విభజన నిర్ణయంతో మైండ్ బ్లాక్ : లగడపాటి
హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సొంత పార్టీపైనే ధిక్కార స్వరం విన్పిస్తున్నారు. రాష్ట్ర విభజన విషయంలో అన్ని పార్టీల్లానే కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ప్రాంతీయ పార్టీల్లా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాజకీయ అవసరాల కోసం ఇష్టమొచ్చినట్టుగా రాష్ట్రాన్ని విభజిస్తోందని ధ్వజమెత్తారు. ఏపీజెఎఫ్ నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో లగడపాటి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ విభజన విషయంలో తమ పార్టీ అనూహ్యంగా వ్యవహరిస్తోందని వాపోయారు. తమకే తలతిరిగేలా, ఊహకు అందని విధంగా నిర్ణయం తీసుకుంటోందని చెప్పారు. విభజనపై ఒక జాతీయ విధానమంటూ ఉందా అని ఆయన ప్రశ్నించారు. విభజన నిర్ణయంతో మైండ్ బ్లాక్ అయిందన్నారు.
ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని విడగొట్టొద్దని హైకమాండ్కు చెప్పామన్నారు. 2009 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు విభజనకు అనుకూలమని చెప్పాయని గుర్తు చేశారు. సమైక్యవాదమే గెలుస్తుందని భావిస్తున్నామన్నారు. హైదరాబాద్తో అందరికీ అనుబంధం ఉందన్నారు. ఏపీ విభజనను దేశం మొత్తం గమనిస్తోందన్నారు. అన్ని ప్రాంతాలు అంగీకరిస్తేనే ముందుకెళ్లాలని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని లగడపాటి అన్నారు.