పొగతోట (శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు) : వరద బాధితులకు అందించాల్సిన నిత్యావసరాలు చౌక ధరల దుకాణాల్లో లేకపోవటంతో పౌర సరఫరాల శాఖ మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పరిటాల సునీత శనివారం ఉదయం నెల్లూరు నగరంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కొత్తూరులోని రేషన్ షాపులో తనిఖీలు చేశారు. అందులో బియ్యం మినహా ప్రభుత్వం వరద బాధితులకు సరఫరా చేసిన కందిపప్పు, చక్కెర, పామాయిల్ నిల్వలు లేవు.
అనంతరం ఆమె పొదలకూరు రోడ్డులోని మరో రేషన్ షాపును పరిశీలించారు. అందులో బియ్యం సహా సరుకులేమీ లేవు. ఈ పరిస్థితిపై ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసరాలను వెంటనే అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. రహదారులు దెబ్బతినటం, ఆగని వానల కారణంగానే తాము సరుకులను రవాణా చేయలేకపోయామని అధికారులు అంటున్నారు.