=చక్కెర నిల్వల్లో తేడా
=చిత్తూరు చక్కెర ఫ్యాక్టరీలో మాయాజాలం
=నోరు మెదపని అధికారులు
=ఆగ్రహించిన కలెక్టర్
చిత్తూరు(గిరింపేట), న్యూస్‌లైన్: చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీలో తయారైన చక్కెర నిల్వల లెక్క తప్పినట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీ అధికారులు చెబుతున్న లెక్కలకు, అక్కడున్న స్టాక్‌కూ పొంతన కుదరడం లేదు. వారి లెక్కల ప్రకారంగా తీసుకున్నా సుమారు 1,500 బస్తాల చక్కెర లెక్కల్లోకి రావడం లేదు. ఈ విషయం పత్రికల్లో రావడంతో ఫ్యాక్టరీ పర్సన్ ఇన్‌చార్జి అయిన కలెక్టర్ సీరియస్ అయినట్లు తెలిసింది. లెక్కలు సరిపెట్టకపోతే అందరూ ఇళ్లకు వెళ్లిపోతారంటూ సంబంధిత అధికారులపై ఆయన తీవ్రంగా మండిపడినట్లు విశ్వనీయ సమాచారం.
పొంతన కుదరని లెక్క
చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీలో నవంబర్ 27 నుంచి ఈ నెల 12వ తేదీ వరకు 21 వేల టన్నుల చెరుకు క్రషింగ్ చేయగా 7.5 శాతం చక్కెర రికవరీ అయిందని అధికారులు లెక్క చెబుతున్నారు. వారి లెక్క ప్రకారం పదిశాతం రికవరీ అయితే టన్ను చెరుకుకు క్వింటాలు చక్కెర ఉత్పత్తి కావాలి. ప్రస్తుతం 7.5 శాతం రికవరీ కావడంతో 21 వేల టన్నుల చెరుకుకు 15,750 క్వింటాళ్ల చక్కెర ఉత్పత్తి కావాల్సి ఉంది. అధికారులు మాత్రం 14 వేల క్వింటాళ్ల చక్కెర ఉత్పత్తి అయినట్లు చెబుతున్నారు. ఇందులో 11 వేల క్వింటాళ్లు గోడౌన్‌లో, ఆరేడు వందల క్వింటాళ్లు రీమెల్టింగ్ కోసం ఫ్యాక్టరీలో, మరో రెండున్నర వేల క్వింటాళ్ల చక్కెరకు సంబంధించిన చెరుకురసం ఫ్యాక్టరీ జూస్ కంటైనర్లలోనూ స్టాక్ ఉన్నట్లు పేర్కొంటున్నారు.
ఇవి మొత్తం కలిపినా 14 వేల క్వింటాళ్లకు మించడం లేదు. దీన్నిబట్టి చూస్తే 1,500 బస్తాలు లెక్కకు రావడం లేదు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తే సంబంధిత అధికారులు నోరు మెదపడం లేదు. పైగా అక్రమాలను వెలుగులోకి తెస్తున్న పత్రికలపైకి రైతులు, రైతు నాయకులను ఉసిగొల్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలావుండగా ఫ్యాక్టరీలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై పత్రికల్లో కథనాలు వెలువడడంతో కొంతమంది రైతులు, రైతునాయకులు ఫ్యాక్టరీకి వెళ్లి అధికారులతో శనివారం చర్చించారు.
బిజీబిజీగా అధికారులు
చక్కెర బస్తాల లెక్క సరిపెట్టే ప్రయత్నంలో అధికారులు శనివారం బిజీబిజీగా కనిపించారు. గతఏడాది తయారైన చక్కెర నిల్వలు సుమారు 55 వేల క్వింటాళ్లు పక్కనే గోడౌన్‌లో ఉన్నాయి. దాన్ని కొత్తస్టాక్‌లోకి చేర్చి లెక్క సరిచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని తెలిసింది. అంతేకాకుండా గత ఏడాది స్టాక్‌లో వేస్టేజీగా ఉన్న చక్కెరను కొత్తబస్తాల్లో నింపి దాన్ని కొత్తస్టాక్‌లో కలుపుతున్నారని తెలిసింది. ఏదోఒక రకంగా తేడా వస్తున్న లెక్కను సరిచేసే క్రమంలో అధికారులు తలమునకలైనట్లు సమాచారం.
ఈ విషయమై ఫ్యాక్టరీ ఎండీ వెంకటేశ్వరరావును వివరణ కోరేందుకు ‘న్యూస్‌లైన్’ ఫోన్‌లో ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఇదిలావుండగా ఫ్యాక్టరీ ఎండీ ఉద్యోగులు, కార్మికులతో శనివారం విడివిడిగా సమావేశమయ్యారు. ఫ్యాక్టరీలోని విషయాలను ఇక్కడి వారే పత్రికలకు లీక్ చేస్తున్నారని, వారెవరో తేలితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్లు సమాచారం. ఫ్యాక్టరీ పర్సన్ ఇన్‌చార్జి అయిన కలెక్టర్ చొరవ తీసుకుంటే తప్ప అక్రమాలు వెలుగులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
లెక్క తప్పింది
Published Sun, Dec 15 2013 4:01 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement