలువగా పోలీసులు చెబుతున్నారు. కాగా చోరీసొత్తు విలువ రూ. 70 లక్షలు పైబడే ఉంటుందని అంచనా.
ప్రత్యేక బృందాలతో దర్యాప్తు
డీఎస్పీ మురళీకృష్ణ నేతృత్వంలో మండపేట అర్బన్, రూరల్ సీఐలు గీతా రామకృష్ణ, వి.పుల్లారావు, మండపేట, రూరల్, అనపర్తి ఎస్‌ఐలు ఎండీ నసీరుల్లా, విద్యాసాగర్, మురళీకృష్ణ తదితరులు ఐదు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. చౌదరి, చినబాబు ఇళ్లల్లో పనిచేసే సిబ్బంది, వారివారి సంస్థల్లో పనిచేసే సిబ్బందిని విచారిస్తున్నారు. అలాగే పాత భవంతి కావడంతో వృద్ధులు ఉంటారని భావించి పాత నేరస్తులు ఎవరైనా ఈ చోరీకి పాల్పడ్డారా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. ఈ తరహా చోరీల్లో అనుభవం ఉన్న పాత నేరస్తుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. డాగ్ స్క్వాడ్‌ను రప్పించగా వల్లూరి వారి వీధి, కలువపువ్వు సెంటర్ మీదుగా డాగ్ టౌన్‌హాలు వరకు వెళ్లింది. సీసీ టీవీల పుటేజీలను పోలీసులు సేకరిస్తున్నారు. క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలను సేకరించారు.