నెల్లూరు (వేదాయపాళెం), న్యూస్‌లైన్ : లోకరక్షకుడైన ఏసుక్రీస్తు జననం కోసం భక్తులు కనులారా వేచి చూశారు. క్రిస్మస్ పర్వదినం కోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న చర్చిల్లో మంగళవారం రాత్రి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ప్రత్యేక ప్రార్ధనలు...
లోకరక్షకుడి జననం కోసం మంగళవారం రాత్రి 9 గంటల నుంచి అన్ని చర్చిల్లో ప్రత్యేక స్తుతిగీతాలను ఆలపించారు. సంఘస్తులు, యువత క్రీస్తు జనన సందేశాన్ని అందించేందుకు పురవీధుల్లో క్యారల్స్‌గా తిరిగారు. క్యారల్స్‌లో ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. శాంతాక్లాజ్ (క్రిస్మస్‌తాత) నృత్యాలు చిన్నారులను అలరించాయి. చర్చిల్లో అర్ధరాత్రి కేకులు కట్‌చేసి సంబరాలు చేసుకున్నారు.
చిన్నారులు, మహిళలు క్రీస్తు జననాన్ని తెలిపే డ్రామాలు ప్రదర్శించారు. నెల్లూరు నగరంలోని సంతపేటలో ఉన్న రోమన్ కేథలిక్, కెథడ్రిల్ చర్చిలో బిషప్ మోస్ట్ రెవరెండ్ ప్రకాశం ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో వేలాదిగా భక్తలు పాల్గొన్నారు. వీఆర్సీ సెంటర్‌లో బాప్టిస్టుచర్చి డౌనీ హాల్లో రెవరెండ్ జి.పీటర్ ఆధ్వర్యంలో క్రిస్మస్ ఈవ్, యూత్ డెరైక్టర్ జానిజో ఆధ్వర్యంలో యువజన క్రిస్మస్ వేడుకలు జరిగాయి. లోన్‌స్టార్ బాప్టిస్టు చర్చిలో రెవరెండ్ కంచర్ల ప్రభుదాస్, రెవరెండ్ విజయ్‌కుమార్, రెవరెండ్ థామస్ నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఫతేఖాన్‌పేట లూథరన్ చర్చిలో రెవరెండ్ ఏసుప్రతాప్, వ్యవస్థాపకులు జీఆర్ సుధాకర్ పర్యవేక్షణలో ప్రార్థనలు చేశారు.
భారతీ సిమెంట్స్ ఆధ్వర్యంలో..
నగరంలోని డౌనీహాల్లో క్రిస్మస్ వేడుకలను భారతీ సిమెంట్స్ ఆధ్వర్యంలో మంగళవారం అర్ధరాత్రి ఘనంగా నిర్వహించారు. క్రీస్తు జనయించిన వేళ కేక్‌ను కట్ చేసి పంపిణీ చేశారు. భారతీ సిమెంట్స్ ఏరియా సేల్స్ మేనేజర్ జేఎన్ మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో భారతీ సిమెంట్స్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు జరుపుతున్నామన్నారు. క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేశారు భక్తులందరికీ కేక్‌లు పంపిణీ చేశారు. బ్రదర్ విలియమ్స్ శుభకర్ వాఖ్యోపదేశం చే శారు. రోమేల్‌రాయ్, సునీల్, నిరంజన్ బృందాలు భక్తిశ్రద్ధలతో గీతాలను ఆలపించారు. సంఘ కాపరి పీటర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భారతీ సిమెంట్స్ సేల్స్ ఆఫీసర్ సుబ్బరాజు పాల్గొన్నారు.
కందిపప్పుపై క్రిస్మస్ స్టార్
వెంకటగిరిటౌన్, న్యూస్‌లైన్: స్థానిక కాశీపేటకు చెందిన మొద్దు వెంకటాచలం కందిపప్పుపై చెక్కిన క్రిస్మిస్ స్టార్ ఆకట్టుకుంటోంది. క్రిస్మస్ సందర్భంగా ఆయన పెన్సిల్‌పై చెక్కిన హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ ట్రీ, శిలువ అబ్బురపరిచాయి. కళాతృష్ణ ఉంటే ఎలాంటి అద్భుతాలైనా సృష్టించవచ్చని వెంకటాచలం మంగళవారం ‘న్యూస్‌లైన్’తో అన్నారు. తల్లిదండ్రులు పెంచలమ్మ, రమణయ్య ప్రోత్సాహంతో కళారంగాల్లో రాణిస్తున్నట్టు అతను చెప్పారు.
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌లైన్: క్రీస్తు జననాన్ని పురస్కరించుకుని అవిష్కరించిన సైకత శిల్పం పలువురిని ఆకట్టుకుంది. నగరంలోని ఏసీ నగర్‌కు చెందిన పిల్లా చంద్రశేఖర్, తమ్మిశెట్టిరవి, గుండుపోగు రవి, కళాకారులు ఈ సైకత శిల్పాన్ని కోడూరు బీచ్‌లో రూపొందించారు. క్రిస్మస్ తాత (శాంతాక్లాజ్) ఆకారాన్ని ఇసుకతో అందంగా తీర్చిదిద్దారు. నెల్లూరు శెట్టిగుంట రోడ్డుకు చెందిన సీయోన్‌గాస్పెల్ మినిస్ట్రీస్ ప్రార్థన మందిరం పాస్టర్ డేవిడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శన కోడూరు బీచ్‌లో క్రిస్మస్ వాతావరణాన్ని నెలకొల్పింది.
మెర్రీ క్రిస్మస్
Published Wed, Dec 25 2013 3:55 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM