నియోజకవర్గం ట్యాంకర్లతో అద్దె బోర్లు
నీరందిస్తున్న గ్రామాలు
రాయచోటి 198 109
రాజంపేట 120 25
రైల్వేకోడూరు 33 04
కమలాపురం 27 07
పులివెందుల 15 06
జమ్మలమడుగు 14 --
సాక్షి, కడప : మండుటెండలు రాకముందే జిల్లాను తాగునీటి సమస్య వెంటాడుతోంది. ఇప్పటికే జిల్లాలోని వందలాది గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. రాబోయే రోజులు తలచుకుని ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుందోనని గ్రామీణ తాగునీటి విభాగం అధికారులు ఆందోళన చెందుతున్నారు. మార్చి ఆరంభం కాగానే అన్నో ఇన్నో బోర్లలో వస్తున్న నీళ్లు నిలువునా అడుగంటిపోతున్నాయి. ఒకపక్క పండ్ల తోటల రైతులు, మరోపక్క గ్రామీణ ప్రజలు నీరు లేక తల్లడిల్లిపోతున్నారు. ఏళ్ల చరిత్ర కలిగిన చెయ్యేరు లాంటి నీటి పథకాలు కూడా నిలువునా ఎండిపోతుండటంతో ఏమి చేయాలో అధికారులకు కూడా పాలుపోవడం లేదు.
557 గ్రామాల్లో తీవ్రమైన తాగునీటి సమస్య
రాయచోటి, రాజంపేట, పులివెందుల, కమలాపురం, రైల్వేకోడూరు తదితర ప్రాంతాల పరిధిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. తాగునీటి సమస్య నేపధ్యంలో దాదాపు ఎనిమిది నెలలుగా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు దాదాపు 406 గ్రామాల్లో ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నారు. సమీప ప్రాంతాల్లో బోర్లు వేసినా నీరు పడకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ట్యాంకర్ల ద్వారానే నీటిని అందిస్తున్నారు. 557 గ్రామాల్లో తాగునీటి సమస్య నెలకొనడంతో దాదాపు 1.50 లక్షల మందికి పైగా ప్రజలు అవస్థలు ఎదుర్కొవాల్సి వస్తోంది.
మున్సిపాలిటీలను వేధిస్తున్న నీటి గండం
జిల్లాలోని పలు మున్సిపాలిటీలలో కూడా తాగునీటి సమస్య వేధిస్తోంది. పులివెందుల మున్సిపాలిటీకి సంబంధించి సమ్మర్ స్టోరేజీ ట్యాంకు ఆగస్టులో ఎండిపోవడంతో ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తాగునీటి సమస్యపై ప్రత్యేక చొరవ తీసుకుని దాదాపు రూ. 80 లక్షలకు పైగా నిధులు తాగునీటి అవసరాలకు కేటాయించి సమస్య పరిష్కారానికి కృషిచేస్తూ వస్తున్నారు.
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని పలు వీధుల్లో తాగునీటి సమస్య ఏర్పడటంతో ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. రాయచోటి ప్రాంతంలో ఎక్కడ చూసినా ప్రజలు దాహార్తితో అలమటిస్తున్నారు. ఒక్క రాయచోటి నియోజకవర్గంలోనే 198 గ్రామాల్లో ట్యాంకర్లతో నీరు తోలుతుండగా, 109 గ్రామాల్లో అద్దె బోర్ల సాయంతో తాగునీరు అందిస్తున్నారంటే పరిస్థితి తీవ్రత ఏమిటో అర్థమవుతోంది.