పెద్దల అండతో అవినీతి యాత్ర | Minister narayana support to the golla raghu? | Sakshi
Sakshi News home page

పెద్దల అండతో అవినీతి యాత్ర

Published Thu, Sep 28 2017 12:28 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

Minister narayana support to the golla raghu? - Sakshi

సాక్షి, అమరావతి: అవినీతి తిమింగలం గొల్ల వెంకట రఘు బాగోతాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. రూ.వందల కోట్ల విలువైన ఆస్తులు, బంగారం, వెండి, హోటళ్లు, భవనాలు చూస్తూంటే సామాన్యుల కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. అదే సమయంలో ఒక అధికారి ఇంత పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించే అవకాశముంటుందా అనే అనుమానాలూ కలుగుతున్నాయి. రఘు అవినీతికి విశాఖలోనే బీజం పడినట్టు తెలిసింది. విశాఖ సిటీ ప్లానర్‌గా వెళ్లిన ఆయన.. అక్కడ్నుంచి మొన్న ఏసీబీకి దొరికే వరకూ పెద్దల అండదండలతో అప్రతిహతంగా అవినీతి యాత్ర సాగించినట్టు సమాచారం. చివరకు డీటీసీపీ(టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానర్‌ డైరెక్టర్‌) పోస్టు తెచ్చుకోవడం కోసం కూడా డబ్బును మంచినీళ్లలా వెదజల్లినట్టు తెలిసింది.

ఐఏఎస్‌ పేరు చెప్పి రెచ్చిపోయారు..
రఘు విశాఖ సిటీ ప్లానర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఐఏఎస్‌ అధికారి సమీర్‌శర్మ జీవీఎంసీ కమిషనర్‌గా ఉన్నారు. ఇక్కడే సమీర్‌శర్మతో రఘుకు బాగా చనువు ఏర్పడింది. అదే సమయంలో ఓ ప్రైవేటు లైసెన్స్‌డ్‌ ఇంజనీర్‌ ఒకరు రఘుకు పరిచయమయ్యారు. ఈ ఇంజనీర్‌ దగ్గర ప్లాన్‌ గీయించుకుంటే చాలు.. రఘు ఇంకేమీ పట్టించుకోకుండా అనుమతి ఇచ్చేసేవారు. దీనికి కమిషనర్‌ స్థాయిలో సైతం క్షణాల్లో అనుమతులు వచ్చేవి. ఆ సమయంలో విశాఖలోని 80 శాతం మంది.. ఈ లైసెన్స్‌డ్‌ ఇంజనీర్‌ వద్దకే వెళ్లేవారు. వీరిద్దరి మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందం వల్ల రఘు రూ.కోట్లకు కోట్లు సంపాదించారు.

సమీర్‌శర్మ కమిషనర్‌గా ఉన్నంత కాలం రఘుకు తిరుగు లేకుండా పోయింది. విశాఖలో ఏ మూల నిర్మాణాలు జరిగినా, వెంచర్లు వేసినా, భవంతులు నిర్మించినా, అపార్ట్‌మెంట్‌లు కట్టినా రఘుకు చిటికెలో తెలిసేది. నిర్మాణదారులెవరైనా సరే రఘును కలసి మామూళ్లు ఇచ్చుకోవాల్సిందే. లేకుంటే వారి ప్రాజెక్టు మూలన పడిపోతుంది. కాగా, రఘుతో సమీర్‌శర్మకు ఉన్న చనువు వల్ల ఆయన కూతురు సుమేధా శర్మ సబూరి సంస్థలో పెట్టుబడులు పెట్టింది. సమీర్‌ శర్మ షిర్డీ సాయిబాబా భక్తుడు. ఈ నేపథ్యంలోనే షిర్డీలో ప్రధాన రహదారికి పక్కన సూరజ్‌కుంజ్‌ అనే గెస్ట్‌హౌస్‌ను రఘు నిర్మించారు. ఆ తర్వాత సమీర్‌శర్మ విశాఖ నుంచి బదిలీపై వెళ్లారు. అనంతర కాలంలో సుమేధా శర్మ.. సబూరి సంస్థ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. 

డీటీసీపీ పదవి తెచ్చుకోవడంలోనూ..
రాష్ట్ర విభజన వరకు తిమ్మారెడ్డి డీటీసీపీగా ఉండేవారు. ఆ పోస్టును సాధించుకోవడంలో రఘు కృతకృత్యులయ్యారు. ఇంతలోనే సీఆర్‌డీఏ ఏర్పాటు కావడం, లే అవుట్‌లకు అనుమతులివ్వడం వంటివి ఆయనకు వరంగా మారాయి. టౌన్‌ ప్లానింగ్‌ వ్యవస్థకు రఘుయే అధికారి కాబట్టి.. ఇక అవినీతి యాత్రకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. తిమ్మారెడ్డి ఆ తర్వాత ఏపీ పోస్టింగ్‌ తెచ్చుకున్నా.. ఆయన డీటీసీపీగా రాకుండా రఘు అడ్డుకున్నారు. ఈనెలాఖరున పదవీ విరమణ చేస్తుండటంతో.. రఘు ఇక పదోన్నతుల వసూళ్లకు తెరతీశారు. దాదాపు 54 మందికి పదోన్నతులిచ్చారు. విజయవాడ అయితే రూ.15 లక్షలు, విశాఖ అయితే మరికొంత ఎక్కువ.. ఇలా చోటును బట్టి రేటును ఫిక్స్‌ చేశారు. విజయవాడ కార్పొరేషన్‌లో టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌గా ఉన్న ఓ వ్యక్తి ఈ వసూళ్లు చేసినట్టు ఆరోపణలున్నాయి.

బినామీ బంధం ఇక్కడే బలపడింది..
రఘుతో పాటు శివప్రసాద్, గాయత్రి పేర్లు ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యాయి. గాయత్రి తల్లి విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పనిచేస్తూ చనిపోయింది. కారుణ్య నియామకంలో భాగంగా గాయత్రికి ఉద్యోగం వచ్చింది. అప్పట్లో రఘు విజయవాడలో పనిచేసేవారు. ఇక్కడే వీళ్లిద్దరి మధ్య చనువు ఏర్పడింది. ఈ క్రమంలో గాయత్రి భర్త శివప్రసాద్‌ ఉద్యోగం కూడా పర్మినెంట్‌ అయినట్టు తెలిసింది. విచిత్రమేమంటే రఘు సంపాదించిన ఆస్తులు.. ఆయన భార్య కంటే గాయత్రి పేరు మీదే ఎక్కువగా ఉన్నాయి. 

జీహెచ్‌ఎంసీలోనూ కొనసాగిన రఘు హవా..
విశాఖ నుంచి రఘు ఆ తర్వాత హైదరాబాద్‌ బదిలీ అయ్యారు. అక్కడా తన హవా కొనసాగించారు. అప్పట్లో కొందరు నేతలతో సంబంధాలు నెరిపి.. భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టారు. బహుళ అంతస్తులను ఎక్కడ నిర్మిస్తున్నారు? వాటి లోటుపాట్లు ఏమిటి? వంటివి తెలుసుకొని.. వెంటనే ఆయా నేతలకు సమాచారమివ్వడం, వారితో సెటిల్‌మెంట్లు, అనుమతు లు.. ఇలా క్షణాల్లో వ్యవహారాలను చక్కబెట్టేవారు. తన కన్నా పైస్థాయి అధికారులున్నా కూడా రఘు లెక్క చేసే వారు కాదు. సమీర్‌ శర్మ వంటి ఉన్నతస్థాయి అధికారి అండదండలు ఉండటం వల్లే రఘు ఈ విధంగా చెలరేగిపోయారనే ప్రచారం ఉద్యోగ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. అంత సంబంధం లేకపోతే సమీర్‌ కూతురు సుమేధా రఘు సంస్థలో పెట్టుబడులు ఎందుకు పెడుతుందని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

సమీర్‌తో పాటు మరికొందరు అధికారులు, నేతలూ అండదండలు అందించినట్టు తెలిసింది. మంత్రి నారాయణ సైతం.. గతంలో ఉన్న డీటీసీపీ తిమ్మారెడ్డి స్థానంలో రఘును తెచ్చుకున్నారం టే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. సీఆర్‌డీఏలో తాను చెప్పినవన్నీ చేసారనే ఉద్దేశంతోనే రఘుకు మంత్రి నారాయణ ఆ పోస్టు ఇప్పించారన్న ఆరోపణలున్నాయి. పలుమార్లు రఘుపై ఫిర్యాదులు వచ్చినా ఐఏఎస్‌ అధికారులతో పాటు మంత్రులూ చూసీ చూడనట్టు వ్యవహరించారని పురపాలక శాఖ వర్గాలు చెబుతున్నాయి.

పదోన్నతులు ఆపేయండి
పదోన్నతులు కల్పిస్తూ రఘు ఇచ్చిన ఆదేశాలపై ఆరోపణలు రావడంతో.. వెంటనే వాటిని నిలిపిపేయాలని మంత్రి నారాయణ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. కాగా, పదోన్నతులు అమలు చేయాలంటూ ఎమ్మెల్యేలు, మంత్రులు ఒత్తిడి తెస్తున్నారని అధికారులు చెప్పగా.. అయినా కూడా రఘు ఆమోదముద్ర వేసిన పదోన్నతులు అమలు చేయొద్దని మంత్రి సూచించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement