అక్రమార్కులకు అడ్డేది? | Sand Mafia Active In Khammam Dist | Sakshi
Sakshi News home page

అక్రమార్కులకు అడ్డేది?

Published Tue, Jan 7 2014 2:14 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

Sand Mafia Active In Khammam Dist

ఖమ్మం, న్యూస్‌లైన్: జిల్లాలో ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతోంది.  ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవలసినపలు శాఖల అధికారులు అక్రమార్కులతో చేతులు కలుపుతున్నారనే ఆరోపణలున్నా ఉన్నతాధికారులు స్పందించకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి.  ఏజెన్సీ ప్రాంతంలో ఇసుక రీచ్‌లు గిరిజన సోసైటీలకు అప్పగించాలనే నిబంధనలు తుంగలో తొక్కి...గిరిజన ఏజెన్సీల మాటున పలువురు రాజకీయ నాయకులు ఈ దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.
 జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది.  వాల్టా చట్టానికి తూట్లు పడుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో లభించే ఇసుక నాణ్యమైనది కావడంతో ఇక్కడి నుంచి హైదరాబాద్, విజయవాడ వంటి పట్టణాలకు వందలాది లారీల్లో ఇసుక రవాణా అవుతోంది. అక్కడ ఈ ఇసుకకు డిమాండ్ అధికంగా ఉండటంతో అక్రమార్కులు దందాకు తెరలేపుతున్నారు.   మాఫియా ఆగడాలు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో భూగర్భజలాలు మరింత లోతుకు వెళ్లే ప్రమాదం ఉంది.
 
 భద్రాచలం డివిజన్‌లో గోదావరి ఇసుక రీచ్‌లను గిరిజన సొసైటీలకు అప్పగించినప్పటికీ ఈ ఏడాది వాటిని తెరవకపోవటంతో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. భద్రాచలం మండలంలోని గౌరిదేవి పేట నుంచి గోదావరి నదికి ప్రత్యేకంగా ర్యాంపు  నిర్మించి ఇసుకను పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. చింతూరు, కూనవరం మండలాల్లో శబరి నది నుంచి..., దుమ్ముగూడెం మండలంలోని  వాగుల నుంచి అక్రమంగా ఇసుక తరలిపోతోంది. చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. భద్రాచలం ఇసుక రీచ్ నుంచి ఇందిరమ్మ ఇళ్లకు కూపన్‌ల ద్వారా ఇసుకను తీసుకునే వెసులుబాటు కల్పించినప్పటికీ ఒకే కూపన్‌తో రోజంతా ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇందుకు మైనింగ్ శాఖ అధికారులు సహకరిస్తున్నారని ట్రాక్టర్ యజమానులు బహిరంగంగానే అంటున్నారు. గోదావరి, శబరి నదులలో అవసరమైన చోట్ల ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేస్తే అక్రమాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది.
 
 అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలోని ఓ పేపరు మిల్లులో నిర్వహిస్తున్న పవర్‌ప్లాంటులో వినియోగించేందుకు స్థానిక వాగుల్లోని ఇసుకను కొనుగోలు చేయడంతో ఇందిర మ్మ ఇళ్లకు సైతం ఇసుక కొరత ఏర్పడింది.  వేలేరుపాడు మండలం వసంతవాడ రేవు వద్ద గోదావరి ఇసుకను తలపించే నాణ్యమైన ఇసుక ట్రాక్టర్ ధర రూ. 500 ఉంటే, అశ్వారావుపేట మండలంలోని పలు వాగుల్లోని సాధారణ ఇసుకకు పేపర్‌మిల్లులో రూ.1500 చెల్లిస్తుండటంతో పేదవాడికి ఇసుక కరువవుతోంది.  నిరుపేదలు తమ అవసరాలకు అధిక ధరలు పెట్టి ఇసుక కొనాల్సిన పరిస్థితి నెలకొంది.  పగటివేళ అధికారులు దాడులు జరిపి కేసులు నమోదు చేస్తుండటంతో రాత్రివేళ ఇసుక రవాణా సాగుతోంది. ప్రభుత్వం నిర్మించే సీసీరోడ్లు ఇతర భవనాల నిర్మాణాల్లో నాణ్యమైన  గోదావరి ఇసుక వినియోగించాలని నిబంధనలు చెప్తున్నా స్థానికంగా వాగుల్లో ఉండే నాసిరకం ఇసుకనే వాడుతున్నారు. ట్రక్కు ఇసుకకు రూ.1200 నుంచి 1500 వరకు వసూలు చేస్తున్నారు. ఎక్కడా ఎటువంటి శిస్తు చెల్లించకుండా నాణ్యత లేని ఇసుకనే అధిక ధరలకు సరఫరా చేస్తూ కాసులు దండుకుంటున్నారు.
 
 కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని కొత్తగూడెం, పాల్వంచ మండలాల్లో ముర్రేడువాగు, గోధుమవాగు, కిన్నెరసాని వాగులు ఉన్నాయి. ఆయా వాగుల నుంచి  నిత్యం పగలూ,రాత్రి ఇసుక అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. కొత్తగూడెం మండలంలోని కారుకొండ పంచాయతీ వాగునుంచి, అశోక్ నగర్ కాలనీ నుంచి ప్రధానంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఇందిరమ్మ కూపన్లు, రైల్వే శాఖ కాంట్రాక్టర్లు వద్ద ఇసుక కూపన్లు తీసుకొని  ఇసుకను అక్రమంగా తోలుకుంటున్నారు. ఏజెన్సీ, పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ ప్రాంతంలో కిన్నెరసాని, ముర్రేడు వాగుల ద్వారా ఇసుక ర్యాంపులు నిర్వహించడం, తరలించడం నిషేధం. తాగు, సాగునీరుకు ఈ వాగులే ఆధారం. కానీ,   కిన్నెరసాని వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా నిరాటంకంగా సాగుతున్నా రెవెన్యూ,  మైనింగ్ , పోలీస్ అధికారులు  పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు.
 
 మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు, చొప్పకట్లపాలెం, రామన్నపాలెం, ఇనగాలి గ్రామాల్లోని కట్లేరు నదినుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ప్రతిరోజూ ట్రాక్టర్లలో  ఇసుక తరలిపోతోంది. అధికారులు ఏమాత్రం స్పందించకపోవడంతో కట్లేరు నదిలోని సమీపంలో ఉన్న భూగర్భజలాలు ఇంకిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా ఇసుకరేవును గుర్తించకపోయినప్పటికీ అభివృద్ధిపనులు, ఇందిరమ్మ ఇళ్లపేరుతో ఇసుకను పొరుగున ఉన్న కృష్ణాజిల్లాకు కూడా అక్రమార్కులు తరలిస్తున్నారు. బోనకల్ మండలంలో బ్రాహ్మణపల్లి, కలకోట, రాయన్నపేట, మోటమర్రి గ్రామాల్లోని మున్నేరునుంచి ప్రతిరోజూ ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. అధికారులు ఎవరూ అటువైపు కన్నెత్తిచూసిన దాఖలాలులేవు. చింతకాని మండలంలోని చిన్నమండవ మున్నేరునుంచి నిబంధనలకు విరుద్దంగా రాత్రి వేళల్లో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నా రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ముదిగొండ మండలంలోని పెద్దమండవ, గంధసిరి, మున్నేరు పరివాహక ప్రాంతాలనుంచి జోరుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా నియంత్రించేవారు కరువయ్యారు.
 
 పాలేరు నియోజకవర్గంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు.   తిరుమలాయపాలెం మండలంలోని కాకరవాయి-సోలిపురం  ఏటి నుంచి రాత్రి వేళల్లో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. కాకరవాయి  నుంచి  వరంగల్ జిల్లా మరిపెడబంగ్లా వరకు, ఇటు ఖమ్మం వరకు ఇసుక దందా నడుస్తోంది.  నేలకొండపల్లి మండలంలోని చెరువుమాదారం పైనంపల్లివద్ద ఏటి నుంచి ఇసుక రోజుకు వందల ట్రక్కులు తరలుతోంది. అయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలం మున్నేరు, ఆకేరు, తీర్ధాల, పోలిశెట్టిగూడెంల నుంచి ఇసుకను రాత్రి వేళల్లో తవ్వి ఖమ్మం నగరానికి తరలిస్తున్నారు. కస్నాతండా వద్ద ఇసుక తవ్వి ట్రక్కు 5నుంచి 8వేల వరకు అమ్ముకుంటున్నా అధికారులకు ఏమీ పట్టకపోవడం విశేషం. ముదిగొండ మండలం గంధసిరి వద్ద మున్నేటిలో అక్రమంగా ఇసుకను తీసి మండలంలోని వెంకటగిరి క్రాస్ రోడ్ మీదుగా ఖమ్మం నగరం తరలిస్తున్నారు.  రాత్రి, పగలు అనే తేడా లేకుండా యథేచ్ఛగా ఇసుకను ట్రాక్టర్లలో తరలిస్తుడంటంతో పలు ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి.   కొందరు అధికారులకు నెలా నెలా ముడుపులు ముడుతుండటంతో ఇసుకాసురులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి.
 
 వైరా నియోజకవర్గంలో ప్రధానంగా వైరా మండలం ఖానాపురం, గన్నవరం, ముసలిమడుగు, గరికపాడు, పుణ్యపురం ఏటిలో నుంచి ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.  ట్రక్కు ఇసుక రూ.3 వేలకు పైగా విక్రయిస్తున్నా  నామ మాత్రపు దాడులు చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. కొణిజర్ల మండలం తీగలబంజర గ్రామంలోని పగిడేరు, అంజనాపురం గ్రామంలోని నిమ్మ వాగుల నుంచి ఇసుకను బయటి గ్రామాలకు తరలిస్తున్నారు. ఇక్కడ రూ.3 వేల నుంచి 4 వేలకు పైగా అమ్మకాాలు చేస్తున్నారు.  జూలూరుపాడు మండలం భేతాళపాడు, సూరారం, గుండ్లరేవు, కరివారిగూడెం వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. ఏన్కూరు మండలం జన్నారం, ఆరికాయలపాడు, తిమ్మరావుపేట వాగుల్లో నుంచి ఇసుక తరలిస్తున్నారు.
 
 సత్తుపల్లిలో ఇసుక అక్రమ వ్యాపారం జోరందుకుంది.  గోదావరి ఇసుక తవ్వకాలపై నిషేధం అక్రమార్కులకు కాసులు కురిపించింది. ఇసుక కొరత ఉన్నా.. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమీ చేయకపోవటంతో గృహనిర్మాణ దారుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. స్థానికంగా వాగుల్లో దొరికే ఇసుక ట్రాక్టర్ రూ.2 వేల నుంచి రూ. 2,500 పలుకుతోంది. ఇసుకలో గలసశాతం ఎక్కువగా ఉండటంతో ప్లాస్టింగ్‌లకు, కట్టుబడికి పనికి రావటంలేదని గృహనిర్మాణ యజమానులు ఆందోళన వ్యక్తం  చేస్తున్నారు.   వాగుల నుంచి ట్రాక్టర్ల ద్వారా  ఇసుక రవాణా చేస్తున్న వారి నుంచి  రెవెన్యూ, పోలీస్, ఫారెస్ట్‌శాఖల కింది స్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి అధికారి వరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.   
 
 ఇల్లెందు-గుండాల మండలాల సరిహద్దున ప్రవహించే కిన్నెరసాని, ముర్రేడు నదుల్లో లభించే ఇసుకను రాత్రి వేళల్లో అక్రమంగా తరలిస్తున్నారు.  పట్టణ ప్రాంతాలకు చెందిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్స్ ఎలాంటి అనుమతులు లేకుండా  ఇసుక తరలించుకుపోతున్నారు. సంపత్‌నగర్ సమీపంలో ముర్రేడు వాగు, పారికల వాగు,బొమ్మనపల్లి,  బోడు, కాచనపల్లి, అనంతోగు, ఆళ్లపల్లి, మామకన్ను, కిష్టాపురంపాడుల నుంచి ఇసుక తరలిపోతోంది. మండలంలోని పాఖాల, అలిగేరు, పందిపంపులవాగుల నుంచి ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. గార ్లలో పాకాల ఏటి పరివాహక గ్రామాల వద్ద అక్రమ ఇసుక దందా కొనసాగుతోంది. ఇందిరమ్మ ఇళ్ల ఇసుక కూపన్లు చూపుతూ దళారులు రాత్రి వేళల్లో ఇసుక అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. గృహ నిర్మాణశాఖ, రెవిన్యూశాఖల  కిందిస్థాయి సిబ్బంది ట్రాక్టర్ యజమానుల వద్ద ముడుపులు దండుకొని ఇసుక రవాణాకు ఇందిరమ్మ ఇళ్ల కూపన్లు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో దళారులు ఒక ట్రాక్టర్ ఇసుకను రూ.3000 అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని పలువురు పేర్కొంటున్నారు.
 
 ఖమ్మం  నగరంలోని బైపాస్ రోడ్డు, ఇల్లెందు క్రాస్‌రోడ్డుకు  ప్రతి రోజు 10 నుంచి 15 ఇసుక లారీలు భద్రాచలం, ఇతర ప్రాంతాల నుంచి వస్తుంటాయి. ఆ లారీలను అడ్డాల్లో దిగుమతి చేయించుకొని మున్నేటి ఇసుకను కలిపి, ట్రాక్టర్ల ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వ్యవసాయ ట్రాక్టర్లను చిన్న సైజుకు చేసి వినియోగదారులను సైతం మోసం చేస్తున్నారని, ఒక్కొక్క ట్రాక్టర్‌ను డిమాండ్‌ను బట్టి రూ.3 వేల నుంచి 5 వేలకు విక్రయిస్తున్నారని అంటున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement