సహజవనరులే ఆంధ్రప్రదేశ్ సంపద | mekapati goutham reddy invites investments in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

సహజవనరులే ఆంధ్రప్రదేశ్ సంపద

Published Mon, Nov 11 2019 6:44 PM | Last Updated on Mon, Nov 11 2019 6:49 PM

mekapati goutham reddy invites investments in Andhra Pradesh - Sakshi

ముంబై: సహజసిద్ధమైన నిక్షేపాలు, వనరులు, అవకాశాలు అపారంగా కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నామని పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. సోమవారం ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో జరిగిన గ్లోబల్ కెమికల్స్, పెట్రో కెమికల్స్ మ్యానుఫాక్చరింగ్ హబ్ సదస్పులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మాట్లాడుతూ... అన్ని రంగాల్లోనూ ప్రపంచస్థాయి పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో అన్నివిధాల అనుకూల వాతావరణం ఉందని స్పష్టం చేశారు. భారతదేశ పారిశ్రామికాభివృద్ధికి భవిష్యత్ ఆదాయ రంగాలన్నింటికీ ఒకటి చేసే దిశగా ఈ అంతర్జాతీయ సదస్సు ఒక ప్లాట్ ఫామ్ లా ఉపయోగపడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ఎర్రతివాచీ పరుస్తామని మంత్రి తెలిపారు.

పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలపై, అనుకూల రంగాలపై ప్రధానంగా మంత్రి ప్రసంగించారు. పారిశ్రామిక వృద్ధి సాధిచేందుకు అవలంబించాల్సిన మార్గాలు సహా ప్రపంచ స్థాయి వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలతో  పెట్టుబడులకు అవకాశాలు, మౌలిక సహజ వనరులు వంటి అంశాలను మంత్రి మేకపాటి సదస్సు వేదికగా స్పష్టంగా వివరించారు.పెట్టుబడులకు అనుకూల వాతావరణం, దేశంలోనే అతి పొడవైన తీరప్రాంతం కలిగిన రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని మంత్రి వ్యాఖ్యానించారు.  ఏపీ తీరంలో  గ్యాస్, ఆయిల్, పెట్రోలియం వంటి సహజవనరులు భారీగా ఉన్నాయని .. అవే ఏపీకి అరుదైన సహజ సంపదగా మంత్రి అభివర్ణించారు.

రాష్ట్రంలో  విశాఖపట్నం, కాకినాడ మధ్యలో ఏర్పాటు చేయనున్న పెట్రోలియం, కెమికల్ అండ్ పెట్రోకెమికల్ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్ (పీసీపీఐఆర్) కారిడార్ పెట్టుబడుల గురించి మంత్రి వివరించారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేనంతగా ఏపీకి పీసీపీఐఆర్ రీజియన్లతో పెట్టుబడులను ఆకర్షించే పొటెన్షియల్ ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాష్ట్రంలో పర్యటించి ఓఎన్జీసీ, హెచ్ పీసీఎల్, బీపీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సీఎండీలతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించిన విషయాన్ని గుర్తు చేశారు. రానున్న ఐదేళ్లలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు హామీ ఇచ్చిన విషయాన్ని ఈ వేదిక ద్వారా మేకపాటి వెల్లడించారు. త్వరలో కేంద్రమంత్రి సదానంద గౌడ రాష్ట్రంలో పర్యటించాలని మంత్రి కోరారు.

ఏపీ పారిశ్రామిక విధానం అమలులో మూలస్తంభాలు :
ఏపీలో పారిశ్రామిక విధానం అమలులో నాలుగు మూల స్తంభాలుంటాయని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. పారదర్శకత, సుపరిపాలన, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, రేపటికోసం అంతర్జాతీయ స్థాయిలో అపారమైన మానవ వనరులు వంటి సానుకూల అంశాలతో భారత ప్రభుత్వం నిర్దేశించిన 5 లక్షల ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములవుతామని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. భూ కేటాయింపులు, అనుమతులు, ప్రభుత్వం నుంచి సహకారం వంటి విషయాలలో సింగిల్ విండో విధానం అమలు చేసి, త్వరితగతిన పరిశ్రమలను పరుగులు పెట్టించనున్నామని ఆయన తెలిపారు. కేంద్రం 2025 వరకు 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థను సృష్టించాలని నిర్దేశించుకుందని..  కోస్టల్ కారిడార్,  పెట్రో కెమికల్  కారిడార్లు గ్లోబల్ ఎకనమీలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు.

అయితే, ప్రస్తుతం భారత ప్రభుత్వం నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ వాటా పెంచాలన్నదే ప్రధాన ధ్యేయమన్నారు. అంతకు ముందు, ఒడిశా రాష్ట్రానికి చెందిన పరిశ్రమలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రితో మేకపాటి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. పారిశ్రామికాభివృద్ధి, వనరులు, పెట్టుబడుల వంటి అంశాలపై మాట్లాడుకున్నారు. మంత్రి ప్రసంగం అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ముఖ్యకార్యదర్శి  రజత్ భార్గవ ఏపీ విజన్ ను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఏపీలో తీర ప్రాంతం, పోర్టులు, గ్యాస్, ఆయిల్, పెట్రో కెమికల్స్ వంటి  సహజవనరుల గురించి స్పష్టంగా వివరించారు. ఏయే రంగాలపై ఏపీ ప్రధానంగా దృష్టి పెట్టి లక్ష్యాన్ని నిర్దేశించుకుందో రజత్ భార్గవ తెలిపారు. 

ఈ కార్యక్రమంలో కేంద్ర కెమికల్స్ , ఫర్టిలైజర్స్ శాఖ మంత్రి డి.వి సదానందగౌడ, ఒడిశా రాష్ట్ర హోం, విద్యుత్, పరిశ్రమలు, సూక్ష్మ,చిన్న,మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కెప్టెన్ డిబ్య శంకర్ మిశ్రా,   కేంద్ర కెమికల్స్, ఫర్టిలైజర్స్ శాఖ ముఖ్య కార్యదర్శి రాఘవేంద్రరావు, దీపక్  నైట్రేట్ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ పి.మెహతా, ఫిక్కీ ప్లాస్టిక్, పెట్రో కెమికల్స్ పరిశ్రమల కమిటీ  ప్రభ్ దాస్, కేంద్ర కెమికల్స్ , ఫర్టిలైజర్స్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement