పరువు సర్వే
► అవినీతి అంశం నుంచి జనం దృష్టి మళ్లించేందుకు
► అక్రమ కట్టడాల సర్వే
► తొలిరోజే 110 భవనాలు గుర్తించినట్లు ప్రకటన
► నెల్లూరులో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ బృందాల హడావుడి
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో అవినీతి పెరిగిపోయిందని అధికార పార్టీ నేతలే బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో టీడీపీకి వచ్చిన చెడ్డపేరు నుంచి జనం దృష్టి మరల్చడానికి మంత్రి నారాయణ అక్రమ నిర్మాణాల కూల్చి వేత మంత్రం వేశారు. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టర్ రఘు నేతృత్వంలో సోమవారం ఆరు బృందాలు నగరంలో హడావుడి చేశాయి.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరును ఆదర్శ (మోడల్) కార్పొరేషన్‌గా తయారు చేస్తానని మున్సిపల్ శాఖమంత్రి నారాయణ అవకాశం వచ్చినప్పుడల్లా ప్రకటిస్తున్నారు. కార్పొరేషన్‌లో అవినీతి రహిత పాలన అందిస్తామని, అవినీతిని సహించేది లేదని సీఎం చంద్రబాబు నాయుడు నెల్లూరు పర్యటనకు వచ్చిన ప్రతి సందర్భంలో చెబుతున్నారు. వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తామని చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక భవన నిర్మాణ అనుమతి కోసం అసిస్టెంట్ సిటీ ప్లానర్ మునిరత్నం రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే.
ఈ లంచం సొమ్ము తనకు కాదనీ, కమిషనర్‌కు ఇవ్వడానికి తీసుకున్నానని ఏసీపీ ఇచ్చిన వాంగ్మూలం రాజకీయ మలుపు తీసుకుంది. మేయర్ అజీజ్‌కు పాలన చేతకాదనీ, ఆయన అవినీతిలో మునిగిపోయారని మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి బహిరంగ ఆరోపణలు చేశారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ ఆనమే అనీ, ఆయన హయాంలోనే కార్పొరేషన్‌ను నిలువునా దోచేశారని మేయర్ అజీజ్ ఎదురు దాడి చేయడంతో రాజకీయం వేడెక్కింది. కార్పొరేషన్‌లో అవినీతి పెరిగిపోయిందని అధికార పార్టీ నాయకులే ఆరోపించడంతో ప్రజల్లో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత తీసుకొచ్చింది.
నెల్లూరులో టీడీపీని బలంగా తయారు చేయాలని ఏ పార్టీ నుంచైనా, ఏ స్థాయి నాయకుడినైనా వల విసిరి చేర్చుకుంటున్న తరుణంలో ఈ రకమైన పరిస్థితి ఏర్పడటం అధికార పార్టీకి చెప్పలేనంత చెడ్డపేరు తెచ్చింది. నిఘా వర్గాలు ఇదే విషయం సీఎంకు నివేదించాయి. దీంతో మంత్రి నారాయణమీద సీఎం అసహనం వ్యక్తం చేశారు. సొంత కార్పొరేషన్‌నే గాడిలో పెట్టలేని వ్యక్తివి రాష్ర్టమంతా ఎలా పర్యవేక్షిస్తావని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారని వార్తలు వచ్చాయి. దీంతో మంత్రి నారాయణ రంగంలోకి దిగి కార్పొరేషన్‌లో జరిగే ప్రతి చిన్న వ్యవహారం తనకు తెలియాలనీ, మేయర్, కమిషనర్ సొంతంగా ఏ నిర్ణయాలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇక మీదట ఏ నాయకుడు బహిరంగంగా ఆరోపణలు చేయొద్దని గట్టిగా మందలించారు.
జనం దృష్టి మళ్లించడానికే..
ప్రభుత్వానికి, పార్టీకి వచ్చిన చెడ్డపేరు నుంచి జనం దృష్టి మళ్లించడానికి నెల్లూరులో ఏదో చేయబోతున్నట్లు మంత్రి నారాయణ అక్రమ భవనాల కూల్చివేత అంశాన్ని తెర మీదకు తెచ్చారు. ఇందుకోసం ఆరు బృందాలను పంపి అక్రమ భవనాల సర్వేకు శ్రీకారం చుట్టించారు. 2014 డిసెంబరులోపు అనుమతి లేకుండా నిర్మించి ఆ లోపు బీపీఎస్ పథకంలో దరఖాస్తు చేసుకుని ఉన్నవి మాత్రమే ఇప్పుడు సక్రమమైనవిగా గుర్తిస్తారు. ఆ తర్వాత అనుమతి లేకుండా నిర్మించినవీ, కార్పొరేషన్ అనుమతించిన ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మించిన భవనాలన్నీ అక్రమ కట్టడాల జాబితాలోకే వస్తాయి.
తొలిరోజే నగరంలో ఇలాంటివి 110 ఉన్నట్లు గుర్తించారు. వీరికి నోటీసులు జారీ చేసి అక్రమ కట్టడాలను కూల్చి వేయిస్తామనీ, ఇప్పటికే నోటీసులు ఇచ్చిన వాటిని కూడా నేలమట్టం చేస్తామని అధికారులు ప్రకటించారు. సర్వే పేరుతో మరో రెండు మూడు రోజులు హడావుడి చేయనున్నారు. అయితే వీరు గుర్తించిన అక్రమ కట్టడాలన్నీ కూల్చివేయడం సాధ్యమయ్యే పనేనా? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. నగరం నడిబొడ్డున కాలువను ఆక్రమించి ఖరీదైన హోటల్ ఏర్పాటు చేశారు. ఇక్కడే ఖరీదైన లాడ్జి నిర్మాణం జరుగుతూ ఉంది. ఇది అక్రమమా? సక్రమమా? అనే విషయం అధికారులు, అధికార పార్టీ నాయకులందరికీ తెలుసు. ఇలాంటి నిర్మాణాలు నగరంలో లెక్కకు మించి ఉన్నాయి.
ఇలాంటి వాటిని కూలదోసే ధైర్యం చేయగలుగుతారా? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాలువ గట్ల మీద ఉండే పేదల గుడిసెలు తొలగించి కార్పొరేషన్‌ను క్లీన్ చేశామని చెప్పుకుని ప్రజల్లో పార్టీకి పోయిన పరపతి మళ్లీ సంపాదించుకోవడం కోసం నడుపుతున్న వ్యవహారంగా టీడీపీ నాయకులే చెబుతున్నారు.