
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ధైర్యం ఉంటే అసెంబ్లీలో అచ్చెన్నాయుడు అవినీతిపై చర్చ పెట్టమని అడగాలని పురపాలకశాఖా మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్ట్ చేశారని అంటున్నారే తప్ప.. అవినీతి జరగలేదని చంద్రబాబు గానీ టీడీపీ నేతలు ఎక్కడా చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలు నమ్మడానికి ప్రజలు అమాయకులు కాదని.. పక్కా ఆధారాలతో ఏసీబీ అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిందని స్పష్టం చేశారు. తనపై చంద్రబాబు గతంలో లేనిపోని ఆరోపణలు చేశారని ఆ సమయంలో తాను సీబీఐ విచారణను స్వాగతించానని గుర్తు చేశారు. ‘‘నేను ఏ తప్పూ చేయలేదు కాబట్టి ధైర్యంగా ఉన్నా. అయినా.. నాపై మీ పత్రికల్లో ఇష్టానుసారంగా వార్తలు రాయించలేదా. నేను కూడా వెనుకబడిన కులానికి చెందిన వాడినే. నేను బీసీ అని అప్పుడు మీకు గుర్తురాలేదా’’అని చంద్రబాబును ప్రశ్నించారు. అవినీతికి కులాలు అపాదించడం తగదని హితవు పలికారు. (విజయవాడ: ఏసీబీ ఆఫీస్‌కు అచ్చెన్నాయుడు)
‘‘ఈఎస్ఐలో రూ. 150 కోట్లు అవినీతి జరిగిందని ఏసీబీ అధికారులు తేల్చారు. అచ్చెన్నాయుడు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. టెండర్లు పిలవకుండా ఆయన ఇష్టానుసారంగా తమకు నచ్చిన వారికి కట్టబెట్టారు. నామినేషన్ మీద పనులు ఇవ్వాలని లేఖ రాశారు. 134 శాతం అధిక ధరలకు మందులు ఇతర సామగ్రి కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్ అంటే ఎవరికి తెలియకుండా ఎత్తుకు పోవడం. కిడ్నాప్ చేయాల్సిన అవసరం మాకు లేదు. (‘చిట్టి నాయుడు దెబ్బ.. అచ్చెన్న అబ్బ’)
టీడీపీ నేతలే మా అవినీతిపై విచారణ జరపాలని సవాల్ చేశారు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో చంద్రబాబు అవినీతిపై విచారణ జరువుతామని ప్రజలకు హామీ ఇచ్చారు. మేము అవినీతి రహిత పాలన అందిస్తామని ప్రజలకు చెప్పాం. వాళ్లు మాకు అవకాశం ఇచ్చారు. టీడీపీ హయాంలో జరిగిన స్కాంలు రోజుకొకటి బయటకు వస్తాయి. చంద్రబాబు హయాంలో భోగాపురం ఎయిర్‌పోర్టు కేటాయింపు వ్యవహారంపై సమీక్ష చేసి 500 ఎకరాల భూమి వెనక్కి తీసుకున్నాము. తద్వారా ప్రభుత్వానికి రూ. 1500 కోట్ల ఆదా అయింది’’ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment