అమరావతి: కార్పొరేట్ సంస్థల నిర్వాహకులను మంత్రులుగా నియమిస్తే పాలన కూడా వ్యాపార పరంగానే ఉంటుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. ఆయన గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావులు ఎన్నికల సమయంలో టీడీపీ పార్టీ గెలుపుకు రూ.700 కోట్లు వరకు ఖర్చు చేశారని, అప్పుడు చేసిన ఖర్చును రెండింతలు సంపాదించేందుకు అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
పదో తరగతి పరీక్షా పత్రాలు మంత్రి నారాయణకు చెందిన విద్యాసంస్ధలో లీక్ అయితే, దానిపై చర్చించేందుకు అవకాశం ఇవ్వకుండా విద్యార్ధుల భవిష్యత్‌ను టీడీపీ ప్రభుత్వం నాశనం చేస్తోందన్నారు. ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదా అని ప్రశ్నిస్తూ ఈ ప్రశ్న పత్రాల లీకేజిపై విచారణ చేస్తుండగానే ఇతర పేపర్లు కూడా లీకు అవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని రాచమల్లు ప్రశ్నించారు.
పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజిపై ముఖ్యమంత్రి ఒక మాట, మంత్రులు గంటా, నారాయణలు వేర్వేరుగా ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. 6.50 లక్షల విద్యార్ధుల సమస్యలపై సభలో చర్చించేందుకు ప్రయత్నిస్తుంటే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీయిజం చేస్తోందని ఆరోపిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.