మేమింతే ! | Meminte! | Sakshi
Sakshi News home page

మేమింతే !

Published Sun, Nov 16 2014 1:15 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

మేమింతే ! - Sakshi

మేమింతే !

జిల్లాలో ఇసుక మాఫియా కొత్త పుంతలు తొక్కుతోంది. మంత్రి, అధికారుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. అడ్డు అదుపు లేకుండా అందినకాడికి దండుకుంటోంది. ప్రభుత్వ ధరల ప్రకారం బ్యాంకు డీడీ తీసుకెళ్లినా ఇసుక ఎత్తనంటోంది. అదనపు ‘బరువు’ పెడితేనే బండికి ఇసుక లోడు చేస్తానంటోంది. నిబంధనలను తోసిరాజంటోంది. ఇసుక రీచ్‌ల్లో రూల్స్ ఇంతేనంటోంది..ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ...ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తూ సొమ్ము చేసుకుంటోంది.
 
 సాక్షి,గుంటూరు: జిల్లాలోని ఇసుక రీచ్‌ల్లో అక్రమాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఓ వైపు కృత్రిమ కొరత సృష్టిస్తూ మరో వైపు అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. అధికారులు, మంత్రులు కలసి ఎన్ని నిబంధనలు అమలు చేసినా ఇసుక మాఫియా ఆటలకు అడ్డుకట్ట పడడం లేదు. అధికారులు అంతే.. మేమింతే అన్నట్టుగా రెచ్చిపోతున్నారు. పెరుగుతున్న ఇసుక ధరను అదుపు చేయలేకపోవడంలో లోపం ఎక్కడ ఉన్నా చివరకు కొనుగోలుదారులే అధిక మూల్యం చెల్లించుకుంటున్నారు.

  ఇసుక రీచ్‌లను మహిళా సంఘాలకు కేటాయిం చినట్టు, ధరలను అదుపులోకి తెచ్చినట్టు సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి ఈ నెల 8వ తేదీన గుంటూరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి గొప్పలకు పోయారు.

  జిల్లాలో మొత్తం తొమ్మిది ఇసుక రీచ్‌ల్లో తాడేపల్లి మండలం ఉండవల్లి, తుళ్లూరు మండలం రాయపూడి ఇసుక రీచ్‌లు మాత్రమే మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.

  ఇసుకను అధిక ధరలకు విక్రయిస్తున్నారని, లారీ లో డు ధర రూ. 25వేలు ఉందని అధికారులతోపాటు మంత్రులకు ఫిర్యాదులు అందడంతో మంత్రి  ప్రత్తిపాటి పుల్లారావు అధికారులతో సమీక్ష చేశారు.

  ఇసుక రీచ్‌ల కొత్త పాలసీ మేరకు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా 14 మంది సభ్యులతో కూడిన జిల్లా ఇసుక తవ్వక ఫెసిలిటేషన్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. జిల్లా పంచాయతీ అధికారిని కన్వీనర్‌గా, డీఆర్‌డీఏ పీడీని సెక్రటరీగా నియమించారు.

  క్యూబిక్ మీటర్ ఇసుక ధర రూ.650గా నిర్ణయించారు. ఈ మొత్తానికి గుంటూరు డిస్ట్రిక్ శాండ్ మైనింగ్ ఫెసిలిటేషన్ ఏజెన్సీ పేరిట ఆంధ్రా బ్యాంకు కన్నావారి తోట, గుంటూరు శాఖ పేరిట డీడీ చెల్లించాలన్నారు.

  మంత్రి సమావేశం అనంతరం డీఆర్‌డీఏ పీడీ రాయపూడి ఇసుక రీచ్‌కు వెళ్లి పరిశీలించారు. ఇసుక లోడింగ్ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకొన్నారు. ఆ ఒక్క రోజు మాత్రమే ఇసుక రవాణా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగింది. ఆ తరువాత మళ్లీ ‘మామూలే’నని లారీ యజమానుల సమాచారం.

  ఎప్పటిలానే తిరిగి రీచ్‌ల్లో అక్రమాలకు తెరతీశారని చెబుతున్నారు. పగలు వరకు పద్ధతిగా జరుగుతున్నా, రాత్రి వేళ్లలో అధిక వసూళ్లకు పాల్పడుతున్నారని తెలిసింది. డీడీతో పాటు అదనంగా రూ. రెండు వేలు ఇస్తేనే ఇసుకను లారీల్లో నింపుతున్నారని లేకపోతే పక్కన పెట్టమంటున్నారని చెబుతున్నారు. ఈ కారణంగానే రోడ్డు పక్కన లారీలు బారులు తీరిఉంటున్నాయని తెలుస్తోంది.

  రీచ్‌ల వద్ద అదనంగా చెల్లించే డబ్బు భారం ఇసుక వినియోగదారుడిపై పడుతుందని లారీ యజమానులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టిసారించి రీచ్‌ల్లో అక్రమాలకు చెక్ పెట్టాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement