- టీటీడీలో పలుకుబడి ఉంటే రూ.లక్షల్లో బిల్లులు
- సాధారణ ఉద్యోగులకు భారీగా కోత
తిరుపతి సిటీ : టీటీడీ తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన మెడికల్ బిల్లుల(రీయింబర్స్‌మెంట్) చెల్లింపులు వివాదాస్పదంగా మారుతున్నాయి. పలుకుబడి, పైరవీలు చేయిస్తున్న ఉద్యోగులకు రూ.లక్షల్లో బిల్లులు ముట్టజెబుతున్నారని, చిన్న ఉద్యోగులకు జబ్బు చేస్తే పెట్టిన ఖర్చులను సైతం చెల్లించకుండా ఆంక్షలు విధిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో అధిక వడ్డీలకు అప్పులు చేసి ఆపరేషన్లకు ఖర్చు చేసిన చిన్నస్థాయి ఉద్యోగులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
రూ.2 లక్షలు దాటితే..
సాధారణంగా అటెండర్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు వ్యక్తిగతంగానూ, కుటుం బసభ్యులకైనా గరిష్టంగా టీటీడీ రూ.2 లక్షల మేరకు మెడికల్ బిల్లులకు పరిమి తి ఇచ్చింది. స్విమ్స్, నిమ్స్ ఆస్పత్రుల్లో తప్ప ఇతర ఆస్పత్రుల్లో వెద్యం పొందేవారికి ఇది వర్తిస్తుంది. బయట వైద్యం పొందడానికి గల కారణాలు తెలుపుతూ స్విమ్స్, నిమ్స్ వైద్యుల రెఫరల్ ఫాం అందించాల్సి ఉంటుంది. రూ. 2 లక్షల వరకు చెల్లించడానికి టీటీడీ ఈవోకు అధికారం ఉంది. ఈ పరిమితి దాటితే పాలకమండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇటీవల పాలక మండలి ఇద్దరికి పెద్దమొత్తంలో మెడికల్ బిల్లులు చెల్లించినట్లు సమాచారం. ఈ వ్యవహారాలపై బాధిత సామాన్య ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు తమ దగ్గరకు వస్తేనే వర్తిసాయా? పెద్దస్థాయిలో పైరవీలు చేసే వారికి నిబంధనలు వర్తించవా? అని ప్రశ్నిస్తున్నారు.
పరిమితిని దాటితే తిప్పలే
పరిమితిని మించే మెడికల్ బిల్లుల వ్యవహారంలో తిప్పలు తప్పడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. రూ.2.50 లక్షలు బిల్లు వస్తే అందులో నాలుగో వంతు మాత్రమే ఇస్తున్నారని సమాచారం. అదేమని ప్రశ్నిస్తే నిబంధనల ప్రకారమే చెల్లిస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు వెళ్లిన సమయంలో గుండె పోటు లాంటివి సంభవిస్తే అకస్మాత్తుగా అయ్యే ఆపరేషన్ల విషయంలోనూ కొర్రీలు వేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. టీటీడీ కొన్ని సర్జరీలకు బాధితులకు రూ.2 లక్షలు చెల్లిస్తుంది. ఇదే తరహాలో కొందరు ఉద్యోగులు మహానగరాలలో అడ్వాన్స్ టెక్నాలజీల ద్వారా కోతలేని ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. ఇవి ఓపెన్‌హార్ట్ కిందకు రావని.. కేవ లం రూ.50 వేలు మాత్రమే మంజూరవుతుందని చెబుతున్నట్లు సమాచారం.
నిబంధనల మేరకే బిల్లులు..
టీటీడీ నిబంధనల మేరకే మెడికల్ బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయి. వంద రకాల జబ్బు లు ఉన్నాయి. వాటిలో కొన్ని రూ.10 వేల బిల్లు కూడా మించనివి ఉన్నాయి. వాటన్నింటికీ నిర్ణయించిన మేరకే చెల్లిస్తున్నాం. ఎంత పరిమితి ఉంటే అంతా చెల్లించలేం కదా.. వైద్యులు ధ్రువీకరించిన మేరకే నిర్ణయాలు ఉంటాయి.
- డాక్టర్ ఎన్.వికాస్, సీఎంవో, టీటీడీ