పోలీసు అమర వీరుల సేవలు చిరస్మరణీయం
అనంతపురం మెడికల్:
అంతర్గత భద్రత పర్యవేక్షణలో అసాంఘిక శక్తులు ఆటకట్టించే క్రమంలో అసువులు బాసిన పోలీసులు సేవలు చిరస్మరణీయమని, వారి స్ఫూర్తితో ప్రజాసేకు పునరంకితం అవుదామని ఎస్పీ రాజశేఖర్‌బాబు అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ వారాత్సవాల సంద్భరంగా స్థానిక సర్వజన ప్రభుత్వాస్పత్రిలో సోమవారం ఆత్మకూరు సీఐ విజయకుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
ఎస్పీతోపాటు రిజిస్ట్రార్ హేమచంద్రారెడ్డి, ఆస్పత్రి ఆర్‌ఎంఓ కన్నెగంటి భాస్కర్, రక్తనిధి ఇన్‌చార్జి డాక్టర్ శివకుమార్, డీఎస్‌పీ నాగరాజు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఎస్పీ మాట్లాడుతూ యూనిఫారం ధరించి ఫోర్స్‌లు తాము నమ్మిన సిద్ధాంతాల కోసం త్యాగాలు చేస్తాయన్నారు. సమాజ పరిరక్షణలో భాగంగా అసాంఘిక శక్తులతో జరిగే పోరాటంలో పోలీసులూ అసువులు భాస్తున్నారన్నారు.
2006 తరువాత రాష్ట్రంలో మావోయిజం దాదాపు తుడిచిపెట్టుకు పోయిందన్నారు. పోలీసులు అంకిత భావంతో పనిచేయడం వల్లనే ఇది సాధ్యమయ్యిందన్నారు. ఈ రోజు ఏపీలో స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొందంటే దాని వెనుక ఎందరో పోలీసులు ప్రాణత్యాగం ఉందన్నారు. రిజిస్ట్రార్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ సమాజ శ్రేయసు కోసం రక్షణగా నిలుస్తున్న పోలీసులకు సమాజం బాసటగా నిలవాలని అన్నారు.
పోలీసులు సమాజసేవలో తమ ప్రాణాలను సైతం అర్పిస్తున్నారన్నారు. కన్నెగంటి బాస్కర్, శివకుమార్, నాగరాజులు మాట్లాడారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ఎస్పీ, రిజిస్ట్రార్ ప్రారంభించారు. రక్తదానం చేసిన వారికి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఎస్‌ఎస్‌బీఎన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు రక్తదానం చేశారు.