కూడేరు: పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజ ర్వాయర్(పీఏబీఆర్ డ్యాం) నుంచి ధర్మవరం కుడి కాలువకు విడుదల చేసిన నీరు వృథా కాకుండా చర్యలు చేపడతామని కలెక్టర్ కోనా శశిధర్ తెలిపారు. జల్లిపల్లి నుంచి కూడేరు వరకు గల 25 కిలో మీటర్లు పొడవు గల ధర్మవరం కుడికాలువ గుండా కలెక్టర్ పర్యటించి కాలువను పరిశీలించారు. 7.5 , 10, 12వ కిలో మీటర్ల వద్ద కాలువకు ఒక్క పక్క కొంత దూరం గోడను నిర్మించకపోవడాన్ని కలెక్టర్ గమనించారు. ఎందుకు గోడ నిర్మించలేదు.
ఇలాగైతే నీరు వృధా కాదా. వేగంగా నీరు ముందుకు ఎలా ప్రవస్తుందని అధికారులను ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకం ద్వారా చెక్ డ్యాంలా గోడను నిర్మంచేందుకు చర్యలు చేపట్టాలని హెచ్‌ఎల్‌సీ అధికారులకు సూచించారు. 15వ కిలో మీటర్ వద్ద కలగళ్ళకు చెందిన రైతులు గోపాల్, ప్రభాకర్, నారాయణలు కలెక్టర్‌ను కలిశారు. కుడికాలువ కింద తగ్గు భాగంలో తమ పొలాలు ఉన్నాయని , కాలువకు నీరు విడుదల చేసినపుడు నీరు లీకై పొలంలోకి రావడంతో పంటలన్నీ దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లీకేజీలకు మరమ్మతులు చేపట్టి తమ పంటలను కాపాడాలని విన్నవించుకున్నారు.
చెరువులన్నింటికీ నీరందించడమే లక్ష్యం : 112 కిలోమీటర్లు పొడవునా గల కుడికాలువ కింద ఉన్న 49 చెరువులన్నింటినీ పూర్తి స్థాయిలో నింపడమే లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ విలేకరులకు తెలిపారు. ధర్మవరం కుడి కాలువకు గత ఏడాది రోజు సుమారు 700 క్యూసెక్కులు వరకు నీరు విడుదల చేస్తే లీకేజీల వల్ల ధర్మవరం చెరువుకు వెళ్లే సరికి 300 క్యూసెక్కులే మిగిలేవన్నారు.
ప్రస్తుతానికి ఉన్న బడ్జెట్‌తో అత్యవసర ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. నీటిని విడుదల చేసినపుడు హెచ్చెల్సీ అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు సమిష్టిగా పని చేస్తు పక్కా ప్రణాళికతో నీరు వృధా కాకుండా ముందుకు సాగేలా చూడాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ వెంట హెచ్చెల్సీ ఎస్‌ఈ శేషగిరిరావు. ఈఈ మగ్బుల్ బాషా, డీఈఈ ఏడు కొండలు, డీఈలు శ్రీధర్, మరళి, రమణ, మూర్తి, ఆర్డీఓ హుసేన్ సాహెబ్, డీపీఆర్‌ఓ జయమ్మ, ఆత్మకూరు ఎస్‌ఐ , ఏఎస్‌ఐ రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.
నీటి వృథా అరికట్టేందుకు చర్యలు
Published Thu, Jul 9 2015 3:17 AM | Last Updated on Sun, Sep 3 2017 5:08 AM
Advertisement
Advertisement