ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పలేదు! | did not make any promisse on job assurance, says minister narayana | Sakshi
Sakshi News home page

ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పలేదు!

Published Tue, Mar 15 2016 10:44 AM | Last Updated on Tue, Oct 30 2018 4:08 PM

ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పలేదు! - Sakshi

ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పలేదు!

తాము ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న వాగ్దానం చేయలేదని అసెంబ్లీ సాక్షిగా పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. తాము నైపుణ్యాభివృద్ధి చేస్తామన్నామే తప్ప.. ఎక్కడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లేవనెత్తారు. సీఆర్‌డీఏ చట్టంలో ఏవేం వాగ్దానాలు చేశారో చూడాలని, వాటిలో ఏ ఒక్కటీ ఈరోజు వరకు నెరవేర్చలేదని చెప్పారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ముందు చెప్పి, ఇప్పుడు ఆ వాగ్దానం ఇవ్వలేదని చెప్పడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజధానికి 30 వేల ఎకరాల భూములిచ్చిన రైతులందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సోమవారం కూడా సభలో చెప్పారని, కానీ.. రైతులు పొలాలు పోయి, వ్యవసాయం గానీ ఉపాధి గానీ లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో మీరు చెప్పిన ఇంటికో ఉద్యోగం ఇప్పుడు ఇవ్వలేకపోతున్నామని చెప్పడం అన్యాయమని మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో 50 వేల మందికి పైగా అర్హులైన యువతీ యువకులు ఉంటే వాళ్లలోంచి తొలి దశ కింద 113 మందిని మాత్రమే ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చారని.. కానీ రూపాయి కూడా స్టైపండ్ ఇవ్వలేదు, కనీసం బస్సు చార్జీలు కూడా ఇవ్వలేదని అన్నారు. వాళ్లు సీఆర్‌డీఏ ఆఫీసుకు వచ్చి, తాము బయట ఉద్యోగాలు కూడా వదులుకుని వచ్చామని, ఎందుకు ఉద్యోగాలు ఇవ్వరని అడిగితే పోలీసులతో బలవంతంగా కొట్టించి పంపారని తెలిపారు. చివరకు ప్రభుత్వం తాను చెప్పిన పనులు చేయడం లేదన్న ఆవేదనతో అక్కడ ఓ సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ రాజీనామా కూడా చేశారన్నారు. ఇప్పుడు అసలు వాగ్దానమే చేయలేదనడం అన్యాయమని మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో యువతీ యువకులకు కనీసం సిమెంటు బొచ్చెలు మోసే పనికూడా ఇవ్వకపోవడం దారుణమని, కనీసం పొలాలు ఇచ్చిన రైతుల కుటుంబాల్లో ఒకరికైనా ఉద్యోగం ఇవ్వాలని.. లేనిపక్షంలో వాళ్లకు 2వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement