
సాక్షి, అమరావతి: ఏపీ ప్రజలకు చంద్రబాబు చేయలేని మేలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్నారని..అందుకే ఆయనకు ఆక్రోశం ఎక్కువయిందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. 2014 లో రైతుల రుణాలు, బంగారం, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని మోసం చేసింది చంద్రబాబు కాదా... అని ప్రశ్నించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజే నాలుగు, ఐదు విడతల రుణమాఫీ జీవో ఇచ్చి రైతులను మోసం చేశారన్నారు.బడ్జెట్‌లో రుణమాఫీకి నిధులను కేటాయించలేదని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ నిధులను ఎందుకు ఇవ్వలేదో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ పై చర్చకు రావాలని టీడీపీ నేతలను కన్నబాబు సవాల్ విసిరారు.
‘ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన వాగ్దానాన్ని కూడా అమలు చెయ్యని అసమర్థుడు చంద్రబాబు’ అని వ్యాఖ్యనించారు. ఎన్నికల కోడ్ సమయం లో కేబినెట్ సమావేశాలు పెట్టారు కదా..? అప్పుడేందుకు చెల్లించలేదని చంద్రబాబును నిలదీశారు. సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రైతులకు ఇచ్చిన ప్రతి హామీ ని నెరవేరుస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని సమృద్ధిగా వర్షాలు కురిసాయని.. సీఎం జగన్ పాలనలో రైతులకు సానుకూల వాతావరణం ఉందని పేర్కొన్నారు.