విజయవాడ: భారీ వర్షాల వల్ల ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు జిల్లాల్లో హై అలర్ట్ పరిస్థితి నెలకొంది. ప్రకాశం జిల్లాలోనూ దాదాపు ఇలాంటి పరిస్థితి నెలకొంది. నదులు, వాగులు, వంకలు ప్రవహిస్తుండటంతో రవాణా నిలిచి పోయింది. స్వర్ణముఖి, కలింది నదులు పొంగిపొర్లుతున్నాయి. నెల్లూరులోని కలింగి, కైవల్య, పంబలూరు ఇంకా ప్రవహిస్తూనే ఉన్నాయి. జాతీయ విపత్తు నిర్వహణ రక్షణ సిబ్బంది లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు కూడా నడపటం సాధ్యంకావడం లేదు.
ఉపరితల ద్రోణి అల్పపీడనంగా మారిందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో లంకకు సమీపంలో ద్రోణి కేంద్రీకృతమైనట్లు సమాచారం. అల్పపీడనం ఏర్పడిన ప్రాంతంలో 4.5 మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఉంటుంది. వచ్చే 24 గంల్లో దక్షిణ కోస్తాలో చెదురుముదురుగా, ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.