వక్రీకరణ అలా.. వాస్తవం ఇలా | Ministers and officials Comments On Fake News On Toxic gas | Sakshi
Sakshi News home page

వక్రీకరణ అలా.. వాస్తవం ఇలా

Published Thu, May 14 2020 4:13 AM | Last Updated on Thu, May 14 2020 4:13 AM

Ministers and officials Comments On Fake News On Toxic gas - Sakshi

విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా స్టైరీన్‌ వాసన వస్తోందా.. ఇళ్లలో ఊపిరి (గాలి) అందడం లేదా.. ఉండలేకపోతున్నారా.. పెద్ద సంఖ్యలో జనం ఇంకా ఆసుపత్రులకు వస్తున్నారా.. సమీపంలోని మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్‌లోని నీటిపై గ్యాస్‌ పేరుకుపోయిందా.. ఓ వర్గం మీడియాలో వస్తున్న కథనాలన్నీ వాస్తవమేనా? నిజంగానే అక్కడ ఇంకా అంత ప్రమాదకర పరిస్థితి ఉందా? స్టైరీన్‌ గ్యాస్‌ ఇంకా తన ప్రతాపం చూపుతోందా? ఇంతకూ ఏది వక్రీకరణ.. ఏది వాస్తవమో తెలుసుకుందాం.
– సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం 

వలంటీర్‌పై స్టైరీన్‌ ప్రభావమా?
వక్రీకరణ :  ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీకి ఆనుకుని ఉన్న వెంకటాపురం గ్రామంలో విషవాయువు ప్రభావం ఇంకా ఉందని, కొందరికి ఊపిరి అందడం లేదని.. ఈ క్రమంలో వార్డు వలంటీర్‌ నూకరత్నం స్పృహ తప్పి పడిపోయిందని ఓ వర్గం మీడియాలో పేర్కొన్నారు. 
వాస్తవం:   వెంకటాపురం నడి బొడ్డున ఉన్న సచివాలయంలో వార్డు వలంటీర్‌ నూకరత్నం.. ప్రమాదం జరిగాక శనివారం మొదలు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 దాటే వరకు నిరంతరాయంగా విధులు నిర్వర్తించింది. మంగళవారం ఉదయం కూడా ఎన్యూమరేషన్‌లో భాగంగా తనకు కేటాయించిన 50 ఇళ్లకు వెళ్లి వచ్చారు. 11 గంటల సమయంలో గ్రామ సచివాలయానికి మంత్రులు అవంతి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు, ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ రావడంతో సచివాలయ గది జనంతో కిక్కిరిసింది. దీంతో ఒక్కసారిగా ఆమె డీ హైడ్రేషన్‌తో బీపీ పెరిగి స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే పక్కనే ఉన్న జీవీఎంసీ ఏఎంహెచ్‌వో లక్ష్మీ తులసి ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత గోపాలపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ సాయంత్రం 4 గంటల వరకు చికిత్స తీసుకుని తర్వాత ఇంటికి వెళ్లిపోయింది.   

ఇబ్బంది ఉంటే మేమెలా పని చేయగలం? 
ప్రతి రోజూ వెంకటాపురం ఊరు మధ్యలో ఉన్న వార్డు సచివాలయంలోనే పని చేస్తున్నాం. రమాదేవి, ఆశాజ్యోతి, సత్య తులసితో పాటు సచివాలయ ఇన్‌చార్జ్‌ బాధ్యుడిగా నాతో సహా అందరం అక్కడే పని చేస్తున్నాం. ఘటన తర్వాత ఇక్కడికొచ్చినప్పుడు మొదట్లో కాస్త వాసన వచ్చింది. తర్వాత ఎలాంటి వాసన రావడం లేదు. నిజంగా ఇబ్బందికర పరిస్థితులుంటే మేమెలా పనిచేయగలం? 
– నాయుడు, వెంకటాపురం వార్డు సచివాలయం ఇన్‌చార్జ్‌   

ఊపిరి అందనంతటి విషమ పరిస్థితి ఉందా ?
వక్రీకరణ :  ఆ గ్రామాల్లోని ఇళ్లలో ప్రజలకు ఊపిరి ఆడటం లేదు. జనం పెద్ద సంఖ్యలో గోపాలపట్నం ఆసుపత్రికి వైద్యం కోసం వస్తున్నారు.
(ఓ దినపత్రికలో వార్త)
వాస్తవం: ‘నిజానికి ఊపిరి అందని విషమ పరిస్థితి ఎవరికీ లేదు. చిన్న చిన్న సమస్యలతో వచ్చి చికిత్స (ఇంజక్షన్‌) చేయించుకుని మందులు తీసుకుని వెళ్లిపోతున్నారు. ఇంత వరకు ఆసుపత్రిలో ఎవరూ అడ్మిట్‌ కాలేదు. అంతా ఓపీ (అవుట్‌ పేషెంట్‌) విభాగానికి వచ్చి వెళ్లిపోతున్నారు’ అని గోపాలపట్నం ఆసుపత్రి ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ శాంతిప్రభ స్పష్టం చేశారు. ’ఊపిరి అందడం లేదు..’ అని రాయడం సరికాదు.. నేను ఓ డాక్టర్‌గా చెబుతున్నాను.. అలా ఎలా రాస్తారో నాకు అర్థం కావడం లేదు. గ్యాస్‌ లీకైన నాలుగైదు రోజుల తర్వాత ఆ ప్రాంతంలో ఇళ్ల తలుపులు ఒక్కసారిగా తెరిస్తే.. అప్పటి వరకు మూసుకుపోయిన గదుల్లోని గ్యాస్‌ కాస్త బయటకు వస్తుంది. ఆ ప్రభావంతో కొందరు కొద్ది క్షణాలు ఇబ్బంది పడి ఉండొచ్చు. అలాంటి వారు మా వద్దకు వస్తే ప్రాథమిక చికిత్స చేసి పంపించేస్తున్నాం. అంతే కానీ ఊపిరి అందని పరిస్థితి ఎవ్వరికీ లేదు. నిజానికి నాకు రాజకీయాలతో సంబంధం లేదు. కానీ ఓ మాట చెబుతాను. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంచితనాన్ని కొందరు అలుసుగా తీసుకుంటున్నారు. ప్రభుత్వ పరంగా ఇంత చేసినా ఇంకా రాజకీయాలు చేస్తున్నారు’ అని ఆమె వ్యాఖ్యానించారు.

స్టైరీన్‌ లేదని ప్రతీ రిపోర్టులో వచ్చింది
ఘటన జరిగినప్పటి నుంచి ప్రతి రోజూ నీటి శాంపిళ్లు ల్యాబొరేటరీకి పంపించాం. 7, 8 తేదీల్లో తీసిన శాంపిళ్ల రిపోర్టుల్లో స్టైరీన్‌ లేదని వచ్చింది. ఇప్పటికీ నీటిని పరీక్షలకు పంపిస్తున్నాం. నిజంగా స్టైరీన్‌ నీటిలో కలిసిపోతే.. అందులోని చేపలు, ఇతర జీవులన్నీ ఇప్పటికే చనిపోవాలి. కానీ అలాంటిదేమీ జరగలేదు.  ప్రతి రిపోర్టులోనూ స్టైరీన్‌ మోతాదు లేనట్లు నివేదిక వచ్చినా, నీటిని ఒకటికి రెండు సార్లు శుద్ధి చేశాకే సరఫరా చేస్తాం.
– జి.సృజన, జీవీఎంసీ కమిషనర్‌

మేఘాద్రిగెడ్డపై ‘విష’ ప్రచారం 
వక్రీకరణ:  ఘటన జరిగిన ప్రాంతానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేఘాద్రిగెడ్డలో విషవాయువు స్టైరీన్‌ కారణంగా నీటిపై పచ్చని రంగు తెట్టు ఏర్పడిందంటూ ఓ పత్రికలో ఫొటో ఐటం వచ్చింది. 
వాస్తవం:  నీటిపై రంగు తెట్టు కాదు.. నాచు ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. ఎల్‌జీ పాలిమర్స్‌కు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్‌ నుంచి నగరంలోని 45, 46, 47, 48, 49వ వార్డుల్లోని 6,590 ఇళ్లకు నీటిని సరఫరా చేస్తుంటారు. అదేవిధంగా ఆర్మీకి చెందిన మిలటరీ ఇంజనీరింగ్‌ సర్వీస్‌ (ఎంఈఎస్‌), తూర్పు నౌకాదళానికి చెందిన డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ నేవల్‌ ప్రాజెక్టŠస్‌(డీజీఎన్‌పీ)కు బల్క్‌ నీటి కనెక్షన్‌ అందిస్తున్నారు. మొత్తంగా మేఘాద్రిగెడ్డ నుంచి 8 మిలియన్‌ గ్యాలన్ల నీటిని ప్రతి రోజూ సరఫరా చేస్తుంటారు. 

► ఈ నెల 7వ తేదీన దుర్ఘటన జరిగిన వెంటనే నీటి సరఫరా నిలిపేశారు. ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలు అందించేలా జీవీఎంసీ నీటి సరఫరా విభాగం చర్యలు తీసుకుంది.
► మేఘాద్రిగెడ్డలోని నీరు విషతుల్యం అయ్యిందా.. లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు జీవీఎంసీ చర్యలు ప్రారంభించింది. విశాఖలోని రీజనల్‌ వాటర్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీ ప్రతినిధులు ఈ నెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆ నీటి శాంపిళ్లను పరీక్షల కోసం తీసుకెళ్లారు.  
► 7, 8వ తేదీల్లో తీసుకున్న శాంపిళ్లలో స్టైరీన్‌ మోనోమర్‌ అవశేషాలు లేవని స్పష్టం చేశారు. నీటిలో ఉన్న లవణాలు, ఇతర వాల్యూస్‌ అన్నీ.. వినియోగించేందుకు సురక్షితంగా ఉన్నాయని రిపోర్టులో స్పష్టం చేశారు.   

స్టైరీన్‌ కలిసి ఉంటే జలచరాలు చనిపోలేదే!
రీజనల్‌ లేబొరేటరీ ఇచ్చిన తొలి రోజు రిపోర్టు, ప్రస్తుత పరిస్థితులు పరిశీలిస్తే.. నీటిలో ఎలాంటి విషవాయువు అవశేషాలు కలవలేదని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఒకవేళ నీరు కలుషితమై ఉంటే అందులో ఉండే జలచరాలు మృత్యువాత పడేవి. కానీ అది జరగలేదు. స్టైరీన్‌ బరువైన వాయువు కాబట్టి నీటి ఉపరితలంపై పొరలా ఏర్పడిందనుకుంటే నీటిలోని ఆక్సిజన్‌ తగ్గి ఉండాలి. ఫలితంగా జలచరాలు మృత్యువాత పడి ఉండాలి. కానీ అదేమీ జరగలేదు. 

నిల్వ ఉండే నీటిలో నాచు ఉండదా? 
మేఘాద్రిగెడ్డ నీటిని 7వ తేదీ నుంచి వాడటం లేదు. గేటు సమీపంలో ఎప్పటికప్పుడు నాచు ఏర్పడుతుంటుంది. దాన్ని 10 రోజులకోసారి శుభ్రం చేస్తుంటాం. ఘటన జరిగిన తర్వాత.. ఆ నీటిని పూర్తిగా వినియోగించడం లేదు. నిల్వ ఉండే నీటిలో నాచు ఏర్పడటం సహజం. దానిని చూసి.. రంగు పొరలు ఏర్పడ్డాయనడం సరికాదు. భయపడాల్సిన అవసరం లేదు. 
– వేణుగోపాల్, జీవీఎంసీ నీటి సరఫరా విభాగం ఎస్‌ఈ  

నాచు ఎందుకు ఏర్పడిందంటే..
మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్‌ గరిష్ట నీటిమట్టం 61 అడుగులు కాగా, ప్రమాదం సంభవించే సమయానికి 57.5 అడుగుల నీటి మట్టం ఉంది. 9వ తేదీ రాత్రి కురిసిన వర్షానికి మరో అడుగు నీరు రిజర్వాయర్‌లో చేరి ప్రస్తుతం 58.6 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి గెడ్డల్లో నీరు రిజర్వాయర్‌లో చేరినప్పుడు గెడ్డల నుంచి వచ్చే నాచు ఇక్కడ పొరలుగా ఏర్పడిందే తప్ప.. విషవాయువు ప్రభావం వల్ల కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 

ఊపిరి అందనిది ఎల్లో బ్యాచ్‌కే : బొత్స   
చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఓ దుర్ఘటన జరిగిన వెంటనే బాధితులకు పెద్ద మొత్తంలో నష్ట పరిహారం చెల్లింపుతో పాటు శరవేగంగా పునరావాసం, నష్ట నివారణ చర్యలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. అయితే జనానికి మంచి చేస్తే చూడలేని విషపు మీడియా ఇష్టారాజ్యంగా కథనాలు వండి వారుస్తోంది. అందులో భాగంగానే ‘ఈనాడు’లో అసత్య వార్తలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. వెంకటాపురం గ్రామానికి చెందిన కొద్ది మంది ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటే.. గ్రామాల్లో ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా వార్తలు రాయడం అమానుషం. ప్రజలకు ధైర్యం చెప్పే విధంగా.. అధికారులకు మార్గదర్శకం చేసే విధంగా వార్తలు ఉండాలి కానీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా విషం చిమ్మడం సరికాదు. 

బాబు జమానాలో అరకొర పరిహారం
అందులోనూ జాప్యం..
హుద్‌హుద్‌ తుపాన్, విశాఖ తుపాన్‌ విరుచుకుపడిన తేదీ:    2014 అక్టోబర్‌ 13
మృతులు: 46 మంది 
ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా: రూ.5 లక్షలు
ఇచ్చిన తేదీ:  2015 జనవరి 20 (వంద రోజుల తర్వాత ఇచ్చారు)
గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట, రాజమండ్రి
ఘటన జరిగిన తేదీ:  2015 జూలై 14
మృతులు: 29 మంది 
ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా: రూ.10 లక్షలు
ఇచ్చిన తేదీ: క్షతగాత్రులకు 4 నెలల తర్వాత అరకొరగా చెల్లింపు

కృష్ణా నదిలో బోటు మునక, విజయవాడ
ఘటన జరిగిన తేదీ:    2017 నవంబర్‌ 12 
మృతులు:     21 మంది 
ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా :     రూ.10 లక్షలు
ఇచ్చిన తేదీ :     2017 నవంబర్‌ 30
 
తిత్లీ తుపాన్, ఉత్తరాంధ్ర
తుపాన్‌ విరుచుకుపడిన తేదీ:  2018 అక్టోబర్‌ 11
మృతులు:   8 మంది
ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా :  రూ.5 లక్షలు 
ఇచ్చిన తేదీ :  2018 నవంబర్‌ 6

గోదావరిలో బోటు మునక, వాడపల్లి–మంటూరు, తూర్పుగోదావరి జిల్లా
ఘటన జరిగిన తేదీ:  2018 మే 17
మృతులు :  22 మంది 
ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా :  రూ.10 లక్షలు 
ఇచ్చిన తేదీ :  2018 మే 28

స్కూల్‌ ఆటో బోల్తా, ఫిరంగిపురం, గుంటూరు జిల్లా
ఘటన జరిగిన తేదీ:  2017 డిసెంబర్‌ 28
మృతులు :  ఐదుగురు విద్యార్థులు,ఆటో డ్రైవర్‌
ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా :  రూ.5 లక్షలు
ఇచ్చిన తేదీ :   2018 మార్చి 31

అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ పేరేచర్లలో జరిగిన పాదయాత్రలో దీనిపై అప్పటి సీఎం చంద్రబాబును నిలదీశారు. దీంతో కొద్ది నెలలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియాలో మూడు లక్షలు కోత పెట్టి రూ.2 లక్షలు చెల్లించింది.

గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలుడు, నగరం, తూ.గో. జిల్లా
మృతులు: 22 మంది
ఘటన జరిగిన తేదీ : 2014 జూన్‌ 27
ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా :  రూ.3 లక్షలు
ఇచ్చిన తేదీ:  2014 జూన్‌ 30 
(గెయిల్, కేంద్ర ప్రభుత్వం మూడు రోజుల్లోనే ఎక్స్‌గ్రేషియా చెల్లించటంతో రాష్ట్ర వాటా పరిహారం అదే రోజు ఆ మొత్తంతో కలిపి ఇచ్చారు.)

ఇప్పుడు విశాఖ ఘటనలో.. 
రూ. కోటి పరిహారం 5 రోజుల్లో చెల్లింపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement