జల్సాల కోసం గొలుసు చోరీలు | The four young men in police custody | Sakshi
Sakshi News home page

జల్సాల కోసం గొలుసు చోరీలు

Published Thu, May 28 2015 2:21 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

The four young men in police custody

ఏలూరు (సెంట్రల్): జల్సాల కోసం గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు యువకులు, ఒక మైనర్ బాలుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 562 గ్రాముల బంగారు వస్తువులను, నేరాలకు ఉపయోగించిన మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఒకరు పాలిటెక్నిక్, ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ఉన్నారు. ఏలూరులోని తన కార్యాలయంలో బుధవారం కేసు వివరాలను ఎస్పీ భాస్కర్‌భూషణ్ విలేకరులకు వివరించారు. నిడమర్రు మండలం బావాయిపాలెంకు చెందిన మండపాక నాగేంద్ర కృష్ణబాబు (20) ఇంటర్మీడియెట్ చదువుతూ మధ్యలో మానివేశాడు. వ్యసనాలకు బానిసై మోటార్ సైకిల్‌పై వెళుతూ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేవాడు.
 
 కొంతకాలం తర్వాత గణపవరం వెలమపేటకు చెందిన చిప్పాడ వంశీ (20), తోటవారి వీధికి చెందిన శెట్టి సాయికుమార్ (20), గణపవరం మండలం వరదరాజపురం గ్రామానికి చెందిన సూరిబోయిన వెంకట విజయ్‌కుమార్ (19), మరో మైనర్ బాలుడితో కలిసి గ్యాంగ్‌గా ఏర్పడ్డాడు. వీరంతా మోటార్‌సైకిళ్లపై తిరుగుతూ ఒంటరిగా వెళుతున్న మహిళల మెడలోని బంగారు వస్తువులను దొంగిలించేవారు. ఇలా తాడేపల్లిగూడెం, తాడేపల్లిగూడెం రూరల్, పెంటపాడు, నల్లజర్ల, ఇరగవరం, తణుకు రూరల్, భీమవరం, కాళ్ల, కొవ్వూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో సుమారు 26 చోరీలకు పాల్పడ్డారు. బంగారు వస్తువులను అమ్మి వచ్చిన సొమ్ములతో విలాసవంతంగా గడిపేవారు.  
 
 కృష్ణబాబు ప్లాన్ ప్రకారమే..
 దొంగతనాలు చేసే విషయంలో ముఠా నాయకుడు కృష్ణబాబు ప్లాన్ ప్రకారమే మిగిలిన వారు నడుచుకునేవారు. కృష్ణబాబు దొంగతనానికి వెళ్లినప్పుడల్లా ఒకరిని వెంట తీసుకువెళ్లేవాడు. రెండు రోజులపాటు ఆయూ ప్రాంతాల్లో నిఘా పెట్టి పరిశీలించేవారు. ఆ తర్వాత సమయం చూసుకుని ఒంటరిగా వెళుతున్న మహిళలను టార్గెట్ చేసేవారు. చోరీలు చేసి వచ్చిన సొత్తును అమ్మి జల్సాలు చేసుకునేవారు. వీరిలో వంశీ భీమవరంలో పాలిటెక్నిక్, సారుుకుమార్, విజయ్‌కుమార్ తాడేపల్లిగూడెంలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. మైనర్ బాలుడు ఇంటి వద్ద ఉంటూ కూలి పనులకు వెళుతుంటాడు.
 
 దొరికిందిలా..
 తాడేపల్లిగూడెంలోని యాగరపల్లి ఓవర్ బ్రిడ్జ్‌పై బుధవారం పోలీసులు తనిఖీ చేస్తుండగా దొంగతనానికి వెళ్లి తిరిగి వస్తున్న కృష్ణబాబు మరో యువకుడు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో వీరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. చోరీల విషయూలు బయటపడటంతో మిగిలిన యువకులు, మైనర్ బాలుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 26 కేసులకు సంబంధించి సుమారు రూ.14 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కొవ్వూరు డీఎస్పీ ఎన్.వెంకటేశ్వరరావు, తాడేపల్లిగూడెం టౌన్ సీఐ కె.శ్రీనివాసరావు, ఎస్సైలు సీహెచ్ కొండలరావు, క్రైమ్ ఎస్సై ఎంవీ పురుషోత్తమ్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
 
 ఇద్దరు దొంగలు అరెస్ట్
 చాగల్లు పోలీసుస్టేషన్ పరిధిలో దుకాణాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి రూ.1.30 లక్షలు, రూ.85 వేల విలువైన దుస్తులు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ భాస్కర్‌భూషణ్ తెలిపారు. చాగల్లు మండలం చంద్రవరం గ్రామానికి చెందిన ఆకుల నందిరాజు, మల్లవరం గ్రామానికి చెందిన రాయుడు నరేష్ చాగల్లులోని పలు వస్త్ర దుకాణాలు, సెల్‌షాపుల్లో చోరీలకు పాల్పడ్డారు. స్థానికులకు వీరిపై అనుమానం కలగడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలు బయటపడ్డారుు. దొంగతనాలను చేధించిన నిడదవోలు సీఐ ఎం.బాలకృష్ణ, చాగల్లు ఎస్సై ఎం.జయబాబును ఎస్పీ అభినందించారు.
 
 సూపర్‌బజార్‌లో చోరీ
 కొయ్యలగూడెం: కొయ్యలగూడెం మెయిన్‌రోడ్డులోని వినాయక శ్రీనివాస సూపర్‌బజార్‌లో బుధవారం వేకువజామున చోరీ జరిగింది. దుకాణానికి వెనుక ఉన్న తలుపులు పగులగొట్టి దుండగులు లోనికి చొరబడ్డారు. రూ.25 వేల నగదు, రూ.10 వేల విలువైన కిరాణా సామాన్లు చోరీకి గురైనట్టు యజమాని కొల్లూరి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చోరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌కు 50 మీటర్ల దూరంలో ఎదురుగా  దుకాణం ఉండటం గమనార్హం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement