అర్ధరాత్రి నెల్లూరుకు..తెల్లవారుజామున హైదరాబాద్‌కు
మంత్రి నారాయణపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే అనిల్
నెల్లూరు(సెంట్రల్) : రాష్ట్ర మున్సిపల్ మంత్రి నారాయణ నగరానికి అర్ధరాత్రులు రావడం.. తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్‌కు వెళ్తూ ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కనీసం మంత్రి ఎప్పుడొస్తారో అధికారులు కూడా తెలియదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
నాలుగు నెలల క్రితం కార్పొరేషన్ సమావేశంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రి నారాయణ సమక్షంలో రెండు నెలల్లో హడ్కో నిధులు వస్తాయని అగ్రిమెంట్ చేసుకున్నారని, అయితే ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడంలేదని విమర్శించారు. అసలు హడ్కో నిధులు వస్తాయో.. లేదో తెలపాలని డిమాండ్ చేశారు. నగరంలో చాలా చోట్ల రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, ఈ విషయమై కార్పొరేషన్ పాలకులను అడిగితే హడ్కో నిధులు వస్తాయంటూ మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. మంత్రి నారాయణ అర్ధరాత్రి పర్యటనలంటూ నాలుగు రోడ్లు తిరిగి వెళ్లిపోవడం తప్ప, చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.
పగలు తిరిగితే సమస్యలపై నిలదీస్తారనే భయం నారాయణకు పట్టుకున్నట్లుందని ఎద్దేవా చేశారు. అధికారం చేపట్టి ఇన్ని నెలలైనా ఇంత వరకు నగరానికి రూ.10 లక్షల ఖర్చు పెట్టారానని ప్రశ్నించారు. నగరంలో తాగునీటి సమస్య.. అధ్వానంగా మారిన పారిశుధ్యం.. కుక్కల బెడదతో ప్రజలు విలవిలలాడుతున్నారన్నారు. ప్రజాసమస్యలపై ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తే విమర్శిస్తున్నారనడం తప్ప మంత్రి చే సిందేమీలేదని ఎద్దేవా చేశారు. కార్పొరేషన్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేటర్లు ఊటుకూరు మాధవయ్య, ఓబిలి రవిచంద్ర, దేవరకొండ అశోక్, నాయకులు వందవాసి రంగ, కుంచాల శ్రీనివాసులు, వేలూరు మహేష్ పాల్గొన్నారు.