రాజ్యసభ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి సమైక్యవాదాన్ని గెలిపిస్తానని ప్రకటించిన సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి ఎన్నికల్లో మిడిల్ డ్రాప్ పెట్టారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాజ్యసభ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి సమైక్యవాదాన్ని గెలిపిస్తానని ప్రకటించిన సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి ఎన్నికల్లో మిడిల్ డ్రాప్ పెట్టారు. శుక్రవారం పోలింగ్ జరగనుండగా గురువారం మధ్యాహ్నం ఆయన తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన గెలుపు సాధ్యం కాదనే విషయం తేలడంతోనే బరి నుంచి తప్పుకున్న ఆయన ఈ నిర్ణయానికి ముద్దుగా సమైక్యవాదం ఓడకూడదని ఎన్నికల నుంచి వైదొలుగుతున్నట్లు చెప్పుకున్నారు.
రాష్ట్ర విభజన సెగతో ఎలాగూ కాంగ్రెస్‌కు టాటా చెప్పాలని నిర్ణయించుకున్న ఆదాల అవకాశం వస్తే పెద్దల సభకే వెళదామని ఆశపడ్డారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలతో ఉన్న సంబంధాలు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మద్దతు ఇస్తారనే నమ్మకంతో ఆయన కొండకు వెంట్రుక ముడి వేశారు. కాంగ్రెస్ హైకమాండ్ పోటీ నుంచి తప్పుకోవాలని
హెచ్చరించినా, సీఎం అండ వున్నందువల్ల తనకేం కాదనే ధీమాతో ఆ ప్రసక్తేలేదని తేల్చి చెప్పి సమైక్య హీరోగా నిలిచే ప్రయత్నం చేశారు. టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుని కొత్తపార్టీ వైపు కూడా ఎదురుచూస్తున్న ఆదాలకు చంద్రబాబు నుంచి ఎన్నికల బరిలో తప్పుకోవాలనే హుకుం జారీ అయ్యింది. ఇంకా పార్టీలో చేరకముందే ఈ కమాండ్ ఏమిటి? అన్నట్లు ఆయన అవుననీ కాదనీ కాకుండా సమాధానం ఇచ్చి సీఎం మీద కొండంత ఆశతో ఎదురుచూశారు. బుధవారం నాటి ఢిల్లీ పరిణామాల అనంతరం ఆదాలకు ఎమ్మెల్యేలను అందించే విషయంలో సీఎం కిరణ్ హ్యాండిచ్చినట్లు ప్రచారం సాగుతోంది. అటు చంద్రబాబుకు చెడ్డయి, ఇటు కిరణ్ సహకారం లభించకపోతే గెలిచే అవకాశమే లేదని గుర్తించిన ఆదాల ఎన్నికల యుద్ధం నుంచి అస్త్ర సన్యాసం చేయక తప్పలేదు.
రెంటికీ చెడ్డ రేవడేనా?
బరిలో నుంచి తప్పుకోవాలని చంద్రబాబు ఆదేశించిన సమయంలోనే ఆదాల ఈ నిర్ణయం తీసుకోలేకపోయారు. ఆ ఒక్కటీ కుదరదన్నట్లు మాట్లాడారని సమాచారం. దీంతో అటు టీడీపీ అధినేత వద్ద మార్కులు పోయినట్లుగా పార్టీ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. బాబు చెప్పినా వినకుండా సీఎం మీద ధీమాతో అడ్డంగా మాట్లాడటం.. ఆదాల టీడీపీ ప్రవేశానికి అడ్డంకి కావచ్చనే పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి. ఒకవేళ ఆదాల టీడీపీలో చేరినా ఆయనకు ఆశించినంత ప్రాధాన్యత దక్కకపోవచ్చని కాంగ్రెస్ వర్గాలు అంచనావేస్తున్నాయి. సీఎం చెప్పినందువల్లే తాను పోటీ నుంచి తప్పుకున్నానని ఆయన ప్రకటించడం బాబుకు చిర్రెత్తించవచ్చనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆదాల ఆలోచనలో పడే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో సీఎం కిరణ్ కూడా చివరి రోజున నో అనిచెప్పడం ఆదాలకు రాజకీయంగా శరాఘాతంగా భావించవచ్చు.
అయితే ముందుజాగ్రత్తగా ఆదాల తన వెనకడుగుకు వైసీపీ కారణమనే నిందను మోపి సీఎం వద్ద సేఫ్‌సైడ్ అయ్యే ప్రయత్నం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో తామెవరికీ మద్దతు ఇవ్వబోమని నామినేషన్లకు ముందే వైఎస్‌ఆర్ సీపీ ప్రకటించింది. అలాంటప్పుడు ఆ పార్టీ సహాయం చేస్తుందని నమ్ముకుని ఎలా పోటీకి దిగుతారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. మొత్తం మీద తాను పోటీ నుంచి తప్పుకోవడానికి వైఎస్సార్ సీపీ కూడా కారణమనే విధంగా ఆదాల నిందలు మోపి సమైక్యాంధ్రవాదుల నుంచి సానుభూతి పొందే ఎత్తుగడ వేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇంతకీ ఆదాల దారెటు అనే అంశంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.
పాపం ముంగమూరు..
నెల్లూరు నగర శాసనసభ్యుడు ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డికి రాజ్యసభ ఎన్నికల వ్యవహారం ఆనం సోదరులతో అనవసరమైన రగడ తెచ్చిపెట్టింది. ఆదాలతో పాటు ఆయన కూడా టీడీపీలో చేరాలని నిర్ణయించుకుని ఆనం సోదరులతో గొడవ లేకుండానే బయటకు వెళ్లేలా అడుగులు వేశారు. అయితే రాజ్యసభ ఎన్నికల రగడలో ఆయన ఆదాల వైపు నిలిచారు. ఈ పరిణామం జీర్ణించుకోలేని ఆనం వివేకానందరెడ్డి తమకు తెలియకుండా ఆదాలకు ఎలా మద్దతు ఇస్తావని ముంగమూరును నిలదీసినంత పనిచేశారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సీఎంను, ఆదాలను నమ్ముకుని అడుగు ముందుకేసిన శ్రీధర్ కృష్ణారెడ్డి బుధవారం కూడా తాను ఆదాలకే ఓటు వేస్తానని ప్రకటించారు. దీంతో ఇంతకాలం బాగా కొనసాగిన ఆనం వివేకా- ముంగమూరు సఖ్యతకు అడ్డంకి ఏర్పడినట్లేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.