జ్యోతిష, వాస్తు, ప్రశ్న, ముహూర్త
విభాగాల్లో పేరెన్నికగన్న పండితుడు.. మహామహోపాధ్యాయ, జ్యోతిష
విజ్ఞాన భాస్కర బిరుదాంకితుడు మధుర కృష్ణమూర్తిశాస్త్రి (88)
బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు రాజమహేంద్రవరంలోని తన నివాసంలో కన్నుమూశారు.
రాజమహేంద్రవరం కల్చరల్ : జ్యోతిష శిఖరం నేలకొరిగింది. మహామహోపాధ్యాయ, జ్యోతిష విజ్ఞాన భాస్కర మధుర కృష్ణమూర్తిశాస్త్రి బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు కృష్ణనగర్‌లోని స్వగృహంలో కన్నుమూశారు. ఆయన వయస్సు 88 ఏళ్లు. భార్య, ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆయన పెద్ద కుమారుడు వెంకటేశ్వరశర్మ విశాఖపట్టణంలో చార్టర్డు అకౌంటెంటు. రెండో కుమారుడు ఫాలశంకరశర్మ తండ్రి అడుగుజాడల్లో జ్యోతిషశాస్త్రంలో కృషి చేస్తున్నారు. మధుర కృష్ణమూర్తిశాస్త్రి అంత్యక్రియలు గురువారం ఉదయం కోటిలింగాల రేవులో జరుగుతాయి.
జననం పశ్చిమ గోదావరి..
పశ్చిమ గోదావరి తణుకు సమీపంలోని ముక్కామల గ్రామంలో మధుర కృష్ణమూర్తిశాస్త్రి 1928 ఫిబ్రవరి 28న జన్మించారు. తండ్రి వెంకయ్య, తల్లి శచీదేవమ్మ. ఆంగ్ల చదువులు 8వ తరగతి వరకు చదివిన మధుర భారతీయ శాస్త్రగ్రంథాలను ఉద్దండుల వద్ద అధ్యయనం చేశారు. పిఠాపురానికి చెందిన పీశుపాటి విశ్వేశ్వర శాస్త్రి వద్ద పంచకావ్యాలు, వ్యాకరణంలో కౌముది వరకు, వాజపేయాజుల వెంకట సుబ్రహ్మణ్య సోమయాజుల వద్ద రుగ్వేద స్మార్తం, సంస్కృత నాటకాలంకారాది సాహిత్యం, జాతక, ముహూర్త, వాస్తుశాస్త్రాలను అధ్యయనం చేశారు. శ్రీపాద వెంకట రమణ దైవజ్ఞశర్మ వద్ద జ్యోతిషరంగంలో సిద్ధాంత భాగం, పంచాంగ రచన, ధర్మశాస్త్రాల అధ్యయనం కొనసాగించారు.
జ్యోతిష, వాస్తు ధర్మశాస్త్రాలపై అనేక గ్రంథాలు
1960 ప్రాంతాల్లో రాజమహేంద్రవరానికి తరలివచ్చిన మధుర కృష్ణమూర్తిశాస్త్రి వాస్తు, జ్యోతిష, ధర్మశాస్త్రాలపై సుమారు 20 వరకు ప్రామాణిక గ్రంథాలను రచించారు. జ్యోతిష విజ్ఞాన పత్రిక అనే త్రైమాసిక పత్రికను నిర్వహిస్తున్నారు. 1989లో విశ్వవిజ్ఞాన ప్రతిష్ఠానం అనే సంస్థను స్థాపించి శాస్త్ర, విజ్ఞాన రంగాలకు చెందిన పరిశోధనలను ప్రోత్సహించేవారు. రూ.లక్షల వ్యయంతో దేశవిదేశాల నుంచి అనేక శాస్త్రగ్రంథాలను కొనుగోలు చేసి, పదిలపరిచారు. ప్రతి వేదికపైన ఆయన ఒక్కమాట తప్పనిసరిగా చెబుతూ ఉండేవారు.‘విజ్ఞాన శాస్త్రానికి పుట్టినిల్లు భారతదేశం, ఇంగ్లిష్ చదువుకున్నవారు మన చరిత్రను వక్రీకరిస్తున్నారు.’ ఈవిషయాన్ని ఆయన సోదాహరణంగా వివరించేవారు.
ఎన్నో పురస్కారాలు, సన్మానాలు..
1968లో వరంగల్ పురపాలక సంఘం సన్మానం అందుకున్నారు. 1981లో తణుకు నన్నయ భట్టారక పీఠం జ్యోతిష విజ్ఞాన భాస్కర బిరుదు ప్రదానం చేసింది. 1985లో నాటి బీహారు గవర్నర్ పెండేకంటి వెంకట సుబ్బయ్య చేతుల మీదుగా హైదరాబాద్‌లో కనకాభిషేకాన్ని అందుకున్నారు. 1992లో రాజమహేంద్ర పురపాలక సంఘం ఆధ్వర్యంలో సన్మానం జరిగింది. 1997లో ఆంధ్రీప్రతిభా ప్రతిష్టాన్ సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ సి.నారాయణరెడ్డి చేతుల మీదుగా ప్రతిభా వైజయంతిక పురస్కారాన్ని, 1998లో మద్రాసు తెలుగు అకాడమీ ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు.
2000లో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వాచస్పతి బిరుదుతో ఆయనను సత్కరించింది. ఇదే సంస్థ చేతులమీదుగా తరువాత కాలంలో ఆయన మహామహోపాధ్యాయ బిరుదును అందుకున్నారు. సంస్కృత భాషలో శాస్త్రాలను అధ్యయనం చేసి, ప్రావీణ్యతను గడించినందుకు 2004లో నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా సత్కారాన్ని అందుకున్నారు. ఇవి ఆయన అందుకున్న సత్కారాల పరంపరలో కొన్ని మాత్రమే.
తీరని కోరిక
పంచాంగ రచనలలో ఏకవాక్యతను సాధించాలని మధుర కృష్ణమూర్తిశాస్త్రి చివరి వరకు తాపత్రయపడ్డారు. గత ఏడాది జరిగిన గోదావరి పుష్కరాల సందర్భంగా ఆయన విభిన్న పంచాంగకర్తలను సమావేశపరిచి, ఏకాభిప్రాయాన్ని సాధించాలని భావించారు. సిద్ధాంతకర్తలు విభిన్న సిద్ధాంతాలను ప్రచారం చేయడం వల్ల ప్రజలు అయోమయానికి గురవుతున్నారని ఆయన అనేవారు.
నేలకొరిగిన జ్యోతిష శిఖరం
Published Thu, Apr 7 2016 1:03 AM | Last Updated on Sun, Sep 3 2017 9:20 PM
Advertisement
Advertisement