
కర్నూలులో 200 ఎకరాల్లో రిమ్స్ స్థాయి ఆసుపత్రి
కర్నూలు (హాస్పిటల్) : రాష్ట్ర విభజన నేపథ్యంలో కర్నూలులో 200 ఎకరాల్లో రాయలసీమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (రిమ్స్)గా కర్నూలు సర్వజన ప్రభుత్వాసుపత్రిని తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. శుక్రవారం కర్నూలులోని వైద్య కళాశాల కొత్త ఆడిటోరియంలో 37వ రాష్ట్ర స్థాయి శస్త్ర చికిత్స నిపుణుల(సర్జన్ల) సదస్సు నిర్వహించారు. ఆంధ్ర, తెలంగాణ జిల్లాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో పని చేసే సర్జన్లు, టీచింగ్ ఫ్యాకల్టీ, పీజీ వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1956 సంవత్సరంలో 50 మంది వైద్య విద్యార్థులతో ప్రారంభమైన కర్నూలు మెడికల్ కళాశాల, ప్రభుత్వాసుపత్రి ఇప్పుడు 200 మంది విద్యార్థులకు చేరుకోవడంలో తనవంతు సహాయ సహాకారాలు ఉన్నాయన్నారు. పీజీ వైద్య విద్యార్థులకు ఆధునిక భవనాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రాష్ట్రాన్ని ఏ ఒక్కరూ వేలెత్తి చూపకుండా సింగపూర్, మలేషియాలాగా అభివృద్ధి చేస్తామన్నారు. సదస్సులో సర్జన్లు మరిన్ని మెలకువలు, ఆధునిక చికిత్సా విధానాలు తెలుసుకుని పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ జి.శాంతారావు మాట్లాడుతూ కర్నూలు చరిత్రలోనే కర్నూలు వైద్య కళాశాలకు ఎంతో పేరుందన్నారు. వచ్చే ఏడాది నుంచి సూపర్ స్పెషాలిటీ పీజీ కోర్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. రోగులకు అవసరానికి మించి యాంటీబయాటిక్ మందులు ఇవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందన్నారు.