భద్రాచలం, న్యూస్‌లైన్ : చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదని తెలిసినా.. భద్రాచలం ఐటీడీఏ అధికారులు అదేపని చేస్తున్నారు. గిరిజన సొసైటీల వారిచే ఇసుక రీచ్‌లు నిర్వహించి రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తామని గొప్పలు చెప్పుకున్న అధికారులు.. నిండా మునిగాక కానీ తేరుకోలేకపోయారు. ఇసుక రీచ్‌ల నిర్వహణలో లోపాలు జరిగాయని అంగీకరించిన ఐటీడీఏ అధికారులు మరోమారు అవకతవకలకు తావు లేకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు చెపుతున్నారు.
అయితే వీరి నిర్వాకంతో భద్రాచలం ఏజెన్సీ వాసులకు ఇసుక కష్టాలు వచ్చిపడ్డాయి. పక్కనే ఉన్న గోదావరి నదిలో ఇసుక మేటలు కనిపిస్తున్నా...ఉపయోగించుకునే అవకాశం కల్పించలేని అధికారులపై శాపనార్థాలు పెడుతున్నారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో పాటు ప్రభుత్వ పరంగా చేపట్టిన నిర్మాణాల్లోనూ పురోగతి లేకపోవటంతో తేరుకున్న అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు.
త్వరలోనే ఇసుక రీచ్‌లను తెరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి గ్రామ సర్పంచ్ అధ్యక్షతన, ఎంపీడీవోలకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించటంతో పాటు వీలైనన్ని చోట్ల ఇసుక రీచ్‌లకు అనుమతుల్విటం ద్వారా అక్రమాలకు తావులేకుండా చర్యలు చేపట్టినట్లు అధికారులు చెపుతున్నారు.
ఆడిట్ పూర్తయితేనే రీచ్‌లు తెరిచేది...
సహకార చట్టాల నిబంధనల మేరకు ఏర్పడిన సొసైటీలచే నిర్వహించినబడిన ఇసుక రీచ్‌ల ఆర్థిక లావాదేవీలపై ఆడిట్ జరిగితేనే మరోమారు వీటిని తెరిచే అవకాశం ఉంటుంది. భద్రాచలంఏజెన్సీలో గత ఏడాది ఏడు రీచ్‌లను ఏర్పాటు చేశారు. భద్రాచలం డివిజన్‌లో భద్రాచలం, గొమ్ముకొత్తగూడెం, మరికాల, మొర్రంవాని గూడెం, మొగళ్లపల్లి, గొమ్ముగూడెం, పాల్వంచ డివిజన్‌లో పాత గొమ్మూరు రీచ్‌ల ద్వారా మొత్తం రూ.18 కోట్ల మేర ఇసుక విక్రయించినట్లు అధికారులు ప్రకటించారు.
గిరిజన సొసైటీలను అడ్డుపెట్టుకొని కొంతమంది బడాబాబులే వీటిపై పెత్తనం చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారనే విమర్శలు వచ్చాయి. డివిజన్‌లో పనిచేసిన ఓ అధికారి కూడా అక్రమాలకు సహకరించాడనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. సదరు అధికారి ఇక్కడ నుంచి బదిలీ చేయించుకొని వెళ్లిపోయినప్పటకీ ఇసుక అవినీతిలో ఉన్నత స్థాయి అధికారులు కూడా కూరుకుపోయారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రస్తుత కలెక్టర్ శ్రీనివాస శ్రీ నరేష్ నిజాలు నిగ్గు తేల్చేందుకు సిద్ధమయ్యారు.
ఇసుక రీచ్‌ల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమగ్ర నివేదిక వెల్లడించాలని ఆదేశించటంతో ఐటీడీఏ అధికారులు దీనిలో తలమునకలయ్యారు. రీచ్‌లకు సంబంధించిన రికార్డులన్నింటినీ ఐటీడీఏ కార్యాలయానికి తెప్పించుకొని ఆడిట్ చేయిస్తున్నారు. గత రెండు నెలలుగా ఈ తంతు సాగుతున్నప్పటకీ లెక్క తేలకపోగా, అస్తవ్యస్తంగా ఉన్న రికార్డులను చూసి ఆడిట్ అధికారులు తలలు పట్టుకుంటున్నారని తెలసింది. కాగా భద్రాచలం ఇసుక రీచ్‌కు సంబంధించిన రికార్డులు సదరు సొసైటీ వారు అప్పగించకపోవటం గమనార్హం.
ఆడిట్ అధికారులు ఈ విషయాన్ని ఐటీడీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటకీ వారు ఉదాసీనంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. బూర్గంపాడు మండలం పాతగొమ్మూరు రీచ్‌పై కోర్టులో కేసు ఉండటంతో అది తేలితే తప్ప దీనిపై దృష్టి సారించే అవకాశం లేదు. ఇలా సవాలక్ష సమస్యల నడుమ సాగుతున్న ఆడిట్, ఎప్పటిలోగా పూర్తివుతుందనేది అనుమానమే.
చెదలు పట్టి(ంచి)న రికార్డులు...
ఇసుక రీచ్‌లకు సంబంధించిన అన్ని రకాల రికార్డులను ఆడిట్ అధికారులకు అప్పగిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. కానీ కొన్ని సొసైటీల వారు పూర్తి స్థాయిలో రికార్డులు అప్పగించకపోవటంతో ఆడిట్ ముందుకు సాగటం లేదు. ఇదిలా ఉండగా చర్ల మండలం మొగళ్లపల్లి సొసైటీ రికార్డులన్నీ చెదలు పట్టాయి. పుస్తకాలన్నీ తడిసి చెదలు పట్టగా, వాటినే గోనె బస్తాలో మూటగట్టి సదరు సొసైటీ వారు ఐటీడీఏ కార్యాలంయంలో ఆడిట్ జరుగుతున్న గదిలో పడేశారు.
తడిసి ముద్దయిన ఈ పుస్తకాలు తెరిచి చూసే అవకాశం లేకపోవటంతో లెక్క ఎలా తేలుస్తారనేది ప్రశ్నార్థకమే. ఈ రీచ్‌లోనే పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనే విమర్శలు వచ్చాయి. సుమారు రూ. 20 లక్షలు సొసైటీ వారి నుంచి రికవరీకి కూడా ఐటీడీఏ అధికారులు ఆదేశించారు. అధికార పార్టీకి చెందిన నాయకులు, వరంగల్‌కు చెందిన కొంతమంది బడా వ్యాపారుల కనుసన్నల్లో ఈ రీచ్ నిర్వహణ సాగినట్లు ఆరోపణలు వ చ్చాయి. మావోయిస్టులు కూడా ఇదే విషయమై హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మొగళ్లపల్లి సొసైటీకి సంబంధించిన రికార్డులు చెదలు పట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. అవకతవకలు బయటపడకుండా సొసైటీల మాటున రీచ్ నిర్వహించిన బడాబాబులే ఇలా చేసి ఉంటారనే ప్రచారం సాగుతోంది.
ఇసుక కష్టాలు తీరేదెప్పుడో..?
ఇసుక కొరతతో నిర్మాణ దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు, ప్రభుత్వ నిర్మాణాలకు కూపన్‌లను జారీ చేసి ఇసుకను తెచ్చుకునే వెసులుబాటును కల్పిస్తున్నప్పటకీ దీనిలో పెద్ద ఎత్తున అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మైనింగ్ శాఖకు చెందిన ఓ అధికారి రెట్టింపు ధరకు ఇసుక అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
భద్రాచలం పట్టణంలో ఇటీవల 80 ట్రక్కుల ఇసుకను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవటం ఇందుకు నిదర్శనం. గతంలో రూ.1000 చొప్పున దొరికే ఇసుక ప్రస్తుతం రూ.3 వేల వరకు పలుకుతోంది. ప్రభుత్వ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌లు కూడా అధికారులు జారీ చేసే వర్క్ ఆర్డర్ కోసం కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇసుక సమస్య కారణంగా నిర్మాణాలు ముందుకు సాగటం లేదు.
ఇళ్ల నిర్మాణాలు, ఇతర వ్యాపార సముదాయాలను నిర్మించుకునే వారు దొడ్డిదారిన లభించే ఇసుకను రెట్టింపు రేటుకు కొనుగోలు చేస్తున్నారు. మరికొందరయితే రాజమండ్రి నుంచి తెచ్చుకుంటున్నారు. సమీపాన ఇసుక పుష్కలంగా ఉన్నప్పటకీ ఇవేమి కష్టాలంటూ నిర్మాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల నిర్వాకం కారణంగానే ఇలాంటి ఇబ్బందులు వచ్చి పడ్డాయని వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి ఇసుక కొరతను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తేలని లెక్క...!
Published Sat, Feb 8 2014 3:02 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement