మందుల్లేవు..! | Medicine Shortage In Anganwadi Centres prakasam | Sakshi
Sakshi News home page

మందుల్లేవు..!

Published Mon, Jul 23 2018 1:20 PM | Last Updated on Mon, Jul 23 2018 1:20 PM

Medicine Shortage In Anganwadi Centres prakasam - Sakshi

అంగన్‌వాడీ చిన్నారులతో అక్షరాలు దిద్దిస్తున్న కార్యకర్త

పొన్నలూరు: ఐదేళ్లలోపు చిన్నారులకు పోషకాహారంతో పాటు ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్య అందించి చిన్నారుల ఎదుగుదలకు దోహదపడాలనే లక్ష్యంతో స్థాపించిన అంగన్‌వాడీ కేంద్రాలు ప్రస్తుతం ఆ దిశగా అడుగులు వేయలేకపోతున్నాయి. కేంద్రాల్లో సరైన వసతులు కల్పించకపోవడంతో పాటు చిన్నారులకు ఆరోగ్య సంరక్షణ కోసం అందించాల్సిన ప్రథమ చికిత్స కిట్లు సకాలంలో సరఫరా చేయకపోవడంతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేసే మందులు రెండేళ్లుగా నిలిచిపోయాయి. దీంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆడుతూ పిల్లలు కిందపడి గాయాలపాలైతే కనీసం పూత మందు కూడా లేని పరిస్థితి. ప్రభుత్వం పంపిణీ చేసే ప్రథమ చికిత్స కిట్లు, మందులు రెండేళ్లుగా అందకపోవడంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలతో పాటు గర్భిణులు, బాలింతలు కూడా ఇబ్బందులు పడుతున్నారు.

జిల్లాలోని 21 ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో 4244 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో  మూడేళ్లలోపు చిన్నారులు 1,14,894 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులు 1,01,159 మంది ఉన్నారు. గర్భిణులు 44,978 మంది, బాలింతలు 45,240 మంది ఉన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్న పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు జ్వరం, జలుబు, దగ్గు వంటి చిరువ్యాధులు సోకినప్పుడు తాత్కాలిక ఉపశమనం పొందడానికి మందులు, సిరప్‌ ఇవ్వాల్సి ఉంది. ఆ తరువాత అంగన్‌వాడీ కార్యకర్త చిన్నారులను ఆస్పత్రికి తీసుకెళ్లేలా వారి తల్లిదండ్రులకు సూచనలు ఇవ్వాలి. కానీ ప్రస్తుతం మందుల కొరతతో అంగన్‌వాడీ కేంద్రాల్లో  ఇటువంటి పరిస్థితి లేదు. చివరిగా అంగన్‌వాడీ కేంద్రాలకు 2015 జూలై నెలలో మందుల కిట్లు అందజేసినట్లు అధికారులు తెలిపారు.

మందుల పరిస్థితి ఇదీ: అంగన్‌వాడీ కేంద్రాలకు రెండేళ్ల క్రితం సరఫరా చేసిన ప్రథమ చికిత్స సామగ్రిలోని అరకొర మందులనే నేటికీ అక్కడక్కడా కొన్ని సెంటర్లలో వినియోగిస్తున్నారు. మరి కొన్ని సెంటర్లలో తప్పనిసరి పరిస్థితుల్లో అంగన్‌వాడీ కార్యకర్తలే వారి సొంత డబ్బులతో కొనుగోలు చేసి వాడుతున్నారు. ఎక్కువ శాతం అంగన్‌వాడీ కేంద్రాల్లో కనీసం రెండేళ్ల క్రితం ఇచ్చిన మందులు కూడా లేకపోవడం గమనార్హం. అంగన్‌వాడీ కేంద్రాలకు వస్తున్న చిన్నారులు విరామ సమయాల్లో ఆడుకుని విశ్రాంతి పొందడానికి చాలా కేంద్రాల్లో అనువైన స్థలం లేదు.

పిల్లలు ఆడుకునే సమయంలో పొరపాటున కాలుజారి కిందపడితే గాయాలైనప్పుడు ప్రథమ చికిత్సగా వైద్యం చేయడానికి అందుబాటులో మందులు ఉండటం లేదు. దీంతో కేంద్రాలకు వస్తున్న పిల్లలకు కార్యకర్తలు ఆటలు నేర్పేందుకు వెనకాడుతున్నారు.

చిరు వ్యాధులకూ అంతే...
మూడేళ్లలోపు చిన్నారులకు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో పిల్లలు తరచూ రోగాల బారిన పడుతుంటారు. దగ్గు, జలుబు, జ్వరం వంటివి ఎక్కువగా వస్తుంటాయి. ఇలాంటి చిరు వ్యాధులకు అందుబాటులో మందులు ఉంచితే కొంత మేరకు చిన్నారులకు ఉపశమనం కలిగి వారి ఆరోగ్యానికి భరోసా లభిస్తుంది. అలాంటిది నేడు అంగన్‌వాడీ కేంద్రాల్లో మందులు అందుబాటులో లేవు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కొండపి, ఉలవపాడు, పొదిలి ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో సుమారుగా 719 అంగన్‌వాడీ కేంద్రాలు, 34,374 మంది చిన్నారులు, 4064 మంది గర్భిణులు, 4920 మంది బాలింతల వివరాలు మండలాల వారీగా ఇలా ఉన్నాయి.

త్వరలో మందుల కిట్లు అందజేస్తాం
అంగన్‌వాడీ కేంద్రాలకు రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఆరోగ్య సామగ్రి సరఫరా చేసింది.  ప్రస్తుతం ఇంకా కేంద్రాలకు మెడికల్‌ కిట్లు అందించలేదు. దీని ద్వారా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆరోగ్య కిట్ల ఏర్పాటుపై ప్రభుత్వం టెండర్లు నిర్వహిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తికాగానే త్వరలో అన్ని సెంటర్లకు మందులు అందజేస్తాం.– సరోజిని, ఐసీడీఎస్‌ పీడీ, ఒంగోలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement