మన్యంలో రక్తచరిత్ర | Maybe the blood History | Sakshi
Sakshi News home page

మన్యంలో రక్తచరిత్ర

Published Fri, Feb 6 2015 12:30 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

మన్యంలో రక్తచరిత్ర - Sakshi

మన్యంలో రక్తచరిత్ర

  • గిరిజనులను మింగుతున్న ‘జన్యు’వ్యాధి
  • ‘సికిల్ సెల్ అనీమియా’తో చిన్నారుల మృత్యువాత
  • ఉత్తరాంధ్ర ఏజెన్సీల్లో లక్షమందికి రోగ లక్షణాలు!
  • పచ్చటి మన్యాన్ని ఓ మహమ్మారి మింగేస్తోంది... గిరిజనుల మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది.. ఏజెన్సీలలో మృత్యు ఘంటికలు మోగిస్తోంది.. చిన్నారులే లక్ష్యంగా ప్రాణాలనే హరిస్తోంది.. మందులకు లొంగని ఆ రోగానికి మన్యమంతా ఖాళీ అవుతుంటే.. సర్కారు మాత్రం మౌనాన్నే ఆశ్రయిస్తోంది. ఆదుకునే నాధుడు లేక గిరిజనుల వేదన అరణ్య రోదనే అవుతోంది...
     
    బి.గణేష్ బాబు, ’సాక్షి‘ ప్రతినిధి : సికిల్ సెల్ అనీమియా... ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాలను వణికిస్తున్న భయంకరమైన వ్యాధి ఇది. జన్యుపరమైన మార్పుల వల్ల వచ్చే ఈ జబ్బుకు ఇంతవరకు మందులు లేవు. ప్రతి గూడెంలో చిన్న పిల్లలు ఈ రోగం బారినపడి చనిపోతున్నారు. అసలు ఏజెన్సీలో ఎంతమందికి ఈ వ్యాధి ఉంది? ఎందరు మరణించారు? లాంటి గణాంకాలు కూడా ప్రభుత్వం వద్ద లేవు.

    విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని గణాంక విభాగంలో ఈ రోగులు వివరాలను అడిగితే.. అసలు సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటి..? అని అక్కడి సిబ్బంది ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో ఈ జబ్బు అదుపునకు అక్కడి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఏపీలో ఈ వ్యాధిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉత్తరాంధ్రలో దాదాపు 10 లక్షల గిరిజన జనాభా ఉంది. ఇందులో కనీసం 10 శాతం మందికి ఈ జబ్బు లక్షణాలు ఉన్నాయి. యూనివర్సిటీ స్థాయిలో ‘హ్యూమన్ జెనెటిక్స్’ విభాగం జరిపిన పలు శాంపిల్ సర్వేల్లో ఏజెన్సీ పరిసరాల్లోని గిరిజనేతరుల్లోనూ ఈ వ్యాధి కనిపిస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.
     
    మందులు లేవు.. పట్టించుకునేవారు లేరూ..

    పాడేరు పరిసరాల్లో సికిల్ సెల్ అనీమియా రోగుల సంఖ్య భారీగా ఉంది. ఎత్తయిన ప్రాంతం కావడం వల్ల ఇక్కడ ఆక్సిజన్ లభ్యతలో తేడాలుంటాయి. రోగులకు తరచూ రక్తం ఎక్కించాల్సిఉంటుంది. పాడేరు ఏరియా ఆస్పత్రిలో ఇటీవల రక్తం నిలువచేసే రిఫ్రిజరేటర్ చెడిపోయింది. అయినా పట్టించుకున్న నాధుడే లేడు. ఈ రోగానికి మందులు లేవు. సికిల్ సెల్ క్యారియర్లను గుర్తించి వారి మధ్య వివాహాలను నిరోధించేందుకు చర్యలు తీసుకోవడమే ప్రస్తుతానికి ఉన్న ఏకైక మార్గం.
     
    పరీక్ష ఖరీదు పది రూపాయిలే...

    జబ్బు నిర్ధారణకు జరిపే రక్త పరీక్ష ఖరీదు రూ.10 లోపే ఉంటుంది. రక్త నమూనాను సోడియం మెటా బై సల్ఫేట్‌లో కలపి మైక్రోస్కోప్ కింద చూస్తే రక్తకణాలు మామూలుగా ఉన్నాయా..? వంపు తిరిగి ఉన్నాయా..? అని తెలుస్తుంది. దీన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్ల(పీహెచ్‌సీ)లోనే జరపవచ్చు. విశాఖ జిల్లాలో ఈ వ్యాధి ఎక్కువగా ఉన్న  పాడేరు, అరకు పరిధిలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. అయితే ఎక్కడా సికిల్ సెల్ పరీక్షలు జరపడం లేదు. తరచూ అనారోగ్యానికి గురయ్యే రోగులు మెరుగైన చికిత్సకోసం విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రికి వచ్చినప్పుడు అక్కడ పరీక్షల్లో మాత్రమే వీరికి సికిల్ సెల్ అనీమియా ఉన్నట్లుగా నిర్ధారణ అవుతోంది.
     
    సికిల్ సెల్ అనీమియా అంటే...

    సాధారణ మనిషి రక్తంలో ఎర్ర రక్త కణాలు పెప్పర్‌మింట్ల ఆకారంలో ఉంటాయి. ఇవి రక్తనాళాల ద్వారా అవయవాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంటాయి. అయితే కొందరిలో జన్యుసంబంధ మార్పుల వల్ల ఎర్ర రక్త కణాలు గుండ్రంగా కాకుండా ‘కొడవలి’(సికిల్) ఆకారంలోకి మార్పు చెందుతాయి. ఈ సికిల్ సెల్ ఉన్నవారి రక్త కణంలోని ఒక జన్యువు సికిల్ సెల్‌గానూ, ఒకటి మామూలుగానూ ఉన్నవారిని సికిల్ సెల్ క్యారియర్లు అంటారు. ఈ క్యారియర్లకు ఎలాంటి ఆరోగ్య సమస్యలూ ఉండవు. అయితే ఇలాంటి లక్షణాలు ఉన్న ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు వారికి పుట్టే పిల్లల్లో రక్త కణంలోని రెండు జన్యువులూ వంపు తిరిగి ఉంటాయి.  వీరికి పుట్టుకతోనే ఆరోగ్య సమస్యలు వస్తాయి. మామూలు రక్త కణాల జీవితకాలం 120 రోజులైతే.. ఈ కణాల జీవిత కాలం కేవలం 20-25 రోజులే. ఇవి నశించి పోయే లోపు కొత్త ఎర్రరక్త కణాలు ఉత్పత్తి కాకపోవడంతో రోగి రక్తహీనతకు గురవుతాడు. పైగా ఈ కణాలు వంపు తిరిగి ఉండటం వల్ల సన్నటి రక్తనాళాల్లో ప్రవహించలేక ఆగిపోయి శరీర భాగాలకు ఆక్సిజన్ అందటం తగ్గిపోతుంది. దీంతో రోగి మరణిస్తాడు. ఈ జబ్బు బారినపడినవారు రక్తహీనతకు గురై పది, పదిహేనేళ్ల లోపే చనిపోతున్నారు.
     
    కొడుకు చనిపోయాడు.. కూతురుకూ వ్యాధి

    ఝాన్సీరాణి, క్రాంతిరాజు దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఝాన్సీరాణి పాడేరు సమీపంలోని కిండంగిలో ఏఎన్‌ఎంగా పనిచేస్తోంది. క్రాంతిరాజు గిరిజన కార్పొరేషన్‌లో సేల్స్‌మన్. మూడేళ్ల కిందట కొడుకు సురేశ్‌కు విపరీతమైన జ్వరం వచ్చింది. డాక్టర్లు ’సికిల్ సెల్ అనీమియా‘ అన్నారు. అన్ని రకాల వైద్యం చేయిస్తూ వచ్చినా 2013లో చనిపోయాడు. ఆ దుఃఖం నుంచి కోలుకోక ముందే కుమార్తె శ్రీలతకూ అదే జబ్బు వచ్చింది. కూతుర్ని దక్కించుకోవడమెలాగో తెలియక ఆ దంపతులు పడుతున్న వేదన వర్ణనాతీతం. ఇది వీరి ఒక్కరి సమస్యే కాదు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి గూడెంలోను వందలాది కుటుంబాలు ఇలాంటి వ్యథను అనుభవిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement