ఇసుకాసురులు..! | sand mafia in Khammam district | Sakshi
Sakshi News home page

ఇసుకాసురులు..!

Published Fri, Nov 8 2013 3:03 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

sand mafia in Khammam district

భద్రాచలం, న్యూస్‌లైన్: కాసులు కురిపిస్తున్న గోదావరి ఇసుక ర్యాంపులు మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయాయి. గిరిజన సొసైటీల ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నట్లు ప్రకటిస్తున్నప్పటికీ.. అవి బినామీల కనుసన్నల్లో సాగుతున్నాయని అధికారులు సైతం పరోక్షంగా అంగీకరిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్‌కు చెందిన కొందరు బడా వ్యాపారులు ఇసుక సొసైటీలపై పెత్తనం సాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వారికి ఈ ప్రాంతానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి అండదండలు  ఉండటంతో అధికారులు సైతం ఈ అక్రమాలను అడ్డుకోలేకపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిలా పాపం తలా పిడికెడు అన్న చందాన పెద్ద మొత్తంలో అందుతున్న మామూళ్లతో అధికారులెవరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదనే ప్రచారం కూడా ఉంది.
 
 ఏజెన్సీలో పీసా చ ట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో గోదావరి నదిపై ఇసుక ర్యాంపులను వేలం వేయకుండా గిరిజన మహిళలతో ఏర్పడిన సొసైటీలకు అప్పగించారు. ఇలా ఈ ఏడాది భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఏడు ర్యాంపులు ప్రారంభించారు. భద్రాచలంతో పాటు మండలంలోని గొమ్ముకొత్తగూడెం, వెంకటాపురం మండలంలో మరికాల, మొర్రంవానిగూడెం, చర్ల మండలంలో మొగళ్లపల్లి, గొమ్ముగూడెం, బూర్గంపాడు మండలంలో నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన సొసైటీలకు సమీపాన ఉన్న గోదావరి నదిలో ర్యాంపులు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారు. టెండర్లు లేకుండా గిరిజన సొసైటీలకు ఇసుక రీచ్‌లను అప్పగించటం మంచిదే అయినప్పటికీ అక్రమార్కులు దీన్ని జీర్ణించుకోలేకపోయారు. గతంలో భద్రాచలం మండలం కొల్లుగూడెం ఇసుక ర్యాంపు టెండర్ల ద్వారా దక్కించుకున్న కాంట్రాక్టర్‌లు రూ.40 కోట్ల వరకు గడించారనే ప్రచారం సాగింది. ఇలా కోట్లలో లాభాలు వస్తుండడంతో ఇసుక ర్యాంపుల్లోకి బినామీ బాబులు రంగప్రవేశం చేశారు.
 
 గడువు ముగిసినా ఆగని రవాణా...
 పలు వివాదాల నడుమ ఈ ఇసుక ర్యాంపుల నిర్వహణ గడువు ముగిసింది. ఐదు రీచ్‌ల గడువు ఇటీవలే ముగియగా, వెంకటాపురం మండలం మొర్రంవాని గూడెం, మరికాల ఇసుక రీచ్‌ల కాలపరిమితి అక్టోబర్ 31తో పూర్తయింది. కానీ ఈ రెండు చోట్ల ఇంకా ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నట్లు తెలుస్తోంది. మొర్రంవాని గూడెం ర్యాంపులో ఈ ప్రాంతానికి చె ందిన ఓ ప్రజాప్రతినిధికి వాటా ఉండటంతో అధికారులు మౌనం వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అలాగే మరికాల రీచ్‌లో వరంగల్‌కు చెందిన ఓ బడా వ్యాపారి బినామీగా ఉండటంతో అతను ఇచ్చే భారీ నజరానాలకు తలొగ్గిన అధికారగణం అటువైపు కన్నెత్తి చూడటం లేదని ఆయా గ్రామాల ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. గోదావరి ఒడ్డుకు తీసుకొచ్చిన ఇసుకను తరలించుకునే వెసులుబాటు ఉండటంతో దీన్ని అలుసుగా తీసుకున్న బినామీ బాబులు అక్రమాలకు పాల్పడుతున్నారు. రాత్రి వేళ నదిలోంచి పొక్లెయినర్ ద్వారా ఇసుకను ఒడ్డుకు తరలిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు చెపుతున్నారు. గడువు ముగిసినా ఈ రెండు ర్యాంపుల నుంచి నిత్యం వందలాది లారీల ఇసుక తరలుతుండడం ఈ విమర్శలకు బలం చేకూరుస్తోంది. ఈ ర్యాంపుల నుంచి వెళ్లే లారీలకు తప్పుడు వేబిల్లులతో పాటు అధిక లోడ్‌లతో రవాణా అవుతున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తుండటం అనుమానాలకు తావిస్తోంది.
 
 వేతనాల చెల్లింపులో గందరగోళం...
 ఇసుక రీచ్‌ల గడువు ముగిసినప్పటికీ కూలీలకు పలు చోట్ల ఇప్పటికీ వేతనాలు చెల్లించలేదు. వెంకటాపురం మండలం మొర్రంవానిగూడెం, మరికాల సొసైటీల పరిధిలో పనిచేసిన కూలీలు పలుమార్లు అక్కడి ఇసుక రీచ్ నుంచి వచ్చే వాహనాలను అడ్డుకొని నిరసన తెలిపారు. ఐటీ డీఏ అధికారులకు కూడా పలుమార్లు విన్నవించుకున్నారు. భద్రాచలం, గొమ్ముకొత్తగూడెం వంటి ఇసుక రీచ్‌లో పనిచేసిన వారికి కూడా కూలీ చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఐటీడీఏ అధికారులు ఆదర్శ ఇసుక రీచ్‌గా చెప్పుకున్న భద్రాచలం మండలం గొమ్ముకొత్తగూడెం ర్యాంపులో పనిచేసిన కూలీలయితే గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఐటీడీఏ ఎదుట వేతనాల కోసం వంటావార్పుతో ఆందోళన చేశారు. బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలురెడ్డిపాలెం ఇసుక సొసైటీ సభ్యులు ఈ విషయంలో తలెత్తిన వివాదంతో ఏకంగా హైకోర్టును ఆశ్రయించి ర్యాంపు నిర్వహణ కొనసాగించకుండా స్టే తీసుకొచ్చారు. ఇంత జరిగినా కూలీల వేతనాల చెల్లింపుపై అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.
 
 ర్యాంపులు తెరిచేదెప్పుడో...
 పీసా చట్టం అమల్లో భాగంగా తొలిసారిగా భద్రాచలం ఏజెన్సీలోనే ప్రయోగాత్మకంగా గిరిజన సొసైటీలకు ఇసుక రీచ్‌లను అప్పగించారు. కానీ మొదటి ఏడాదే వీటి నిర్వహణ వివాదాల నడుమ సాగింది. అంతేకాకుండా సుమారు రూ.25 కోట్ల మేర అవినీతి జరిగిందనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మూతపడిన ఇసుక రీచ్‌లను రెండో ఏడాది తెరిచే విషయంలో అధికారులు డోలాయమానంలో పడ్డారు. దీంతో ప్రస్తుత నిర్మాణాలకు ఇసుక కొరత ఏర్పడుతోంది. జిల్లా ఉన్నతాధికారులు వీటిపై దృష్టి సారించి అక్రమాలకు అడ్డుకట్ట వేయటంతో పాటు రీచ్‌లను వెంటనే తెరిచేలా చూడాలని గిరిజనులు కోరుతున్నారు.  గడువు ముగిసినా ఇంకా ఇసుక తరలిస్తున్న మరికాల, మొర్రంవాని గూడెం ర్యాంపులపై విచారణ చేపట్టాలని సొసైటీ సభ్యులు కోరుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement