జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులతో కలిసి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు గంటా శ్రీనివాసరావు, పసుపులేటి బాలరాజు, ఎమ్మెల్యేలు ఆదివారం పర్యటించారు.
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులతో కలిసి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు గంటా శ్రీనివాసరావు, పసుపులేటి బాలరాజు, ఎమ్మెల్యేలు ఆదివారం పర్యటించారు. చోడవరం మండలం పీఎస్‌పేటలో పర్యటించినప్పుడు రైతులు నిలదీశారు. పరిశీలించి వెళ్లడం తప్ప సమస్యను పరిష్కరించడం లేదంటూ మంత్రుల కాన్వాయ్‌ను రైతులు, మహిళలు అడ్డుకున్నారు. ఎంతకీ రైతులు కదలకపోయేసరికి బొత్స సత్యనారాయణ కారులోంచి దిగి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆయన్ని కూడా మహిళా రైతులు నిలదీశారు.
ఈ సందర్భంగా కొంతమంది బొత్సకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. అంతకు ముందు అనకాపల్లి మండలం దేవీనగర్ ప్రాంతాన్ని బ్రిడ్జిపై నుంచి మాత్రమే పరిశీలించారు. ఏటా వరదలొచ్చినా సమస్య పరిష్కారానికి కృషి చేయడం లేదని, ఏమాత్రం ఆదుకోవడం లేదని ఒక మహిళ మంత్రి గంటాను నిలదీశారు. అనంతరం ఏఎంఏఎల్ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు.
ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం మంత్రి గంటా శ్రీనివాసరావు గాజువాక, పెందుర్తిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.57వ వార్డులోని ఉప్పరకాలనీ యాతపాలెం, హరిజనకాలనీలో పర్యటించి వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. అనంతరం వడ్డపూడి పునరావాస కాలనీ, షీలానగర్ ప్రాంతాలలో పర్యటించి ముంపు ప్రభావాన్ని పరిశీలించారు. ఇదే సందర్భంలో పెందుర్తి జీవీఎంసీ కల్యాణ మండపంలో ఆశ్రయం పొందుతున్న ఏకలవ్య కాలనీ వాసులను పరామర్శించారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకట్రామయ్య, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబు, యూ.వి.రమణమూర్తిరాజు, అధికారులు ఉన్నారు.