- కేంద్ర హోంశాఖ సమీక్షలో తెలంగాణ ప్రభుత్వం వాదన
- విభజన చట్టంలోని నిబంధనను ఎత్తిచూపిన సీఎస్ రాజీవ్ శర్మ
- పదో షెడ్యూల్‌లోని సంస్థలను ఉమ్మడిగా ఉంచాలన్న ఏపీ సీఎస్
- హైదరాబాద్‌లో శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించాలని విజ్ఞప్తి
- అన్నింటిపై న్యాయ సలహా తీసుకుంటామన్న కేంద్రం
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పీటముడి పడిన విభజన అంశాలపై కేంద్రం సమీక్ష నిర్వహించింది. హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి ఏకే సింగ్ శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, సీనియర్ అధికారులతో భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న విద్యుత్ వివాదాలతోపాటు విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలోని ఎవరికీ కేటాయించని సంస్థలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
పదో షెడ్యూల్‌లోని సంస్థలు ఉమ్మడి నిర్వహణ కింద ఉండాలని ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ప్రతిపాదించగా.. రాష్ర్ట ప్రభుత్వం అందుకు విబేధించింది. భౌగోళికంగా ఏ ప్రాంతంలో ఉన్న సంస్థలను ఆ ప్రాంతానికే కేటాయించాలని సీఎస్ రాజీవ్ శర్మ తన వాదన వినిపించారు. ఆయా సంస్థల పేర్లలో ‘ఏపీ’ పదం ఉన్నంత మాత్రాన.. వాటి నియంత్రణ, నిర్వహణ ఆంధ్రప్రదేశ్ చేతిలోనే ఉంటుందని భావించరాదని స్పష్టం చేశారు. భౌగోళికంగా అవి ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికే కేటాయించాలని విభజన చట్టమే చెబుతోందని ప్రస్తావించారు.
చట్టంలో ఎలాంటి నిబంధన లేనందున ఉమ్మడి నిర్వహణ అన్నదే ఉత్పన్నం కాదని తోసిపుచ్చారు. చట్టంలో లేని ఏ విషయంలోనూ టీ సర్కారు హక్కులు కోరడం లేదని గుర్తు చేశారు. షెడ్యూలు తొమ్మిదిలోని సంస్థలకు సంబంధించి ప్రధాన కార్యాలయం ఎక్కడుంటే అక్కడున్న ఆస్తులన్నీ హెడ్ క్వార్టర్ ఆస్తులుగా పరిగణించడం సరికాదన్నారు. మరోవైపు పదో షెడ్యూలులోని సంస్థలను ఉమ్మడి నిర్వహణలోనే ఉంచాలని.. ఉమ్మడి రాష్ట్రంలో ఆ సంస్థలకు సమకూరిన నిధులను న్యాయబద్ధంగా 2 రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది.
ఉద్యోగుల విభజనను రెండు ప్రభుత్వాల పరస్పర సంప్రదింపులతో చేయాలని, సమస్యల పరిష్కారానికి వీలుగా తటస్థ అథారిటీ ఏర్పాటుకు సెక్షన్ 8 కింద నిబంధనలు రూపొందించాలని కోరింది. హైదరాబాద్‌లో శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించాలని కూడా ఏపీ సీఎస్ విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ సమావేశంలో షెడ్యూల్ 7లోని సంస్థలకు సంబంధించిన నిధులపై కూడా చర్చ జరిగింది. ఇరు రాష్ట్రాల వాదనలను విన్న కేంద్ర హోంశాఖ బృందం.. ఈ వివరాలన్నీ కేంద్ర న్యాయ శాఖకు తెలియజేసి న్యాయసలహా తీసుకుంటామని చెప్పింది.
సీఎస్‌ల మధ్య వాగ్యుద్ధం
విభజన వివాదాల పరిష్కారంపై జరి గిన భేటీలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికృష్ణారావు, తెలంగాణ సీఎస్‌ల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి ఏకే సింగ్ సమక్షంలో ఇరువురు సీఎస్‌లూ వాడివేడిగా వాదించుకున్నారు. ఎవరు ఏమన్నారంటే..
ఏపీ సీఎస్ కృష్ణారావు
1. హైదరాబాద్ శాంతి భద్రతలను గవర్నర్‌కు అప్పగించండి. ఆంధ్ర ఉద్యోగుల్ని తెలంగాణ ఉద్యోగ సంఘాలు వివక్ష గురిచేస్తున్నారు. వేధింపులకు పాల్పడుతున్నారు. దీనిని నివారించేందుకుగాను శాంతి భద్రతలను గవర్నర్‌కే అప్పగించాలి.
2. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థను టీ సర్కార్ ఏకపక్షంగా స్వాధీనం చేసుకుంది. అధికారులను నియమించుకుంది.
3. కాలుష్య నియంత్రణ మండలి, న్యాక్‌లను తెలంగాణ ఏకపక్షంగా స్వాధీనం చేసుకుంది.
4. పదో షెడ్యూల్‌లో సంస్థల నిర్వహణ, పరిశీలన ఉభయ రాష్ట్రాల యాజమాన్యంతో ఉండాలి.
తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ
1. ఏపీ ఉద్యోగులకు ఎలాంటి వేధింపులూ లేవు. గవర్నర్‌కు శాంతిభద్రతలు అప్పగించడంపై అభ్యంతరం.
2. అలా చేయలేదు. అభ్యంతరం చెబుతున్నాం.
3. దీనిపైనా అభ్యంతరం చెబుతున్నాం.
4. దీనిపైనా అభ్యంతరం చెబుతున్నాం.