ముత్యాలమ్మ జాతర కోలాహలం
నెల్లూరు(బృందావనం): వెంగళరావునగర్ సీ బ్లాక్‌లో కొలువైన ముత్యాలమ్మ జాతర ఆదివారం వైభవంగా జరిగింది. అమ్మవారి కలశాలను వాహనాలపై ప్రతిష్టించి నేత్రపర్వంగా ఊరేగించారు. దుర్గాదేవి, మహంకాళి, కాళికాదేవి, ముత్యాలమ్మ, భైరవ, పరశురాముడి ఉత్సవమూర్తులు, 108 టెంకాయలను గుత్తులుగా కట్టి సంప్రదాయంలో భాగంగా వీపులకు ఇనుప కొక్కీలను తగిలించుకొని లాగారు. నృత్యాలు, తార తప్పెట్లు, బాణసంచా, పంబగాళ్ల ఆటపాటలతో ఉత్సవం కనువిందుగా సాగింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వేడుకులు జరిగాయి. దేవస్థానం, కార్యక్రమ నిర్వాహకుడు చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.
వెల్లివిరిసిన భక్తిభావం, దేశభక్తి
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓ భక్తుడు శరీరమంతా కొక్కీల ఇనుప చట్రాన్ని బిగించి, తన శరీరం నుంచి వెలుపలికి తీసుకొచ్చిన కొక్కీలకు జాతీయపతాకాలను ప్రదర్శిస్తూ ముందుకుసాగారు. మరి కొందరు అమ్మవారి విగ్రహాలను చిన్నిచిన్ని రథాలపై అమర్చి తమ భక్తిభావాన్ని చాటుతూ మువ్వన్నెలతో తీర్చిదిద్ది కనువిందు చేశారు. ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.