
ఆదుకున్న మానవత్వం
అద్దంకి: ‘అంబా.. అంబా..’ (రక్షించండి) అంటూ పెద్దగా అరుపులు వినిపించడంతో ఏం జరిగిందోనని పరిగెత్తుకు వచ్చిన జనానికి 8 అడుగుల గోతిలో పడిన ఆవు కనిపించింది. ఈ సంఘటన అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానిక గంగాపార్వతీ సమేత చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానానికి ఆవు ఉంది.
ఈ ఆవు దర్శి రోడ్డు పక్క ఉన్న ఓ ఇంటి సమీపంలో కంది పైరు మేయడం కోసం వెళ్లగా అక్కడే గొయ్యి తీసి పరదా కప్పి ఉన్న మరుగుదొడ్డి గుంతలో పడింది. అక్కడకు చేరిన గ్రామస్తులు ఆవును రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం చెందారు. దీంతో ఉప్పుటూరి చిరంజీవి అనే వ్యక్తికి ఫోన్ చేసి పొక్లెయిన్ తెప్పించి సమాంతరంగా మరో గుంత తవ్వి ఆవును తాడు వేసి బయటకు లాగారు. ప్రాణాపాయం నుంచి బయటపడిన ఆవు కృతజ్ఞత చూపులు చూస్తూ అక్కడి నుంచి కదిలింది.