పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నా: లగడపాటి
న్యూఢిల్లీ: మూడు ప్రాంతాల ప్రజలు ఏకాభిఫ్రాయానికి వచ్చినప్పడే విభజన జరగాలని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. అందరూ సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని అన్నారు. అందరి ఆకాంక్ష హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. ఎన్నికల ముందు నిర్ణయం తీసుకోవడంతో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో అనుమానాలున్నాయన్నారు. రాజకీయ ప్రయోజనం కోసమే విభజిస్తున్నారన్న అనుమానం ఉందన్నారు.
మెజారిటీ ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నారని పునరుద్ఘాటించారు. విడిపోతామని ఏ ప్రాంతం వారూ చెప్పడం లేదన్నారు. రాష్ట్రాన్ని విడదీయొద్దని శ్రీకృష్ణా కమిటీ స్పష్టం చెప్పిందన్నారు. హైదరాబాద్తో రాష్ట్ర ప్రజలందరికీ విడదీయలేని బంధం ఏర్పడిందన్నారు. హైదరాబాద్ నుంచి 60 శాతం ఆదాయం వస్తోందని వెల్లడించారు. విభజనపై ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. సమైక్యం కోసం సీఎం కిరణ్ పోరాడుతున్నారని వెనకేసుకొచ్చారు. జీఓఎంకు తాను నివేదిక ఇచ్చానని తెలిపారు. రాజీనామా ఆమోదించనందున తానింకా పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నానని లగడపాటి స్పష్టం చేశారు.