ప్రమాదకర స్థితిలో కొండ ఎక్కుతున్న నాగేశ్వరరావు
సాక్షి, ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ) : దుర్గగుడిపై మతి స్థిమితం లేని ఓ వ్యక్తి శుక్రవారం హల్‌చల్ చేశాడు. ఎటువంటి తాడు లేకుండా ప్రమాదకర పరిస్థితులలో చెట్లు, కొండ అంచులను పట్టుకుని పాకుకుంటూ కొండపైకి చేరుకున్నాడు. మతి స్థిమితం లేని వ్యక్తి చేస్తున్న చర్యలను చూసి పోలీసులతోపాటు సెక్యూరిటీ సిబ్బంది, భక్తులకు ముచ్చెమటలు పట్టాయి. చివరకు ఆ వ్యక్తి క్షేమంగా కొండపైకి చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
జగ్గయ్యపేట మండలం మర్రిపాకకు చెందిన కుండల నాగేశ్వరరావు కొద్ది రోజుల కిందట లారీ ఎక్కి నగరానికి చేరుకున్నాడు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో మహా మండపం సమీపంలోని పాత మెట్ల వద్దకు చేరుకున్న నాగేశ్వరరావు కొండపైకి చేరుకోవాలని బావించాడు. మెట్ల మార్గం నుంచి కాకుండా పక్కనే ఉన్న రాళ్లు, చెట్ల మధ్య నుంచి కొండపైకి ఎక్కడం ప్రారంభించాడు. సుమారు అరగంట తర్వాత కొండ సగం దూరం ఎక్కిన నాగేశ్వరరావు కిందకు చూసే సరికి భయం వేసింది. అయినా సరే కొండ రాళ్లు అంచులను పట్టుకుని మెల్లగా పాకుకుంటూ పైకి ఎక్కడం ప్రారంభించాడు.
కొంత దూరం ఎక్కిన తర్వాత భయంతో కొండ అంచున కూర్చోవడంతో అతనిని భక్తులు గమనించారు. అవుట్ పోస్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసు సిబ్బంది, ప్రయివేటు సెక్యూరిటీ సిబ్బంది కొంత మంది కొండ కింద నుంచి, మరి కొంత మంది పై నుంచి నాగేశ్వరరావును పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఎక్కడ పట్టుతప్పి కింద పడిపోతాడోనని భయంతో తాడు సహాయంతో పైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు.
ఇంతలో శానిటేషన్ విభాగంలో పనిచేసే ఓ యువకుడు తాడుతో కిందకు దిగి అతనిని పట్టుకుని పైకి తీసుకువెళ్లాడు. ఆ తర్వాత నాగేశ్వరరావును పోలీసులకు అప్పగించారు. అవుట్ పోస్టులోకి తీసుకువెళ్లగా నాగేశ్వరరావు తన పూర్తి వివరాలను తెలిపాడు. అతని మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు భావిస్తున్నారు. తన మేకలు కొండపైన ఉన్నాయని, వాటిని పట్టుకునేందుకు వచ్చానని పొంతన లేని సమాధానాలు చెప్పసాగాడు. అతనిని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment