విజయవాడ : విజయవాడ భవానీపురంలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం అదృశ్యమైన 9వ తరగతి విద్యార్థి కృష్ణవంశీ... అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వీటీపీఎస్ కూలింగ్ కెనాల్‌లో బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి చనిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వంశీకృష్ణ మృతితో భవానీపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రోజూ కళ్ల ముందే ఉండే బిడ్డ కానరానిలోకాలకు వెళ్లడంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదంటూ రోదిస్తున్నారు. తమ బిడ్డను ఎవరో కక్ష కట్టే చంపారని ఆరోపిస్తున్నారు. బాగా చదువుతాడనే అక్కసుతో తన కుమారుడిని చంపేశారని కృష్ణవంశీ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.