అలక పాన్పుపైనే..
♦ ఇద్దరు గన్‌మెన్లను వెనక్కి పంపిన చింతమనేని
♦ ప్రభుత్వ ఆదేశాల అనంతరమే నిర్ణయమన్న ఎస్పీ
సాక్షి ప్రతినిధి, ఏలూరు : మంత్రి పదవి ఇవ్వలేదని అలకపాన్పు ఎక్కిన ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంకా దిగిరాలేదు. తనకు ఇద్దరు గన్‌మెన్లు చాలంటూ.. ఇద్దర్ని వెనక్కి పంపడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం చింతమనేనికి 2+2 పద్ధతిలో నలుగురు గన్‌మెన్లు భద్రతగా ఉన్నారు. వీరిలో ఇద్దరు విధుల్లో ఉంటే.. ఇద్దరు విశ్రాంతిలో ఉంటారు. తనకు ఇద్దరు గన్‌మెన్లు చాలని, మిగిలిన ఇద్దరిని వెనక్కి పంపించారు.
ఈ అంశంపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేనందున ఆ ఇద్దరిని కూడా విధులు నిర్వహించాలంటూ జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ తిరిగి చింతమనేని వద్దకు తిప్పి పంపారు. ప్రభుత్వం నుంచి అదేశాల కోసం ఎదురుచూస్తున్నామని, ఆదేశాలు వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. మంత్రి పదవి రాకపోవడంతో తొలుత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన చింతమనేని నేరుగా అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా లేఖ పంపించిన విషయం విదితమే.
ఆ తర్వాత ముఖ్యమంత్రిని కలిసిన ఆయన పార్టీకి కట్టుబడి ఉంటానని, నిబద్ధతతో పనిచేస్తానంటూ పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. ఇది జరిగిన 24 గంటలకే తనకు కల్పించిన భద్రతను సగానికి తగ్గించుకోవడం చర్చనీయాంశంగా మారింది. అంతా సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో ఆయన మరో పరిణామానికి తెరతీయడంతో వ్యవహారం మొదటికొచ్చినట్టయ్యింది.
అసలు చింతమనేని ఏం చేయాలనుకుంటున్నారు, తన రాజకీయ భవిష్యత్తుపై ఆయన ఏవిధంగా ముందుకు వెళతారనే అంశాలపై చిక్కుముడి వీడటం లేదు. ఇద్దరు గన్‌మెన్లను ఉపసంహరించుకోవడంపై చింతమనేని ప్రభాకర్ స్పందిస్తూ తనకు ప్రజలే రక్షణగా ఉంటారని, గన్‌మెన్లు అవసరం లేదని నిశ్చయించుకున్నట్టు వ్యాఖ్యానించారు.