సాక్షి, నెల్లూరు: మేకపాటి రాజమోహన్‌రెడ్డి నెల్లూరు ఎంపీగా హ్యాట్రిక్ విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డితో తలపడిన ఆయన ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించారు. మొదటి రౌండ్ నుంచి 12వ రౌండ్ వరకు మెజార్టీ సాధించారు.
చివరి రౌండ్లలో మాత్రం ఆదాలకు కొద్దిపాటి ఆధిక్యత లభించింది. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 11,79,869 లక్షల ఓట్లు పోల్‌కాగా మేకపాటి రాజమోహన్‌రెడ్డికి 5,76,396, ఆదాల ప్రభాకర్‌రెడ్డికి 5,62,918 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డికి కేవలం 22,771 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆత్మకూరు, నెల్లూరు నగరం, రూరల్, ఉదయగిరి, కావలి, ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గాల్లో మేకపాటికి ఆధిక్యం లభించింది. వరుసగా మూడు సార్లు ఆయన నెల్లూరు ఎంపీగా విజయం సాధించడంపై పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి.
హామీలు నెరవేర్చాలి: మేకపాటి
చంద్రబాబు ఇబ్బడిముబ్బడిగా ప్రజలకిచ్చిన హామీలతో పాటు మోడీ ఫ్యాక్టర్ పనిచేసిందని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. విజేతగా ధ్రువీకరణ పత్రం అందుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాము నిత్యం ప్రజల వెన్నంటి ఉంటామన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామన్నారు.
ఎంపీగా మేకపాటి హ్యాట్రిక్ విజయం
Published Sat, May 17 2014 2:31 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement