
బీసీ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి
సాక్షి, ఉదయగిరి: ప్రస్తుత ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు గత ఎన్నికల సమయంలో ఉదయగిరి ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మళ్లీ ప్రస్తుత ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటు అడిగేందుకు ప్రజల ముందుకు వస్తున్నారని, ప్రజలను ఓటు అడిగే హక్కు ఎమ్మెల్యే బొల్లినేనికి లేదని ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఉదయగిరిలోని బీసీ కాలనీ, చాకలివీధి, పూసలకాలనీ ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం చాకలివీధిలో ఏర్పాటు చేసిన సభలో మేకపాటి మాట్లాడుతూ ప్రచారానికి వచ్చే టీడీపీ నాయకులను ఏం అభివృద్ధి చేశారని ప్రజలు ప్రశ్నించాలన్నారు.
గత ఎన్నికల సమయంలో బొల్లినేని అండర్ డ్రైనేజీ సౌకర్యం కల్పిస్తానని, నీటి సమస్య తీరుస్తానని హామీ ఇచ్చి ఇంతవరకు తీర్చలేదన్నారు. టీడీపీని సాగనంపేందుకు ఓటర్లు నడుం బిగించాలన్నారు. తాను అధికారంలోకొచ్చిన వెంటనే వెలుగొండ, సోమశిల జలాలను ఉదయగిరి ప్రాంతానికి తీసుకొచ్చి సాగు, తాగునీటి సమస్య లేకుండా తనవంతు కృషి చేస్తానన్నారు. టీడీపీ పాలనలో నాయకులు, కార్యకర్తలకు ప్రజాధనాన్ని దోచుకుని దాచుకోవడమే అలవాటై పోయిందన్నారు. వైఎస్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని, ఉదయగిరి ప్రాంతం తమ సోదరుల హయాంలోనే అభివృద్ధి చెందిందని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని మేకపాటి కోరారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాలతో అన్ని కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు.
అధికారంలోకి వచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోటీగా ఎక్కువ అబద్ధాలు చెప్పింది బొల్లినేనినే అని అన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని చాలా గ్రామాల ప్రజలు ఇంతవరకు ఎమ్మెల్యే బొల్లినేని తమ గ్రామాలకు ఒక్కసారి కూడా రాలేదని చెప్పారని, తాము ప్రచారానికి వెళ్లిన పలు గ్రామాల్లో ప్రజలు తమ దృష్టికి తెస్తున్నారని మేకపాటి తెలిపారు. త్వరలో జరిగే ఎన్నికల్లో అందుబాటులో ఉండే సమర్థవంతమైన వ్యక్తిని ఎన్నుకోవాలన్నారు. ఏప్రిల్ 11న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా ఆదాల ప్రభాకర్‌రెడ్డిని, ఉదయగిరి ఎమ్మెల్యేగా తనకు ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం పలువురు మహిళలు స్థానిక సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి, నాయకలు మూలె సుబ్బారెడ్డి, అక్కుల్‌రెడ్డి, షంషీర్, మట్ల లక్ష్మయ్య, వెంగళరెడ్డి, మధు, హరి, సలీం, జబ్బార్, లియాఖత్‌అలీ, ముర్తుజా హుస్సేన్, యు.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
నేలటూరులో..
ఉదయగిరి మండలంలోని నేలటూరుకు చెందిన పలువురు టీడీపీ నాయకులు పెండేల లక్ష్మీనరసయ్య ఆధ్వర్యం లో ఆదివారం రాత్రి వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో పెండేల రవీంద్ర, మోహనరావు, సుబ్బారావు, బూరగ లక్ష్మీనరసయ్య, మాల్యాద్రి, పతకమూరి రాములు, జానకిరాం, మేడేపల్లి సుబ్బారావుతోపాటు 30 కుటుంబాల వారు ఉన్నారు. కార్యక్రమంలో రమణయ్య, రత్నం, శ్రీనివాసులు, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.