విజయవాడ, న్యూస్‌లైన్ : మీడియా రాజకీయ నాయకులతో మైండ్‌గేమ్ ఆడుతోందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాదరావు చెప్పారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో స్వరాజ్య మైదానంలో ఏర్పాటుచేసిన 25వ పుస్తక మహోత్సవాన్ని బుధవారం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్.వైద్యనాథ అయ్యర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. మంత్రి మాణిక్య మాట్లాడుతూ..
మీడియా బ్రేకింగ్ న్యూస్ కోసం హడావుడి చేస్తూ, నేతలతో అప్పటికప్పుడు ఇష్టారాజ్యంగా మాట్లాడించి ప్రసారం చేస్తోందని మండిపడ్డారు. పుస్తకాలను చదివి ఆయా అంశాలపై అవగాహనతో మాట్లాడినప్పుడే సమాజానికి మేలు జరుగుతుందన్నారు. నైతిక విలువలు కలిగి, అవినీతికి దూరంగా ఉండే నేతలు పుస్తకాలు కూడా చదవుతున్నారా.. లేదా గమనించి వారిని గెలిపించాలని సూచించారు.
వైద్యనాథ అయ్యర్ మాట్లాడుతూ నూతన సాంకేతిక విప్లవం నేపథ్యంలో పాశ్చాత్యదేశాల్లో పుస్తకపఠనం తగ్గిపోతోుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారతదేశంలో ఆ విధమైన పరిస్థితి లేకున్నా భవిష్యత్‌లో ఇబ్బంది పడే అవకాశముందన్నారు. ఆన్‌లైన్ పబ్లిషింగ్‌ను అధికంగా నిర్వహించాలని, దానికి ప్రభుత్వ సహకారాన్ని అందించాలని సూచించారు. 1989లో తొలి పుస్తక మహోత్సవ ప్రారంభోత్సవానికి తాను హాజరయినప్పుడు కురిసిన భారీ వర్షం తనకు నేటికీ గుర్తుఉందన్నారు.
సభకు అధ్యక్షత వహించిన కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు మాట్లాడుతూ.. పాఠకులకు పుస్తకం ప్రపంచాన్ని చేరువ చేస్తుందన్నారు. విజ్ఞానాన్ని అందించే గొప్ప సాధనం పుస్తకం మాత్రమేనన్నారు. పుస్తక పఠనంతో తమను తాము సంస్కరించుకోవచ్చని చెప్పారు. విజయవాడ పుస్తక మహోత్సం నగరానికే వన్నెతెచ్చిందన్నారు. ఆదాయపు పన్ను కమిషనర్ ఎస్.జయరామన్ మాట్లాడుతూ తన జీవితంలో ఇంత పెద్ద పుస్తక మహోత్సవాన్ని చూడడం ఇదే ప్రథమమన్నారు.
కేవలం మెట్రోపాలిటన్ నగరాలకే పరిమితమయ్యే పుస్తక మహోత్సవాలకన్నా అద్భుతంగా విజయవాడలో నిర్వహించడం అభినందనీయమన్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. గతానికి, వర్తమానానికి పుస్తకాలే వారధులని పేర్కొన్నారు. పుస్తక మహోత్సవం మరింత అభివృద్ధిని అందుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. సొసైటీ అధ్యక్షుడు డి.అశోక్‌కుమార్ మాట్లాడుతూ గడిచిన పాతికేల్లలో అనేక సవాళ్లను ఎదుర్కొని నిలిచామని, అందుకే ఇంత దూరం ప్రయాణం చేయగలిగామన్నారు.
అన్ని శాఖల అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు అందించిన సహకారంతోనే సొసైటీ ఈ స్థాయికి చేరుకుందన్నారు. తొలుత జయరామన్ ‘అక్షరయాత్ర’ పేరుతో రూపొందించిన 25 సంవత్సరాల సావనీర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి రావికింది రామస్వామి, ఉపాధ్యక్షులు బి.బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.
మైండ్‌గేమ్ ఆడొద్దు
Published Thu, Jan 2 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM
Advertisement
Advertisement