ఆర్‌ఎంసీలో ఎంబీబీఎస్ సీట్ల కోత
- వైద్య వర్గాల్లో ఆందోళన
- కోత విధించవద్దంటూ అధికారుల లేఖ
కాకినాడ క్రైం : నిత్యం వేలాది మంది రోగులు, క్షతగాత్రులకు వైద్య సేవలందించే కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో పారి శుధ్య నిర్వహణ లోపం రంగరాయ వైద్య కళాశాల (ఆర్‌ఎంసీ)కు శాపంగా పరిణమించింది. కళాశాలలోని 50 ఎంబీబీఎస్ సీట్లు కోత విధిస్తూ ఇటీవల మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఉత్తర్వులు జారీ చేయడంతో వైద్యవర్గాల్లో ఆందోళన నెలకొంది. దీనిపై తీవ్రం గా స్పందించిన ఆర్‌ఎంసీ పాలనాధికారులు కోత విధిం చవద్దంటూ లేఖ రాశారు. తిరిగి 50 ఎంబీబీఎస్ సీట్లు వస్తాయనే నమ్మకం లేదని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని డీఎం నియోనటాలజీ కోర్సు ఆర్‌ఎంసీలో ఉంది. ఇద్దరు విద్యార్థులు డీఎం నియోనటాల జీ కోర్సు చేస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యమున్న వైద్య కళాశాలలో సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందని వైద్యులు అంటున్నారు.
అన్నీ పరిష్కార సమస్యలే
ఎంసీఐ బృందం నివేదికలో పేర్కొన్న సమస్యలన్నీ పరిష్కరించగలిగేవేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాకినాడ జీజీహెచ్‌కు ఉభయ గోదావరి జిల్లాల నుంచి నిత్యం సుమారు మూడు వేల మంది రోగులు, క్షతగాత్రులు వైద్యం కోసం వస్తుంటారు. అంతేకాకుండా జీజీహెచ్ వెయ్యి పడకలకే పరిమితమైనప్పటికీ సుమారు 1500 మంది ఆస్పత్రిలోనే ఉంటూ చికిత్స పొందుతుంటారు. వారికి సేవలందించేందుకు కాంట్రాక్టు ప్రాతిపదికన సుమారు 150 మంది పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టర్ విధానాలు, ఇతర కారణాల రీత్యా వారికి సక్రమంగా జీతాలందకపోవడంతో పలుమార్లు ఆందోళనలకు దిగారు.
ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.వెంకటబుద్ధ దీనిపై స్పందించి ఆరోగ్యశ్రీ నిధుల నుంచి కార్మికులకు జీతాలు విడుదల చేయించారు. పారిశుధ్య కార్మికులు ఆందోళనకు దిగిన సమయంలో ఎంసీఐ బృందం పర్యటించడంతో ఆస్పత్రిలో అపరిశుభ్రత చోటుచేసుకోవడాన్ని వారు తీవ్రంగా పరిగణించారు. ల్యాబ్‌లో రసాయనాలు లేకపోవడం, విద్యార్థినులకు వసతి గృహం, లెక్చర్ గ్యాలరీ నిర్మాణం పూర్తి కాకపోవడం వంటి సమస్యలను మాత్రమే నివేదికలో పేర్కొన్నారు.
ఆస్పత్రిలో విద్యార్థులకు మించి రోగులుండడం, ఆధునిక వైద్య పరికరాల కారణంగా పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల నుంచి కూడా క్షతగాత్రులు ఇక్కడికి వస్తుండడం వైద్య విద్యార్థులకు ఎంతో మేలు చేస్తోంది. అవేమీ పరిగణనలోకి తీసుకోకుండా కేవలం పారిశుధ్యాన్ని సాకుగా చూపించి ఆర్‌ఎంసీలో సీట్లు కోత విధించడంపై వైద్య వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. చిన్న చిన్న సమస్యలను ప్రాతిపదికగా తీసుకుని రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో 700 సీట్లు కోత విధించినట్టు నిపుణులు చెబుతున్నారు.