సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చిన్నారులు.. గర్భిణులు.. బాలింతలకు ఇచ్చే పౌష్టికాహారం, సరకులను కొందరు దారిమళ్లిస్తున్నారు. ఐసీడీఎస్‌లోని కొందరు అధికారులు సరుకులను పంచుకుతింటున్నారు. కేంద్రాల్లోని పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందాల్సిన సరుకులు పూర్తిస్థాయిలో అందటం లేదు. దీంతో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ కష్టంగా ఉందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 17 ప్రాజెక్టుల ఆధ్వర్యంలో మొత్తం 3,374 అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో 7 నెలల నుంచి 6 ఏళ్ల వయస్సు ఉన్న చిన్నారులు సుమారు 2 లక్షల మంది ఉన్నారు. వీరికి బాలామృతం పేరుతో చిన్నారులకు 744.73 కేలరీల శక్తి, 19.96 గ్రాముల ప్రొటీన్లు కలిగిన పిండిని సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మొత్తం కలిపి నెలకు 40 లక్షలదాకా గుడ్లు సరఫరా చేస్తున్నారు.
కందిపప్పు 1.04 లక్షల కిలోలు, 51వేల లీటర్ల పామాయిల్, బియ్యం దిగుమతి అవుతుంటాయి. అదేవిధంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో బలహీనంగా ఉన్న చిన్నారులకు రోజూ పాలు ఇచ్చేందుకు ఒకరికి రూ.3 చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. ప్రభుత్వం పంపించే సరుకులన్నింటినీ నేరుగా ఆయా అంగన్‌వాడీ కేంద్రాలకు చేర్చాలి. ఆ సరుకుల్లో గర్భిణులకు నెలకు 3 కిలోల చొప్పున బియ్యం, కిలో కందిపప్పు, ఆరకిలో పామాయిల్, వారానికి నాలుగు కోడిగుడ్ల చొప్పున పంపిణీ చేయాల్సి ఉంది. చిన్నారుల విషయానికి వస్తే మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో గుడ్డు పెట్టాలి.
జరుగుతోందిలా...
స్టాక్ పాయింట్ల నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే సరుకులను తూకం వేస్తే నిర్ణయించినంత ఉండటం లేదని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఒక బియ్యం బస్తాకు 5 నుంచి 6 కిలోలు తక్కువగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కందిపప్పులో అంతే తక్కువగా వస్తోందని కార్యకర్తలు చెబుతున్నారు. వచ్చేది తక్కువగా ఉంటే.. కేంద్రాలకు చేరాక సంబంధిత అధికారులకు ఒక్కో అంగన్‌వాడీ కేంద్రం నుంచి 5 కిలోల బియ్యం, 3 కిలోల కందిపప్పు, 2 లీటర్ల పామాయిల్ మామూళ్ల రూపంలో ఇవ్వాలి. గుడ్లు విషయానికి వస్తే ప్రతి అంగన్‌వాడీ కేంద్రం నుంచి వారానికి 30 గుడ్లు ఇవ్వాల్సి ఉంది.
ఇక పిల్లలకు పాలకు వచ్చే రూ.3ను అస్సలు ఇవ్వటం లేదని కొందరు అంగన్‌వాడీ కార్యకర్తలు స్పష్టం చేశారు. కూరగాయలకు ఇచ్చే మొత్తంలో నుంచి రూ.100లో రూ.20 మామూళ్ల రూపంలో వసూలు చేసుకుంటున్నట్లు తెలిసింది. జిల్లా కేంద్రాల్లోనో.. ప్రాజెక్టు కేంద్రాల్లో కార్యకర్తలతో నెలకు 2 సమావేశాలు నిర్వహిస్తుంటారు. వాటికి హాజరయ్యే కార్యకర్తకు ఒకసారికి ఒకరికి రూ.300 నుంచి రూ.400 వస్తుంది. అందులో నుంచి ప్రతి కార్యకర్త రూ.150 చొప్పున పైఅధికారులు వసూళ్లు చేసుకుంటున్నట్లు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపోతే ప్రభుత్వం సరఫరా చేసే సరుకులను నేరుగా అంగన్‌వాడీ కేంద్రాలకు చేర్చాల్సి ఉంది.
అయితే అధికారులు కొందరు నియోజకవర్గ కేంద్రంలో ఓ చోటుకు చేర్చి కార్యకర్తలను అక్కడకు రమ్మని వారికి అప్పజెబుతున్నారు. ఆ సరుకులను కార్యకర్తలు ఆటోల ద్వారా సొంత డబ్బులు ఖర్చుచేసుకుని కేంద్రాలకు చేర్చుకుంటున్నారు. ఇందు కోసం అదనంగా రూ.100 ఖర్చవుతోందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి అంగన్‌వాడీ కేంద్రాలకు అందాల్సిన సరుకులు సక్రమంగా అందజేసి, మమూళ్ల వసూళ్లు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పిల్లల భోజనం.. పెద్దలకు నైవేద్యం
Published Thu, Feb 26 2015 1:38 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement